రైతుల భూముల్లో అభివృద్ధి అగ్గి
మహా విష్ణువు వామనుడు రూపంలో వచ్చాడు. బలిచక్రవర్తి ముందు దేహీ అని నిలుచున్నాడు. తమరికేమి కావాలి స్వామీ అని అడిగితే..మూడు అడుగులు అని బదులిచ్చాడు. రెండు అడుగులతో సమస్తాన్ని ఆక్రమించేశాడు. ఇక మూడో అడుగు ఎక్కడ అని వామనుడు అడగకుండానే..నెత్తి చూపించాడు బలి. అలా అథఃపాతాళానికి వెళ్లిపోయాడు బలి చక్రవర్తి. ఇప్పుడు అన్నపూర్ణగా ప్రపంచం కీర్తించే ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతలు బలిచక్రవర్తి అవతారంలో ఉన్నారు. విజన్ 2019 వామనుడు..మూడో అడుగు బలిచక్రవర్తి వంటి అన్నదాతల తలపై పెట్టాడు. ఆ […]
మహా విష్ణువు వామనుడు రూపంలో వచ్చాడు. బలిచక్రవర్తి ముందు దేహీ అని నిలుచున్నాడు. తమరికేమి కావాలి స్వామీ అని అడిగితే..మూడు అడుగులు అని బదులిచ్చాడు. రెండు అడుగులతో సమస్తాన్ని ఆక్రమించేశాడు. ఇక మూడో అడుగు ఎక్కడ అని వామనుడు అడగకుండానే..నెత్తి చూపించాడు బలి. అలా అథఃపాతాళానికి వెళ్లిపోయాడు బలి చక్రవర్తి. ఇప్పుడు అన్నపూర్ణగా ప్రపంచం కీర్తించే ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతలు బలిచక్రవర్తి అవతారంలో ఉన్నారు. విజన్ 2019 వామనుడు..మూడో అడుగు బలిచక్రవర్తి వంటి అన్నదాతల తలపై పెట్టాడు. ఆ అడుగును అడ్డుకునే వారు లేరు. అడిగేవారు అభివృద్ధి కంటకులు. ఆందోళన చేసే అన్నదాతలు అతివాదులు. ఇదీ అన్నపూర్ణపై వామనుడి మూడో అడుగు ప్రతాపం. పచ్చని పొలాలు, మూడు పంటలు పండే భూములు, బీడు నేలలు, జరీబు భూములు, గ్రామకంఠాలు, సముద్రతీరంలో చౌడు భూములు.. ఒకటేమిటి..వామనుడు కోటరీలో ఏ ఒక్క పెద్దతలకాయ కన్ను భూములపై పడినా ..అక్కడో ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రకటన విడుదల అవుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులు అభివృద్ధి మంత్రం జపిస్తారు. భూ సమీకరణకు దిగుతారు. కాదంటే భూసేకరణ అస్ర్తం ప్రయోగిస్తారు. సామదాన భేద దండోపాయాలు ప్రయోగిస్తారు. ఇదీ నయా వామనుడి మూడో పాదం మహిమ.
రాజధాని నుంచి మొదలైన భూకంపం
రాష్ర్ట విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని అవసరమైంది. శివరామకృష్ణన్ కమిటీ 13 జిల్లాలు తిరిగింది. ఓ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక బుట్టదాఖలై.. అమరావతి పేరుతో తామనుకున్న చోట రాజధాని నిర్మాణానికి భూమిపూజ చేశారు. తుళ్లూరు కేంద్రంగా పరిసర మండలాల్లో భూములు రాజధాని నిర్మాణానికి అనుకూలమైనవని సింగపూర్ నిపుణుల సహాయంతో నిర్ధారించేశారు. తమకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అనుసరించిన సర్కారు ఇప్పటికే 30వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించింది. పెనుమాక, ఉండవల్లి, బేతపూడి రైతులు భూములు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. కేపిటల్ లక్ష్యం 33,500 ఎకరాలు. లక్ష్యం చేరుకునే పనిలో రైతుల ఆందోళనలు, గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరాలేవీ పట్టించుకునే స్థితిలో ప్రభుత్వం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజధాని పేరుతో ప్రారంభమైన సర్కారు భూదాహం..ఒక్కో జిల్లాకు అలా అలా విస్తరిస్తూ పోతోందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఎయిర్‌పోర్ట్ ఎత్తుగడ
అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో వేల ఎకరాల భూమికి స్కెచ్ గీసింది సర్కారు. తొమ్మిది గ్రామాల పరిధిలో 5,311 ఎకరాలను సేకరించి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలో ఏ ఒక్క ఎయిర్‌పోర్ట్ కోసం కూడా ఇంత భూమి సేకరించలేదని రైతుల తరఫున పోరాడుతున్న ప్రజాసంఘాలు చెబుతున్నాయి. ఇవేమీ పట్టించుకోని సర్కారు ఎయిర్‌పోర్టుకు భూసేకరణ నోటిఫికేషన్ కూడా జారీ అయ్యింది. ఈ భూముల్లో అధికారపార్టీ నేతల భూములు లేవు. ఉన్నతాధికారుల ఫామ్‌హౌస్‌లు లేవు. భూములన్నీ నిరుపేదలవే. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. భూసేకరణ పరిధిలోకి రాని వేల ఎకరాలు పెద్దల చేతుల్లోనే ఉన్నాయట. ఎయిర్‌పోర్ట్ ప్రారంభమైతే ఇక్కడే స్టార్‌హోటల్స్, అపార్ట్‌మెంట్లు వెలుస్తాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెద్దల భూముల్లో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయొచ్చు కదా అని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు.
బందరులో భూబాగోతం
కృష్ణా జిల్లా బందరులో పోర్టు నిర్మాణం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 3 వేల ఎకరాలకు పైగా పోర్టు కోసం, పోర్టు అనుబంధ పరిశ్రమల కోసం 30 వేలకు పైగా ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో బందరు రైతులు ఆందోళన బాట పట్టారు. వేల ఎకరాలు ప్రభుత్వ భూములున్నా.. పంటభూములను పోర్టు నిర్మాణ అవసరాలకు సేకరించడంపై రైతులు మండిపడుతున్నారు. అసలు పోర్టు నిర్మాణానికి ఇంత భూమే అవసరంలేదని వాదిస్తున్నారు. ఉద్యమిస్తున్నారు. అయినా సర్కారే భూబాగోతం వెనుకుండి నడిపిస్తున్నప్పుడు రైతుల ఆందోళనలు పట్టించుకునేదెవరు?
ఏడాదిలోనే..
చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయ్యింది. ఈ లోగానే అభివృద్ధి, రాజధాని, పేరుతో లక్షల ఎకరాలకు టెండర్ పెట్టారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇంకా మిగిలిన నాలుగేళ్ల పదవీ కాలంలో ఇంకెన్ని ప్రాజెక్టులు ప్రకటిస్తారో..ఎన్ని లక్షల ఎకరాలు రైతుల నుంచి సేకరిస్తారోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అన్నపూర్ణలో అన్నం ఎలా?
మూడు పంటలు పుష్కలంగా పండే భూముల్లో నిర్మాణాలు ఆరంభం కానున్నాయి. సాగునీటి వసతి పుష్కలంగా ఉన్న లక్షల ఎకరాల భూములు కాంక్రీట్ జంగిల్ లా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌లో సాగుభూములు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఏపీతోపాటు తెలంగాణ ప్రాంతానికి ఎగుమతి చేసే పంటలు పండే భూముల్లోనే రాజధాని, ఎయిర్‌పోర్ట్, పోర్ట్ వంటివి నిర్మిస్తున్నారు. ఇలాగే సాగుభూముల్లో ప్రాజెక్టులు నిర్మించుకుంటూ పోతే వ్యవసాయం కనుమరుగు కాక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.