Telugu Global
Editor's Choice

శ‌తాబ్దాల నాటి తాజా... ఫీలింగ్‌!

మ‌నుషుల‌ను క‌లిపి ఉంచేది ఏంటి…అనే ప్ర‌శ్న‌కు మ‌న‌కు చాలా స‌మాధానాలు దొరుకుతాయి. ర‌క్త సంబంధాలు, బంధుత్వాలు, కులం, మ‌తం, భాష‌, రాష్ట్రం, దేశం…ఇలా ఎన్నో. అయితే వీట‌న్నింటికంటే ముఖ్య‌మైన‌ది ఒకటుంది. అదే ఫీలింగ్స్. అవును, ఫీలింగ్స్…ప్రపంచంలో ఏ మూల ఉన్న మ‌నుషులైనా కొన్ని ఫీలింగ్స్ కి స‌మానంగా స్పందిస్తారు. ఫేస్‌బుక్ మ‌నుషుల జీవితాల్లో ఇంత‌గా పెన‌వేసుకుపోవ‌డానికి కార‌ణం అదే. ఈ ఉపోద్ఘాతం దేనికంటే- ఈ నెల ఎనిమిదో తేదీన యూ ట్యూబ్‌లో పోస్ట్ అయిన ఒక వీడియోని […]

శ‌తాబ్దాల నాటి తాజా... ఫీలింగ్‌!
X

మ‌నుషుల‌ను క‌లిపి ఉంచేది ఏంటి…అనే ప్ర‌శ్న‌కు మ‌న‌కు చాలా స‌మాధానాలు దొరుకుతాయి. ర‌క్త సంబంధాలు, బంధుత్వాలు, కులం, మ‌తం, భాష‌, రాష్ట్రం, దేశం…ఇలా ఎన్నో. అయితే వీట‌న్నింటికంటే ముఖ్య‌మైన‌ది ఒకటుంది. అదే ఫీలింగ్స్. అవును, ఫీలింగ్స్…ప్రపంచంలో ఏ మూల ఉన్న మ‌నుషులైనా కొన్ని ఫీలింగ్స్ కి స‌మానంగా స్పందిస్తారు. ఫేస్‌బుక్ మ‌నుషుల జీవితాల్లో ఇంత‌గా పెన‌వేసుకుపోవ‌డానికి కార‌ణం అదే. ఈ ఉపోద్ఘాతం దేనికంటే- ఈ నెల ఎనిమిదో తేదీన యూ ట్యూబ్‌లో పోస్ట్ అయిన ఒక వీడియోని ఇప్ప‌టివ‌ర‌కు ప‌ది ల‌క్ష‌ల‌మంది చూశారు. అందులో పెద్ద వింతేమీ లేదు. కానీ ప్ర‌తి మ‌నిషి క‌నెక్ట్ అయ్యే విష‌యం ఒక‌టుంది. ఒక తండ్రి త‌న చిన్నారిని ప్లేస్కూల్లో వేసిన మొద‌టి రోజు ఆమె ప్ర‌వ‌ర్త‌న‌ని వీడియో తీసి పోస్ట్ చేశాడు.

ముఖ్యంగా స్కూల్లో ఒంట‌రిగా ఉన్న పాపాయి తండ్రి క‌నిపించ‌గానే ప‌రిగెత్తుకొచ్చిన తీరు…దీన్ని వ‌ర్ణించ‌డానికి మాట‌లు లేవు. ఎవ‌రికి వారు త‌మ అనుభ‌వాల‌ను గుర్తు చేసుకోవాల్సిందే.

ఆ చిన్నారిలో త‌ల్లిదండ్రులు త‌మ‌ పిల్ల‌ల‌ను చూడ‌వ‌చ్చు. త‌మ‌నితాము కూడా చూసుకోవ‌చ్చు. కొన్ని శ‌తాబ్దాలు గ‌డిచినా, ప్ర‌పంచం ఎంత పాత‌బడినా, ప్రాక్టిక‌ల్‌గా మారినా య‌ధాత‌థంగా ఉండే ఫీలింగ్ అది. త‌ల్లి, తండ్రే త‌న ప్ర‌పంచంగా పెరుగుతున్న రెండున్న‌ర‌, మూడేళ్ల వ‌య‌సున్న చిన్నారిని హ‌ఠాత్తుగా ఒక‌రోజు స్కూలు పేరుతో కొత్త ప్ర‌దేశంలో వ‌దిలి, అమ్మానాన్న వెళ్లిపోతే… ఆ పాపాయి ఎలా ఫీల‌వుతుంది….తండ్రి క‌నిపించ‌గానే ఎంత ఆనందంగా ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది…ఈ రెండు అంశాలే ఇందులో ఉన్నాయి.

చిన్నారి ప్లేస్కూల్లో త‌న‌కంటే ఎత్తున్న టేబుల్ మీద ఉన్న బొమ్మ‌ని తీసుకోబోవ‌డం, త‌రువాత ఒక పుస్తకం ప‌ట్టుకుని టీచ‌రు వ‌ద్ద‌కు రావ‌డం…అంత‌లో ఆమె తండ్రి క‌నిపించి హే బేబీ…అని పిల‌వ‌గానే….అవ‌న్నీ వ‌దిలేసి ప‌రిగెత్తుకుని అత‌ని ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేయ‌డం…ఈ వీడియోలో క‌న‌బ‌డుతుంది. ఈ వీడియో ల‌క్ష‌ల మందికి న‌చ్చి వారిలో స్పంద‌న క‌లిగించ‌డం అనేది మంచి విషయం. ఎందుకంటే పిల్ల‌ల ఫీలింగ్స్ కి విలువ‌నిచ్చే స‌మాజం, త‌మ‌కంటే మెరుగైన స‌మాజాన్ని నిర్మించే ప‌నిలో ఉంద‌ని అర్థం.

-వి.దుర్గాంబ‌

First Published:  16 Sept 2015 9:59 AM IST
Next Story