పన్నెండు మంది వీరులు (For Children)
సూరత్ ప్రాంతంలో అంబార్డీ అన్న గ్రామంలో పన్నెండు మంది వీరులు. నివసించేవాళ్ళు. వాళ్ళు మంచి మిత్రులు స్వేచ్ఛాప్రియులు. ఎవరికీ తలవంచని వాళ్ళు. ఆ పన్నెండుమందికి నాయకుడు విశాల్‌రావు. విశాల్‌రావు కింద ఆరు గ్రామాలు వుండేవి. అతను వీరుడు, ధర్మాత్ముడు, ఎవరిముందు ఎప్పుడూ మోకరిల్లని వాడు. ఆ పన్నెండుమందికి మధ్య ఒక అంగీకారం వుండేది. ‘మనం కలిసి ప్రశాంతంగా జీవిద్దాం మరణించినా కలిసే మరణిద్దాం’. అన్నది ఒడంబడిక. వీళ్ళలో కొందరు వ్యవసాయం, కొందరు వ్యాపారం, అలా రకరాకాల వృత్తులు […]
సూరత్ ప్రాంతంలో అంబార్డీ అన్న గ్రామంలో పన్నెండు మంది వీరులు. నివసించేవాళ్ళు. వాళ్ళు మంచి మిత్రులు స్వేచ్ఛాప్రియులు. ఎవరికీ తలవంచని వాళ్ళు. ఆ పన్నెండుమందికి నాయకుడు విశాల్‌రావు. విశాల్‌రావు కింద ఆరు గ్రామాలు వుండేవి. అతను వీరుడు, ధర్మాత్ముడు, ఎవరిముందు ఎప్పుడూ మోకరిల్లని వాడు.
ఆ పన్నెండుమందికి మధ్య ఒక అంగీకారం వుండేది. ‘మనం కలిసి ప్రశాంతంగా జీవిద్దాం మరణించినా కలిసే మరణిద్దాం’. అన్నది ఒడంబడిక. వీళ్ళలో కొందరు వ్యవసాయం, కొందరు వ్యాపారం, అలా రకరాకాల వృత్తులు చేసేవాళ్ళు.
అహ్మదాబాదు నవాబుకు వాళ్ళ గురించి తెలిసింది. నవాబు దగ్గరపనిచేసేవాళ్ళు మీరు వాళ్ళని లొంగదీయాలి. వాళ్ళు ఎవరికీ తలవంచమని విర్రవీగుతున్నారు. అహంకరిస్తున్నారు అని చెప్పారు.
నవాబు ఆశ్చర్యపోయి ‘వాళ్ళకు అంతశక్తి వుందా? వాళ్ళకు ఎంత సైన్యం వుంది’? అని అడిగాడు. నవాబు అధికారులు ‘వాళ్ళ దగ్గర సైన్యం లేదు. వాళ్లు పన్నెండుమంది మాత్రమే’ అన్నాడు.
నవాబు ఈ వ్యవహారమేదో చూడాలని సైన్యంతో బయటలుదేరి ఆ గ్రామ పొలిమేరలో ఆగి వాళ్ళను రమ్మని భటుల్ని పంపాడు.
అప్పుడు విశాల్‌రావు పొలంపని చేస్తున్నాడు. భటులు వాడిని చూశారు. నవాబుగారు నిన్ను రమ్మంటున్నారు అని చెప్పారు. విశాల్‌రావు కాళ్ళు చేతులు కడుక్కుని బట్టలువేసుకుని ఖడ్గం చేతబట్టి నవాబు విడిది చేసిన దగ్గరకు వచ్చాడు.
నవాబు ముందు తన ఖడ్గాన్ని పెట్టి దానికి నమస్కరించాడు. నవాబు విశాల్‌రావును పరకాయించిచూసి ‘నువ్వు ఖడ్గానికి నమస్కరించావు. నువ్వు నమస్కరించాల్సింది నాకు’ అన్నాడు.
విశాల్‌రావు ‘నేను భగవంతునికి తప్ప ఎవరికీ నమస్కరించను. ఆ దైవశక్తికి తప్ప ఎవరికీ తలవంచను’ అన్నాడు.
నవాబు అతని ఆత్మశక్తికి మనసులో అభినందించినా పైకి ‘ నేను అనుకుంటే ఈ క్షణం నిన్ను బంధించగలను’ అన్నాడు.
‘కానీ అది వీరోచితం అనిపించుకోదు’ అన్నాడు విశాల్‌రావు.
‘మీ పన్నెండుగురు నా అదుపాజ్ఞలకు లోబడివుండాలి’ అన్నాడు.
‘మేము ఎవరికీ లొంగమని మీకు ముందుగానే చెప్పాను’ అన్నాడు విశాలరావు.
నవాబు-‘ఐతే మాతో ఘర్షించడానికి సిద్ధపడ్డావన్నమాట’
విశాలరావు-ఎవరితోనూ ఘర్షించడం మా అభిమతంకాదు.
‘మీరే మాతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు’ అన్నాడు
‘ఐతే మీరు లొంగరన్నమాట. యుద్ధానికి సిద్ధపడండి’ అని హెచ్చరించాడు నవాబు
‘మాకు అభ్యంతరం లేదు. కానీ మా దగ్గర ఖడ్గాలు వున్నాయి. మీ దగ్గర తుపాకులున్నాయి. తుపాకులు పేల్చి మమ్మల్ని మీరు చంపవచ్చు. కానీ అది ధర్మంకాదు. మీ సైన్యం వందల సంఖ్యలోవుంది. మేము పన్నెండుమందిమే. కానీ వందల మందినయినా ఎదిరిస్తాము. మీరు తుపాకులు కాల్చనని హామీ యివ్వాలి’ అన్నాడు.
నవాబు సరేనన్నాడు.
ఐతే తేజ్‌రావు అన్న వ్యక్తి పనిమీద పక్కవూరువెళ్ళడంలో పదకొండు మందేవున్నారు. సరేనని పదకొండుమంది యుద్ధానికి సిద్ధపడ్డారు.
వూరి బయట విశాల ప్రదేశంలో యుద్ధరంగం సిద్ధమయింది.
యుద్ధానికి బయల్దేరే ముందు విశాలరావు ఒక వలయం గీచి యుద్ధానంతరం మనందరం యిక్కడికి చేరాలి. మనం బతకవచ్చు. లేదా చనిపోవచ్చు. కాని అందరం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి చేరాలి అన్నాడు. అందరూ అంగీకరించారు.
నవాబుకు ఆశ్చర్యంగా వుంది. అద్భుతంగా వుంది. వాళ్ళు పన్నెండు మంది తన సైనికులు వందలమంది వాళ్ళని వీళ్ళు క్షణంలో మట్టు పెట్టగలరు. ఐనా ప్రాణాలకు తెగించి వాళ్ళు యుద్ధానికి సిద్ధమయ్యారు. వీరులంటే వీళ్ళేకదా! అనుకున్నాడు.
యుద్ధం మొదలయింది. అరి వీరభయంకరంగా పదకొండుమంది యుద్ధం చేశారు. శత్రుసైనికుల్ని చీల్చి చెండాడారు. ఒక్క వ్యక్తి పదుల సంఖ్యలో నవాబు సైనికుల్ని చంపారు.
పదకొండుమందికీ బలమైన గాయాలయ్యాయి. ఒంట్లోంచీ రక్తం కారుతోంది. ఐనా తెగింపుతో యుద్ధం చేస్తున్నారు. శత్రు సైనికులు పిట్టల్లా రాలుతున్నారు.
నవాబు ఆ వీరుల ధైర్యానికి విస్తుపోయాడు. తన సైనికులు పిట్టల్లా రాలిపోవడం చూశాడు. పరిస్థితి చేయిదాటిపోయేట్లు వుందని గ్రహించాడు. వెంటనే నియమాల్ని తుంగలో తొక్కి వాళ్ళపై తుపాకీలు పేల్చమన్నాడు. పదకొండుమంది శరీరాల్లో గుళ్ళు దూసుకుపోయాయి. పదకొండుమంది నేలకొరిగారు. కానీ అట్లాగే తుదిశ్వాసతో కష్టం మీద అందరూ విశాలరావు గీసిన వర్తులంలోకి వచ్చి కుప్పకూలిపోయారు.
పొరుగు వూరు వెళ్ళిన తేజ్‌రావు వచ్చి జరిగింది తెలుసుకుని కుప్పకూలిన స్నేహితుల్ని చూసి కన్నీళ్ళు నింపుకుని దృఢ నిశ్రయంతో చితి మంటలు పేర్చాడు. మిత్రులతో బాటు తనుకూడా మంటల్లో దిగి ప్రాణాలు వదిలాడు.
– సౌభాగ్య