చంద్రబాబు పాలనపై టీడీపీ మేధావుల అసంతృప్తి..?
టీడీపీని తీవ్రంగా అభిమానించే ఒక సామాజికవర్గానికి చెందిన మేధావులు చాలామంది గత ఎన్నికల్లో చంద్రబాబును బలంగా సమర్ధించారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న చాలామంది టీడీపీ అభిమానులు డబ్బులు ఖర్చుపెట్టుకొని ఆంధ్రాకు వెళ్ళిమరీ చంద్రబాబుకు ఓటు వేసారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సమర్ధమైన పాలనా అనుభవంతో కొత్త రాజధానిని చక్కగా నిర్మిస్తాడని విశ్వసించి చాలా కృషిచేసి చంద్రబాబును గెలిపించారు. కానీ గెలిచినప్పటినుంచి ఆయన పాలనలో గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనిపించిన పరిపాలనా అనుభవం పూర్తిగా లోపించడం వాళ్ళకు […]
టీడీపీని తీవ్రంగా అభిమానించే ఒక సామాజికవర్గానికి చెందిన మేధావులు చాలామంది గత ఎన్నికల్లో చంద్రబాబును బలంగా సమర్ధించారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న చాలామంది టీడీపీ అభిమానులు డబ్బులు ఖర్చుపెట్టుకొని ఆంధ్రాకు వెళ్ళిమరీ చంద్రబాబుకు ఓటు వేసారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సమర్ధమైన పాలనా అనుభవంతో కొత్త రాజధానిని చక్కగా నిర్మిస్తాడని విశ్వసించి చాలా కృషిచేసి చంద్రబాబును గెలిపించారు.
కానీ గెలిచినప్పటినుంచి ఆయన పాలనలో గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనిపించిన పరిపాలనా అనుభవం పూర్తిగా లోపించడం వాళ్ళకు మింగుడు పడడంలేదు. ఆయనపైన వస్తున్న విమర్శలకు ఏం సమాధానం చెప్పాలో అర్ధం కావడం లేదు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఏం చేసాడు అని ప్రశ్నిస్తున్న వాళ్ళకు ఏం సమాధానం చెప్పాలో అర్థంకావడం లేదు. అందుకే చంద్రబాబుమీద కొందరు గుర్రుగా ఉన్నారు.
రాజధాని నమూనాలతో బాహుబలి సెట్టింగులను మరిపించేలా పత్రికల్లో ఊహాచిత్రాలను విడుదల చేయడం తప్ప అక్కడ ఏమీ పనులు జరుగుతున్న ఆనవాళ్ళుకూడా కనిపించకపోవడం, సుమారు నూటా ఇరవై రకాల పంటలు పండే బంగారంలాంటి పంటభూములను రాజధాని పేరుతో రైతులనుంచి బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్న తీరు, అయినదానికి కానిదానికి ప్రత్యేక విమానాల్లో విదేశీపర్యటనలు, తొమ్మిదేళ్ళ పాలనలో లేనివిధంగా తన ఆడంబరాలకు (నాలుగు చోట్ల కాన్వాయ్‌లు, ఆఫీసులు, ఇళ్ళు, క్యాంప్ ఆఫీసుల డెకరేషన్‌లకోసం) కోట్లు కోట్లు ఖర్చుపెట్టడం, హైదరాబాద్ నుంచి విజయవాడకు కూడా ప్రత్యేక విమానాల్లో ప్రయాణాలు, రెండునెలల వయస్సున్న మనవడికోసం కూడా సెక్యూరిటీ ఏర్పాట్లు, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోవడం, ఎంఆర్‌ఓ వనజాక్షి విషయంలో ప్రభుత్వం ప్రవర్తించిన తీరు, రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రిన్సిపల్ బాబురావును వెనకేసుకురావడం, ఎర్రచందనం స్మగ్లర్లను ఏమీచెయ్యలేక 22 మంది కూలీలను కాల్చివేయడం, తాను అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు భృతి ఇస్తానన్న విషయం మర్చిపోవడం, ఒకవైపు కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూవుంటే చంద్రబాబు ఆ విషయాన్నే పట్టించుకోకపోవడం, ఒక వైపు తెలంగాణాలో కేజీ టూ పీజీ ఉచిత విద్య అంటుంటే పిల్లల చదువులు ప్రభుత్వ బాధ్యత కాదనడం, ఆంధ్రలో ఇసుక మాఫియా బరితెగించి దోపిడి సాగించడం, పట్టిసీమ ప్రాజెక్టులో ప్రభుత్వ అవినీతిని ప్రజలు విశ్వసించడం, పదిశాతం కూడా పూర్తికాని ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం, గోదావరి కృష్ణా నదుల అనుసందానం అంటూ ఊదరగొట్టడం, తోటపల్లి ప్రాజెక్టు నిర్మించిన ఘనత తనదేనని ఊదరగొట్టి అబాసుపాలు కావడం, గోదావరి పుష్కరాల్లో 30మంది మృతికి జాతీయమీడియా చంద్రబాబును బాధ్యుడిని చేయడం, మంత్రి నారాయణ ప్రభుత్వం అంతా తానై వ్యవహరించడం, ఉపముఖ్యమంత్రులను పట్టించుకోకపోవడం, మంత్రులు చేయాల్సిన పనులను లోకేష్ నియంత్రించడం, చంద్రబాబు ముఖ్యమంత్రికావడానికి తెగించి సహకరించిన యనమల రామకృష్ణుడులాంటి సీనియర్ మంత్రులను పట్టించుకోకపోవడం, స్పీకర్ కోడెల నిష్పక్షపాతంగా వ్యవహరించలేకపోవడం, అచ్చంనాయుడు ప్రవర్తన, తెలుగుదేశం పవన్ కల్యాణ్‌ల దోబూచులాటలు, గవర్నర్ నరసింహన్‌ను టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడం… ఇలా అనేక విషయాలవల్ల చంద్రబాబు ప్రతిష్ట దెబ్బతినడం తెలుగుదేశాన్ని అభిమానించే మేధావులకు జీర్ణం కావడం లేదు. మా చంద్రబాబు పరిపాలనాదక్షుడని చెప్పుకోవడానికి గత ఏడాదిగా ఏం కనపడటంలేదు. ఈ ఏడాది పాలనలో ఇది సాధించాడు అని చెప్పుకోవడానికి ఏమీ మిగలకపోవడం, ప్రత్యేకహోదా విషయంలో ఘోరంగా విఫలంకావడం, గతంలో చంద్రబాబు పరిపాలనా కాలంలో వేరే మీడియా లేనందువల్ల చంద్రబాబుమీద ఒక్క విమర్శకూడా వచ్చేదికాదు. కాని ఇప్పుడు వ్యతిరేక పత్రికలు రావడం, వీటన్నిటికి మించి సోషల్‌మీడియాలో బాబుపై తీవ్ర విమర్శలు వస్తూవుండడం ఆయన అభిమానులైన మేధావుల్ని కలవర పెడుతోంది.
అవినీతి విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడల్లా టీడీపీ నాయకులు జగన్ అవినీతి గురించి మాట్లాడి సమస్యను దాటవేయడం, గత ఎన్నికలప్పుడు జగన్ అవినీతిని నమ్మిన ప్రజలు ఇప్పుడు టీడీపీ కూడా అవినీతి పార్టీనేనని, చంద్రబాబుకూడా అవినీతిపరుడేనని విశ్వసించే ప్రజల సంఖ్య క్రమేణా పెరుగుతూవుండడం, జాతీయ మీడియాలో చంద్రబాబుకు వ్యతిరేకంగా అనేక కథనాలు వస్తూ ఉండడం, మోడీ ప్రభుత్వం చంద్రబాబుకు ఇవ్వాల్సినంత విలువ ఇవ్వకపోవడం తెలుగుదేశం మేధావులను కలవరపెడుతుంది. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు మేల్కోవడంలేదని చంద్రబాబుపై అసహనంగా ఉన్నారు. నేను మారాను, నేను మారాను అంటున్న చంద్రబాబు ఏవిషయంలో మారాడో, మారి ఏం సాధించాడో వాళ్ళకు అర్థంకాక అసంతృప్తితో తలలు పట్టుకుంటున్నారు.