Telugu Global
Family

కూతురే కొడుకు (For Children)

అపాదేవత్‌ పెద్ద గజదొంగ. అతని గ్రామం పేరు చలాలా. ప్రతినెల ఆ గజదొంగ ఆ గ్రామంలో ఒక సమావేశం ఏర్పాటు చేసేవాడు. అతనంటే చుట్టుపక్కల గ్రామాలకు హడల్‌. అతను గజదొంగ మాత్రమే కాదు. ఒక నియంతలాగా వ్యవహరించేవాడు. సమావేశం జరిగిన ప్రతినెలా చుట్టుపట్ల గ్రామాలవాళ్ళు కూడా వచ్చి అతనికి బహుమతులు సమర్పించాలి. అది ఆనవాయితీ. లేకుంటే వాళ్ళని హింసించేవాడు. ఒకనెల సమావేశం జరుగుతోంది. ఒకరు హుక్కా సమర్పించారు. ఒకరు పొగాకు యిచ్చుకున్నారు. బంగారు, వెండి బహుమతులు మరొకరు […]

అపాదేవత్‌ పెద్ద గజదొంగ. అతని గ్రామం పేరు చలాలా. ప్రతినెల ఆ గజదొంగ ఆ గ్రామంలో ఒక సమావేశం ఏర్పాటు చేసేవాడు. అతనంటే చుట్టుపక్కల గ్రామాలకు హడల్‌. అతను గజదొంగ మాత్రమే కాదు. ఒక నియంతలాగా వ్యవహరించేవాడు. సమావేశం జరిగిన ప్రతినెలా చుట్టుపట్ల గ్రామాలవాళ్ళు కూడా వచ్చి అతనికి బహుమతులు సమర్పించాలి. అది ఆనవాయితీ. లేకుంటే వాళ్ళని హింసించేవాడు.

ఒకనెల సమావేశం జరుగుతోంది. ఒకరు హుక్కా సమర్పించారు. ఒకరు పొగాకు యిచ్చుకున్నారు. బంగారు, వెండి బహుమతులు మరొకరు సమర్పించారు. అన్నిట్నీ గర్వంగా స్వీకరిస్తూ మీసం దువ్వుకున్నాడు అపాదేవత్‌.

పక్కగ్రామం నించీ వచ్చిన ఒకతను యిదంతా నిశ్శబ్దంగా గమనించాడు. అతని పేరు లక్ష్మణ్‌. తన పక్క కూర్చున్న అతనితో ‘మనం బానిసలంకాము కదా! యితని దౌర్జన్యం ఎందుకు భరించాలి? ఎందుకు భయపడాలి? ఎందుకివ్వాలి? మనమంతా స్వేచ్ఛాగానే పుట్టాంకదా, మనందరం సమానులమే కదా! అన్నాడు.

ఆ మాటలు అపాదేవత్‌ చెవిన పడ్డాయి. ఎవరది మాట్లాడుతున్నది ముందు కొచ్చి ధైర్యంగా మాట్లాడు అన్నాడు.

లక్ష్మణ్‌ లేచి అతని ముందుకు వచ్చి నిలబడి ”మనందరం మనుషులమే మమ్రల్ని నువ్వు భయపెడుతున్నావు. నిర్బంధంగా మా దగ్గర బహుమతులు తీసుకుంటున్నావు. యిది అన్యాయం. అట్లా బహుమతులు తీసుకుంటున్నందుకు నువ్వు సిగ్గు పడాలి.” అన్నాడు

ఆ మాటల్లో అపాదేవత్‌ కళ్ళు ఎర్రబడ్డాయి. కాస్త ఇలా తమాయించుకుని ‘అంతరోషగాడివయితే నీ గ్రామం చుట్టూ కోటకట్టుకో వచ్చి పగలగొట్టి సర్వనాశనం చేస్తాను’ అన్నాడు.

లక్ష్మణ్‌ నేను గ్రామం చుట్టూ కోటకట్టేంత వాణ్ణికానుకానీ నువ్వువస్తే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు నాకున్నాయి’ అన్నాడు.

అపాదేవత్‌ ఆ సవాలు స్వీకరించాడు.

లక్షణ్‌ గుర్ర మెక్కి తన గ్రామం వెళ్ళిపోయాడు.

లక్షణ్‌ కొంతమంది యువకులకు శిక్షణయిచ్చి గ్రామాన్ని రక్షించుకోవడానికి తర్ఫీదు యిచ్చాడు.

కొన్నాళ్ళు గడిచిపోయాయి

అపాదేవత్‌ ఆ గ్రామం వైపురాలేదు.

లక్షణ్‌ ఏదో పని మీద పట్టణానికి వెళ్ళాడు. ఎవరూ వూహించకుండా అపాదేవత్‌ ఆ గ్రామం మీదకు దండయాత్ర చేశాడు. అనుకోని సంఘటనకు గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. శక్తివంచన లేకుండా అపాదేవత్‌ గుంపుతో తలపడ్డారు. చాలామంది చనిపోయారు. గ్రామస్థులు అంతగా ఎదురు తిరుగుతారని అపాదేవత్‌ వుహించలేదు. ఐనా చేతనయినంత దోచుకున్నాడు. వెతుక్కుంటూ లక్ష్మణ్‌ యింటికి వచ్చి తలుపుతట్టాడు. యింట్లోంచి అతని భార్యవచ్చింది. ఏడీ లక్ష్మణ్‌ బయటికి రమ్మను. నన్ను సవాలు చేసి పిరికి వాడుగా యింట్లో దాక్కున్నాడు? అన్నాడు.

లక్ష్మణ్‌ భార్య ‘మా ఆయన ప్రాణాల్ని ఒడ్డుతాడేకానీ పిరికివాడుగా దాక్కోడు. ఆయన వ్యాపారం నిమిత్తం పట్టణానికి వెళ్ళిన సమయం చూసి నువ్వే పిరికివాడుగా దండెత్తి వచ్చావు’ అని ధభ్‌మని తలుపు వేసుకుంది.

అపాదేవత్‌ ఎదురుగా వున్న ఒక చెట్టు అరుగుపైన కూచుని వీడు సమయానికి లేడే తప్పించుకున్నాడు. వుంటే ప్రాణాలు తీసి పగతీర్చుకునేవాణ్ణి కదా! అనుకుంటూ ఆలోచనల్లో పడ్డాడు.

యితర దొంగలు యిళ్ళలో లూటీలు చేస్తున్నారు. సాయంత్రం కావస్తోంది. చీకటి పడుతోంది. దొంగతనాలు పూర్తయ్యాక వూరి చివర తోటలో అందరూ కలుసుకోవాలని అపాదేవత్‌ దొంగలకు ఆదేశాలిచ్చాడు.

మసక మసక చేకటిలో ‘గ్రామాన్ని దోచుకున్నా తన కోరికపూర్తిగా నెరవేరలేదు కదా’ అరుగు మీద కూర్చుని అనుకున్నాడు అపాదేవత్‌.

దొంగలు చేతికి దొరికినంత దోచుకుని తమ నాయకుడు వూరి చివరి తోటకు వచ్చివుంటాడని బయల్దేరి వెళ్ళారు.

అపాదేవత్‌ తన గుర్రాని చెట్టుపక్కనే వదిలాడు. లక్ష్మణ్‌ లేదు. అతని భార్య నయినా చంపితే పగలో కొంతయినా తీరుతుంది కదా అని అనుకున్నాడు.

ఆ ఆలోచన కలగ్గానే కత్తి తీసుకుని మళ్ళీ వాళ్ళయింటి తలుపు తట్టాడు.

‘ఎవరు’ అంది లక్ష్మణ్‌ భార్య.

తలుపు తీస్తావా? లేదా పగల గొట్టమంటావా! అన్నాడు.

నువ్వు మగాడివేనా! ఆడవాళ్ళమీదా నీ ప్రతాపం? అంది లోపలి నించే ఆమె. ఆవేమీ పట్టించుకోకుండా అతను తలుపుతట్టాడు. అంతకు ముందు అతను వచ్చినపుడు తల్లితో సంభాషిస్తున్నప్పుడు పదహారేళ్ళ లక్ష్మణ్‌ కూతురు అంతా విన్నది. ఆత్మరక్షణకోసం ఖడ్గం కూడా సిద్ధంగా వుంచుకున్నాది. ఆ అమ్మాయి ధైర్యస్థురాలు సాహసి, ప్రాణాల్ని లెక్క పెట్టనిది.

తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది. వూహించని సంఘటనతో అపాదేవత్‌ యింట్లోకి తూలిపడ్డాడు. వెంటనే లక్ష్మణ్‌ కూతురు అతని వీపులోకి కత్తిదించింది.

తనగ్రామం ధ్వంసమయిందన్న విషయం లక్ష్మణ్‌కు తెలిసింది. ఆగమేఘాలమీద గ్రామం వచ్చాడు. అంతా స్మశాన నిశ్శబ్దం. అదుర్దాగా యింటికి వచ్చాడు. తల్లీబిడ్డా క్షేమంగా వున్నందుకు సంతోషించాడు. అతని కూతురు అతన్ని తీసుకుని చెట్టు అరుగు దగ్గరికి వెళ్ళింది. రక్తపుమడుగులో కొనవూపిరితో వున్న అపాదేవత్‌ను చూపించింది.

లక్ష్మణ్‌ ఆనందంతో బిడ్డను కౌగిలించుకుని ‘అమ్మా! అందరూ నాకు కూతురే వుంది అంటూవుంటారు. ఇప్పుడే కొడుకు కూడా నువ్వే అనిపించావు’ అన్నాడు.

– సౌభాగ్య

First Published:  11 Sept 2015 6:32 PM IST
Next Story