Telugu Global
Family

ఘోర్ముహా'లు (For Children)

సంతాల్‌ల పిల్లలు ఘోర్ముహా’లంటే ఎంతో భయపడేవాళ్ళు. వాళ్ళు రాక్షసులు పిల్లలు అల్లరిచేస్తే వాళ్ళకు గుర్తుచేస్తే అల్లరి ఆపేసేవాళ్ళు. ఘోర్ముహాలకు గుర్రం తల ఉండేది. మనుషులకు లాగే శరీరం, మనుషులకు లాగే రెండు చేతులు ఉండేవి. కానీ ఒక కాలు మాత్రమే ఉండేది. చిత్రంగా, భయం కలిగించేలా ఉండేవి. సోమాయ్‌ అన్న ఒక సంతాల్‌ వేటకోసం అడవికి వెళ్లి దారితప్పి అడవిలో ఘోర్ముహాలు ఉండే ప్రాంతంలోకి వెళ్ళాడు. వెంటనే ఘోర్ముహాలు అతన్ని బంధించాయి. అవి మానవ భక్షకులు. మనుషుల […]

సంతాల్‌ల పిల్లలు ఘోర్ముహా’లంటే ఎంతో భయపడేవాళ్ళు. వాళ్ళు రాక్షసులు పిల్లలు అల్లరిచేస్తే వాళ్ళకు గుర్తుచేస్తే అల్లరి ఆపేసేవాళ్ళు.

ఘోర్ముహాలకు గుర్రం తల ఉండేది. మనుషులకు లాగే శరీరం, మనుషులకు లాగే రెండు చేతులు ఉండేవి. కానీ ఒక కాలు మాత్రమే ఉండేది. చిత్రంగా, భయం కలిగించేలా ఉండేవి. సోమాయ్‌ అన్న ఒక సంతాల్‌ వేటకోసం అడవికి వెళ్లి దారితప్పి అడవిలో ఘోర్ముహాలు ఉండే ప్రాంతంలోకి వెళ్ళాడు.

వెంటనే ఘోర్ముహాలు అతన్ని బంధించాయి. అవి మానవ భక్షకులు. మనుషుల మాంసమంటే వాటికెంతో ఇష్టం. కాని అవి మనుషులు దొరికిన వెంటనే చంపి తినేవి కావు. ఎందుకంటే మొదట కొన్నాళ్ళు మనిషికి మంచి ఆహారం పెట్టి మనిషి బలంగా తయారయ్యాకా అతనికి కొన్ని పరీక్షలు పెట్టి తరువాత అతన్ని తినేవాళ్ళు. ఆ తినడం ఎలాగంటే ఒకవేపు పెద్ద పెనాల్లో నూనె మరుగుతూ ఉండేది. మనిషిని ఆ నూనెలోకి విసిరేసి బాగా వేపుడు చేసిన అనంతరం మనుషుల శరీరాన్ని ద్వారం ముందు వేలాడేటట్లు కట్టేవి. అవి బయటకి లోపలికి వస్తూ వేలాడుతున్న శరీరం నించీ ముక్కలు తుంచుకుని తినేవి. వాటికి దయాదాక్షిణ్యాలుండేవి కావు. చివరికి అవి వయసుమీద పడిన పెద్ద ఘోర్ముహాల్ని కూడా వదిలిపెట్టేవి కావు. వాటిని కూడా తినేవి.

సోమాయ్‌ ఇదంతా గమనించాడు. ఎట్లాగయినా అక్కడి నుండి తప్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఆరోజు వచ్చింది. అతను పుష్టిగా తయారయ్యాడని అవి నిర్ణయించుకున్న తర్వాత అతనికి పరుగు పందెం పెట్టాయి. అతను సిద్ధపడ్డాడు. బలమైన ఘోర్ముహాలు అతన్తో పరుగుపందేనికి సిద్ధపడ్డాయి.

పరుగుపందెం మొదలయింది. సోమాయ్‌ పరుగు ప్రారంభించాడు. సోమాయ్‌ అదృష్టమేమంటే దగ్గర్లో బాగా ఏపుగా పెరిగిన వరిపొలాలు ఉన్నాయి. పైగా ఘోర్మహాలు ఒకే కాలు ఉన్నవి. కొంతదూరం వెళ్ళాకా సోమాయ్‌ ఒక వరిపొలంలోకి దూకాడు. ఘోర్ముహాలు కూడా వెంబడించాయి. దాదాపు అతన్ని అందుకునేంత దగ్గరికి వచ్చాయి. కానీ శక్తికొద్దీ పరిగెత్తాడు. ఘోర్ముహాలు నివసించే ప్రాంతానికి ఒకసరిహద్దు ఉంది. అది దాటితే అవి ఏమీ చెయ్యలేవు. చెమటలు కక్కుకుంటూ సోమాయ్‌ ఆ సరిహద్దును దాటాడు. అక్కడిదాకా తరుముతూ వచ్చిన అవి అక్కడే ఆగిపోయాయి.

ప్రాణాలతో బయటపడిన సోమాయ్‌ మళ్ళీ జీవితంలో ఆ సరిహద్దు వేపు రాలేదు.

– సౌభాగ్య

First Published:  10 Sept 2015 6:32 PM IST
Next Story