హోరా హోరీ ఎవరితో?
రేటింగ్: 1.5 ప్రేమకథలు అనేకరకాలు. అర్జునుడు సుభద్రల ప్రేమకథ, కృష్ణుడు రుక్మిణీల కథ ఒకరకమైతే, రోమియో జూలియట్‌లు ఇంకోరకం. ప్రతి ప్రేమ కథలోనూ ఒక విలన్ ఉంటాడు. ఆ విలన్ డబ్బుకావచ్చు, తండ్రి కావచ్చు, అమ్మాయిని ప్రేమించిన ఇంకో ప్రేమికుడు కావచ్చు. ఒకోసారి విధికూడా విలన్‌గా మారుతుంది. ప్రేమకథలన్నీ ఒకలాగే అనిపించినా ఒకరి ప్రేమకథ ఇంకొకరితో మ్యాచ్ కాదు. పదిమంది ప్రేమికుల్ని అడిగి చూడండి. పదిరకాల ప్రేమకథలు వినిపిస్తాయి. మరి దర్శకుడు తేజ ఎందుకు తీసిన ప్రేమకథనే […]
రేటింగ్: 1.5
ప్రేమకథలు అనేకరకాలు. అర్జునుడు సుభద్రల ప్రేమకథ, కృష్ణుడు రుక్మిణీల కథ ఒకరకమైతే, రోమియో జూలియట్‌లు ఇంకోరకం. ప్రతి ప్రేమ కథలోనూ ఒక విలన్ ఉంటాడు. ఆ విలన్ డబ్బుకావచ్చు, తండ్రి కావచ్చు, అమ్మాయిని ప్రేమించిన ఇంకో ప్రేమికుడు కావచ్చు. ఒకోసారి విధికూడా విలన్‌గా మారుతుంది. ప్రేమకథలన్నీ ఒకలాగే అనిపించినా ఒకరి ప్రేమకథ ఇంకొకరితో మ్యాచ్ కాదు. పదిమంది ప్రేమికుల్ని అడిగి చూడండి. పదిరకాల ప్రేమకథలు వినిపిస్తాయి. మరి దర్శకుడు తేజ ఎందుకు తీసిన ప్రేమకథనే మళ్ళీతీస్తూ ప్రేక్షకుల అంతు చూస్తున్నట్టు?
ప్రేమ అనే పదమే చాలా సున్నితమైంది. దానికి రక్తాన్ని పూయడం తేజ ప్రత్యేకత. పదిహేనేళ్ళక్రితం జయం సినిమాని హిట్ చేసిన నేరానికి మళ్ళీ మళ్ళీ జయాన్నే తీస్తూ ప్రేక్షకులతో హోరాహోరీ తలపడుతున్నాడు. సమాజానికి ప్రతిబింబంగా సినిమాలు ఉండాలనే దురాశ ఎవరికీ లేదు. కనీసం సమాజంలో ఏం జరుగుతుందో అయినా దర్శకులు తెలుసుకోవాలి. నాకంతా తెలుసు, నేర్చుకోవలసింది ఏమీ లేదు అనుకుంటే హోరాహోరీలాంటి సినిమాలే వస్తాయి.
అయితే ఈ సినిమాలో ప్లస్‌పాయింట్లేమీ లేవా అంటే చాలా ఉన్నాయి. చక్కని పాటలు, అందమైన హీరోయిన్, లోకేషన్స్, ఫోటోగ్రఫి అన్నీ ఉన్నాయి. లేనిదల్లా కథ, కథనం. అడ్డగోలుగా సన్నివేశాలు కూర్చి అదే సినిమా అనుకోమంటే ఎవరూ అనుకోరు. ఎక్కడెక్కడికో పోయి నెలల తరబడి కష్టపడి షూటింగ్ చేయడంలో ఉన్న శ్రద్ధలో కనీసం సగం కథ, స్ర్కీన్‌ప్లే, మాటలపైన పెడితే ఈ సినిమా ఇంకోలా ఉండేది.
కథలోకి వస్తే టైటిల్స్ అయిపోగానే నడిరోడ్డుపై ఒక మర్డర్. చేసింది బసవ (సల్సా) అనే గూండా. హత్యకేసులోంచి వాడిని తప్పించడానికి ఎసిపి పాతిక లక్షలు లంచం అడుగుతాడు. ఎందుకంటే మరుసటిరోజు అతని చెల్లెలిపెళ్ళి. పెళ్ళికూతురు హీరోయిన్ మైథిలి (దక్ష). ఆమె పెళ్ళికూతురిగా ముస్తాబవుతున్నపుడు ఎసిపి ఇంటికి బసవ వస్తాడు. అప్పుడు హీరోయిన్‌ని చూసి మనసుపడతాడు. ఎంతలా మనసుపడతాడంటే అర్ధరాత్రి దొంగగా ఆమె బెడ్‌రూంలోకి వెళ్ళి తన ప్రేమని ప్రకటించేంతగా! తర్వాతి రోజు పెళ్ళి. తాళి కట్టడానికి సిద్ధమవుతున్న పెళ్ళికొడుకుని పురోహితుడే కాల్చేస్తాడు. (మెదడు చెడిపోయిన దర్శకులకే ఇలాంటి ఐడియాలు వస్తాయి) ఇదంతా బసవే చేయించాడని తెలిసినా సాక్ష్యంలేదు.
తరువాత హీరోయిన్‌కి ఇంకో సంబంధం కుదర్చడానికి ప్రయత్నిస్తే ఆ కుర్రాన్ని కూడా కాల్చేస్తారు. దాంతో హీరోయిన్‌కి మతి తప్పుతుంది (ప్రేక్షకులకి కూడా). బసవనుంచి కాపాడ్డానికి హీరోయిన్‌ని కర్నాటక షిమోగా జిల్లాలోన అగుంబే అనే ప్రాంతానికి తరలిస్తారు. (తెలుగు భాష గురించి ఆందోళన చెందే భాషాభిమానులకు శుభవార్త ఏమంటే కర్నాటకలోని ఆ మారుమూల పల్లెలో అందరూ తెలుగే మాట్లాడుతారు. సినిమా చివర్లో బావుండదని డాక్టర్ మాత్రం నాలుగు కన్నడమాటలు మాట్లాడుతాడు).
ఆ ఊళ్ళో హీరో ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుని ఉంటాడు. వర్క్‌ఆర్డర్ తెచ్చుకోడానికి ఒక యూనియన్ లీడర్‌తో తగాదాపడితే రెండు ఊళ్ళమధ్య కంప్యూటర్ టైపింగ్ పోటీ పెట్టుకుంటారు (ఇదోగోల!). ఆ సమయానికి సరిగ్గా హీరోయిన్ ఆ ఊరికొస్తుంది. ఉలుకు పలుకూ లేకుండా ఉన్న ఆ అమ్మాయిని కాలేజికి పంపిస్తారు. ఆ అమ్మాయిని హీరో ప్రేమలోకి ఎలా దింపుతాడన్నది ఫస్టాఫ్. అనుకోకుండా ఒక మర్డర్ చేయడానికి బసవ ఆ ఊరికొస్తాడు. సెకండాఫ్ చెప్పాల్సిన పనిలేదు. జయం గుర్తుతెచ్చుకుంటే చాలు.
మధ్యలో జబర్దస్ట్ బ్యాచ్‌తో బూతు జోకులు, కామెడీ. లాస్ట్‌లో ఫైటింగ్. నిజానికి కొత్త కథంటూ దొరకనపుడు పాతకథలనే కొత్తగా అయినా చెప్పాలి. మానసికంగా దెబ్బతిన్న హీరోయిన్‌ని ఆ పల్లెలోకి రప్పించి కొంత ప్రేమకథ నడిపి ప్లాష్‌బ్యాక్ టెక్నిక్‌తో కథనడిపినా కొంత బావుండేది. సీన్లన్ని రొటీన్‌గా ఉండడంవల్ల అల్రెడీ ఈ సినిమాని ఎక్కడో చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది.
ఇక హీరో దిలీప్ గురించి చెప్పేదేమిలేదు. అతని పాత్రలాగే అతను కూడా డల్‌గా కనిపించాడు. హీరోయిన్ దక్ష చక్కగా ఉంది. మంచి అవకాశమొస్తే చక్కగా నటించగలదు కూడా. ఇక విలన్ బాగానే నటించాడు కానీ అలాంటి పాత్రలు కొన్ని వందలు ఇదివరకే చూసివుండడం మైనస్. కళ్యాణ్ చక్కటి పాటలు అందించినా ఒకటి రెండు మినహా థియేటర్‌లో అలరించవు. ఫోటోగ్రఫి ఎక్స్‌లెంట్. ఇవ్వన్నీ కూడా సినిమాలో దమ్ములేకపోవడం వల్ల వృధా అయ్యాయి.
ఎంత మంచి వంటవాడికైనా ఉప్పుఎంతవేయాలో తెలియకపోతే కూర చెడిపోతుంది. కథలో శ్రద్ధ తీసుకోకుండా లైట్ తీసుకున్నంతకాలం తేజ తనని తాను రిపీట్ చేసుకుంటూనే ఉంటాడు. ఇప్పుడు కాకపోయినా ఒకప్పుడు తేజకి మంచి డైరెక్టరని పేరు. అతను కూడా బూతు డైలాగుల మీద ఆధారపడడం విషాదం. ఇలాగే ఉంటే కొంతకాలానికి ఆయన పేరు చెబితేనే ప్రేక్షకులు జడుసుకునే పరిస్థితి వస్తుంది.
హీరో విలన్లమధ్య హోరాహోరి నడుస్తుందని మనం సినిమాకెళితే మొత్తం మీద మనతో హోరాహోరీ నడిపించాడు దర్శకుడు.
– జి.ఆర్. మహర్షి
[gmedia id=1470]