Telugu Global
Family

అవసరాలు " కోరికలు (Devotional)

కోరికలు లెక్కలేనన్ని ఉంటాయి.  అవసరాలు కొన్నే ఉంటాయి.  అవసరాల్ని తీర్చుకోవచ్చు.  కానీ కోరికల్ని తీర్చుకోలేం.  కోరిక అన్నది పిచ్చెక్కించే అవసరం.  దాన్ని సంతృప్తి పరచడం అసంభవం.  నువ్వు వాటిని తీరుస్తూ వెళ్ళేకొద్దీ అవి పెరుగుతూనే ఉంటాయి.  వాటికి అంతముండదు.  ఒక అద్భుతమయిన సూఫీ కథ ఉంది.  అలగ్జాండర్‌ ద గ్రేట్‌ చనిపోయి స్వర్గానికి వెళ్లాడు.  వెళుతూ తను లెక్కలేని యుద్ధాల్లో కొల్లగొట్టిన సంపదల్ని, బంగారాన్ని, వజ్రాల్ని తనతోబాటు తీసుకెళ్ళాడుట.  ఇది నిజం కాదు,  కథ. ఈ బరువుతో […]

కోరికలు లెక్కలేనన్ని ఉంటాయి. అవసరాలు కొన్నే ఉంటాయి. అవసరాల్ని తీర్చుకోవచ్చు. కానీ కోరికల్ని తీర్చుకోలేం. కోరిక అన్నది పిచ్చెక్కించే అవసరం. దాన్ని సంతృప్తి పరచడం అసంభవం. నువ్వు వాటిని తీరుస్తూ వెళ్ళేకొద్దీ అవి పెరుగుతూనే ఉంటాయి. వాటికి అంతముండదు. ఒక అద్భుతమయిన సూఫీ కథ ఉంది. అలగ్జాండర్‌ ద గ్రేట్‌ చనిపోయి స్వర్గానికి వెళ్లాడు. వెళుతూ తను లెక్కలేని యుద్ధాల్లో కొల్లగొట్టిన సంపదల్ని, బంగారాన్ని, వజ్రాల్ని తనతోబాటు తీసుకెళ్ళాడుట. ఇది నిజం కాదు, కథ. ఈ బరువుతో అలగ్జాండర్‌ ”కష్టమేముంది? ఇదంతా నేను ప్రపంచాన్ని జయించి సంపాదించింది” అన్నాడు. ద్వారపాలకుడు ”సరే! నీసంపదని నువ్వు సాటిలేనిదని అంటున్నావు. చూద్దాం” అని ఒక త్రాసు తీసుకొచ్చి ఒక వేపు అలెగ్జాండర్‌ తెచ్చిన సంపద నంతా పెట్టాడు. ఒక కన్ను తీసుకొచ్చి మరోవైపు పెట్టాడు. ఆ కంట్లోంచి ఎడతెగని ఆశ కనిపిస్తోంది. అలగ్జాండర్‌ సమస్త సంపాదన కన్నా కన్నే చాలా బరువు తూగింది. అలగ్జాండర్‌ సంపద తేలిపోయింది.

ఇది చూసి అలగ్జాండర్‌ ఆశ్చర్యపోయాడు. ‘ఏమిటిది? ఎందుకిలా జరిగింది?’ అన్నాడు. ద్వారపాలకుడు ఇది మనిషి కన్ను. ఇది మనిషి కోరికకు ప్రాతినిధ్యం వహిస్తుంది. దానికి తృప్తి ఉండదు. దాన్ని సంతృప్తి పర్చడం అసాధ్యం. ఎంతగొప్ప రాజ్యమయినా, ఎంతగొప్ప సంపదయినా, ఎంతగొప్ప ప్రయత్నమయినా దాన్ని తృప్తి పరచడం అసంభవం. అంటూ కొంత దుమ్ముతీసి ఆ కంట్లో చల్లాడు. అప్పుడు ఆ కన్ను మూసుకుంది. వెంటనే బరువు కోల్పోయింది. కేవలం అవగాహన అన్న చిన్న ధూళిని కోరిక అనే కంట్లో చల్లాలి. అప్పుడు కోరిక మాయమై అవసరాలే మిగిలి ఉంటాయి. అవి బరువుగా ఉండవు. తేలికగా

ఉంటాయి. అవసరాలు కొన్నే. అవి అద్భుతంగా ఉంటాయి. కోరికలు అసహ్యంగా ఉంటాయి. అవి నరరూప రాక్షసుల్ని తయారు చేస్తాయి. అవి పిచ్చివాళ్ళని తయారు చేస్తాయి. దుర్మార్గుల్ని సృష్టిస్తాయి. ప్రశాంతతని ఎట్లా ఎన్నుకోవాలో నువ్వు తెలుసుకుంటే నీకో చిన్నగది చాలు. అంత అన్నం చాలు. కొన్ని బట్టలు చాలు. ఒక ప్రియమైన వ్యక్తి చాలు.

– సౌభాగ్య

First Published:  7 Sept 2015 6:31 PM IST
Next Story