బడిలో… వారిదో భిన్న ఒరవడి!
మిగిలిన ఉద్యోగాల కంటే ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైనదని, విలువైనదని, ఎక్కువ గౌరవం పొందదగినదని భావిస్తాం. వీరు తమ వృత్తికి నూరుశాతం న్యాయం చేస్తే…ఒకదేశమే బాగుపడుతుంది. మరే వృత్తుల్లో ఉన్నవారికీ ఇలాంటి అరుదైన అదృష్టం లేదు. ఉపాధ్యాయుల్లో మానవీయ కోణాలుంటే వారు దేశ ముఖచిత్రాన్నే మార్చేయగలరు, కొన్ని తరాలను ప్రభావితం చేయగలుగుతారు. ముఖ్యంగా అలాంటి సదాశయంతో పనిచేస్తున్నవారు మహిళలయితే ఇక వారు పరిస్థితులను పూర్తిగా చక్కదిద్దేవరకు నిద్రపోరు. అలాంటి పనితీరుతోనే ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రపతి అవార్డులను సొంతం […]
మిగిలిన ఉద్యోగాల కంటే ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైనదని, విలువైనదని, ఎక్కువ గౌరవం పొందదగినదని భావిస్తాం. వీరు తమ వృత్తికి నూరుశాతం న్యాయం చేస్తే…ఒకదేశమే బాగుపడుతుంది. మరే వృత్తుల్లో ఉన్నవారికీ ఇలాంటి అరుదైన అదృష్టం లేదు. ఉపాధ్యాయుల్లో మానవీయ కోణాలుంటే వారు దేశ ముఖచిత్రాన్నే మార్చేయగలరు, కొన్ని తరాలను ప్రభావితం చేయగలుగుతారు. ముఖ్యంగా అలాంటి సదాశయంతో పనిచేస్తున్నవారు మహిళలయితే ఇక వారు పరిస్థితులను పూర్తిగా చక్కదిద్దేవరకు నిద్రపోరు. అలాంటి పనితీరుతోనే ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రపతి అవార్డులను సొంతం చేసుకున్న ముగ్గురు మహిళా మణిపూసలు వీరు-
ఉద్యోగాన్ని …వ్యక్తిగత బాధ్యతగా భావించి!
పిల్లలు స్కూలుకొస్తే చదువు చెబుతాం, వారు స్కూళ్లకు రాకపోతే మాకు సంబంధం లేదనుకునే టీచర్లు ఉన్న కాలం ఇది. ఈ క్రమంలోనే కొన్ని పాఠశాలలు ఏకంగా టీచర్లకంటే తక్కువమంది పిల్లలతో నడుస్తున్నాయి. ముఖ్యంగా ఆంగ్లేయుల పాలన పోయినా, ఆంగ్లం ఆధిపత్యం కొనసాగుతున్న నేటిరోజుల్లో తెలుగు చదువులకు పిల్లలను రప్పించడం చాలా కష్టం. కరీం నగర్ జిల్లాలోని రామడుగు మండలం, చిప్పకుర్తి ప్రాధమిక పాఠశాలకు మూడేళ్ల క్రితం ప్రధానోపాధ్యాయురాలిగా వెళ్లిన కలకొండ శశికళా రెడ్డికి ఇలాంటిసమస్యే ఎదురైంది. ముగ్గురే విద్యార్థులతో ఆ స్కూలు పరిస్థితి ఆమెకు సవాలుగా మారింది. తల్లిదండ్రులను అడిగితే మీరు చెప్పే తెలుగుచదువుతో రేపు మా పిల్లలు ఈ పోటీప్రపంచంలో ఎలా నెట్టుకురావాలి? అని ప్రశ్నించారు. పరిస్థితిని అర్థం చేసుకున్న శశికళ, ఆంగ్లభాషా బోధనకోసం ప్రత్యేక క్లాసులను నిర్వహిస్తామని మాటిస్తూ అదే విషయాన్ని పిల్లల తల్లిదండ్రులకు లిఖిత పూర్తకంగా రాసిఇచ్చారు. మాట ఇచ్చినట్టుగానే ఆంగ్లశిక్షణా క్లాసులు నిర్వహించడం మొదలుపెట్టారు. విద్యార్థుల సంఖ్యను మూడు నుండి 85 అయిదుకి పెంచారు. చిప్పకుర్తి బడికి తెలుగురాష్ట్రాల్లోనే ఉత్తమ పాఠశాల గుర్తింపుని తెచ్చారు. మూసివేయడమే తరువాయి అన్నట్టుగా ఉన్న బడిని ఇంతలా వెలిగించారంటే శశికళ కృషి ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు. చాలాసార్లు మనం విద్యారంగంలో దిగజారి పోతున్నవిద్య, విలువలకు కారణాలుగా వ్యవస్థనే చూపుతాం. ఇక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతాం. కానీ వ్యవస్థ అంటే వ్యక్తుల సమూహమని గుర్తించము. ప్రతి గురువు విద్యార్థుల మంచికోసం తపిస్తే విద్యావ్యవస్థలో మార్పులు తేవచ్చని శశికళ నిరూపించారు. 2010లో కూడా శశికళ జాతీయ అవార్డుని అందుకుని ఉన్నారు.
అటు విద్యాబోధన…ఇటు విద్యాభ్యాసం!
నిరంతరం నేర్చుకోలేనివారు, కొత్త అంశాలపట్ల ఆసక్తిని పెంచుకోలేనివారు, పిల్లలతో పాటు తమ జ్ఞానం, వ్యక్తిత్వం ఎదగాలనే ఆశయం లేనివారు ఉపాధ్యాయ రంగంలో రాణించలేరు. స్కూల్లో బల్లలు, బోర్డుల్లాగే యాంత్రికంగా పాఠాలు చెప్పి రిటైర్ అయిపోతారు. కానీ నాగమ్మ అలాకాదు, ముప్పయి ఆరేళ్ల క్రితం, పద్దెనిమిదేళ్ల వయసులో మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేటలోని దయానంద విద్యామందిర్‌లో టీచరుగా చేరారు. పిల్లలకు పాఠాలు చెబుతూనే తానూ చదువుని కొనసాగించారు. అలా ఎంఎ, బిఎడ్ వరకు చదువుకున్నారు. ఇరవైమంది పిల్లలకు ఏకోపాధ్యాయురాలిగా బోధన మొదలుపెట్టిన ఆమె, తన ఏకదీక్ష కృషితో ఏడేళ్లకే ఆ పాఠశాలకు ఎయిడెడ్ గుర్తింపు వచ్చేలా చేశారు. ముప్పయి ఆరేళ్లుగా ఎంతోమంది చిన్నారి పొన్నారి పిల్లలనూ చూస్తూనే ఉన్నారు, వారు జీవితంలో ఎదిగి తనను గుర్తుపెట్టుకుని వచ్చి పలకరిస్తుంటే ఆనందంతో పొంగిపోతూనే ఉన్నారు. తమ ఒక్క మంచి ఆలోచనతో పిల్లల మనసుల్లో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపే ఉపాధ్యాయులకు సమాజం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదు. నాగమ్మ తమ స్కూలు విద్యార్థులను స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణలో ప్రోత్సహించారు. వారు రాష్ట్రపతి నుండి బహుమతులు అందుకునే స్థాయికి ఎదిగేందుకు తగిన చేయూత నిచ్చారు. నాగమ్మ గతంలో రెండుసార్లు ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఉన్నత స్థాయి అవార్డులు అందుకున్నారు.
మానవీయ కోణంతో…మరింత చొరవతో…
బాలికల చదువుపై ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నట్టే ఉంటాయి. కానీ ఆడపిల్లలకు స్కూళ్లలో కనీస వసతులు సైతం ఉండవు. ఈ రెండూ సమాంతరంగా సాగుతుంటాయి ప్రజాస్వామ్యంలో. ఇలాంటపుడే వ్యక్తులు తమ శక్తిని చూపించాల్సింది. కరీంగనర్ జిల్లా, కొత్తపల్లి గ్రామంలోని రాణీపూర్ మండలపరిషత్తు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కలకొండ సంపతి కుమారి అదే చేశారు. ఉపాధ్యాయుల్లో తెలివితేటలు, విజ్ఞానాలతో పాటు చొరవ, సామాజిక స్పృహ, నాయకత్వ లక్షణాలు, మానవీయ దృక్పథం ఉండాలని ఆమె రుజువు చేశారు. పద్నాలుగేళ్ల క్రితం ఈ స్కూల్లో బాధ్యతలు చేపట్టిన ఆమె బాలికలు ఎక్కువగా గైర్హాజరు అవుతున్నట్టు గమనించారు. స్కూల్లో తాగునీరు లాంటి కనీస వసతులు, ముఖ్యంగా టాయిలెట్లు లేకపోవడం వల్ల అమ్మాయిలు అనేక ఇబ్బందులు, అనారోగ్యాలకు గరవుతున్నారని, అందుకే వారి హాజరు తక్కువగా ఉంటున్నదని గుర్తించారు. తల్లిదండ్రులు, గ్రామస్తులతో దీనిపై చర్చించారు. ప్రజాప్రతినిధుల సహాయం కోరారు. విద్యాశాఖ అధికారులను ఈ విషయమై స్పందించాలని పదేపదే కోరుతూ వచ్చారు. ఆమె చేతలన్నీ ఫలించి స్కూలుకి సదుపాయాలు వచ్చాయి. విద్యార్థుల సంఖ్య, హాజరూ రెండూ పెరిగాయి. ఇప్పుడు ఆ స్కూలు చుట్టూ చక్కని ప్రహరీ, బాలికలకు సైకిల్ స్టాండు, గ్రంథాలయం అన్నీ ఉన్నాయి. బోధనపరంగానూ మంచి మార్పులు చేశారు. పదవతరగతి ఉత్తీర్ణతా శాతాన్ని 98శాతానికి పెంచారు. ఈ స్కూలు నుండి ఇప్పటివరకు 16మంది ట్రిపుల్ ఐటిలో సీట్లు సంపాదించారు. విద్యార్థుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. ఈ స్కూలునుండి విద్యార్థులు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శనలో స్థానం సంపాదించారు. సంపతి కుమారి 2008లో రాష్టప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డుని అందుకుని ఉన్నారు.