వీరు బడిటీచర్లే...కానీ మొక్కుబడి టీచర్లు కాదు!
గురువుకి అర్థం మార్చేస్తున్న టీచర్లు ఇప్పడు మన కళ్లముందు చాలామంది కనబడుతున్నారు. విద్యార్థినుల పాలిట కీచకుని అవతారం ఎత్తి, మీడియాతో టీచకులు అనిపించుకుంటున్న వాళ్లూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు సిసలు గురువులుగా విద్యార్థుల అభ్యున్నతికి నూరుశాతం అంకితభావంతో పనిచేస్తున్నటీచర్లు కనబడితే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. అలాంటివారే వీరు…. గుజరాత్‌లోని పలు గ్రామాల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వీరంతా తరగతి గదుల్లో మొక్కుబడి చదువులు చెప్పడం లేదు. తాము చేస్తున్న వృత్తికి అర్థం తెలుసుకుని, గురువు గౌరవాన్ని పెంచుతున్నారు. దీపక్ […]
గురువుకి అర్థం మార్చేస్తున్న టీచర్లు ఇప్పడు మన కళ్లముందు చాలామంది కనబడుతున్నారు. విద్యార్థినుల పాలిట కీచకుని అవతారం ఎత్తి, మీడియాతో టీచకులు అనిపించుకుంటున్న వాళ్లూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు సిసలు గురువులుగా విద్యార్థుల అభ్యున్నతికి నూరుశాతం అంకితభావంతో పనిచేస్తున్నటీచర్లు కనబడితే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. అలాంటివారే వీరు….
గుజరాత్‌లోని పలు గ్రామాల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వీరంతా తరగతి గదుల్లో మొక్కుబడి చదువులు చెప్పడం లేదు. తాము చేస్తున్న వృత్తికి అర్థం తెలుసుకుని, గురువు గౌరవాన్ని పెంచుతున్నారు.
దీపక్ కుమార్ పటేల్:
ధనోలీ గ్రామంలో ప్రాథమిక టీచరుగా ఉన్న ఈ ఉపాధ్యాయుడు పిల్లలను స్కూలు వరకు రప్పించేందుకు ఒక వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈయన తన స్కూల్లో చదువుతున్న విద్యార్థుల్లో తెలివైనవారిని ఎంపిక చేసి వారు నివసిస్తున్న ప్రాంతాల్లో స్ట్రీట్ లీడర్లుగా నియమించారు. తమ వీధుల్లో ఉన్న పిల్లలను ప్రతిరోజూ స్కూలుకి తీసుకువచ్చే బాధ్యత వీరిదే. ప్రతినెలా చివర్లో ఎక్కువమంది పిల్లలను స్కూలుకి తెచ్చినవారికి దీపక్ కుమార్ బహుమతులు ప్రకటించి, అందిస్తున్నారు. ఈ పద్ధతి వలన స్కూల్లో హాజరు పెరగడమే కాకుండా పిల్లలను తెచ్చే విద్యార్థుల్లో లీడర్ షిప్ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని ఆయన చెబుతున్నారు.
కిరణ్ కుమార్ అగ్రావత్:
జండుధాయి గ్రామంలో ప్రాథమిక పాఠశాల టీచరు ఈయన. పిల్లల్లో కుతూహలాన్ని, జిజ్ఞాసని, ఆలోచనా శక్తిని పెంచేందుకు ఈయన కౌన్‌బనేగా కరోడ్‌పతి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని, అదే తరహాలో ఒక క్విజ్ ప్రోగ్రామ్‌ని రూపొందించారు. పిల్లల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు ప్రతి ప్రశ్నకు ఒక కల్పిత బహుమానం (చిత్రం రూపంలో) ఉంటుంది. సైన్స్ సోషల్ టెక్నాలజీ లెక్కలు అన్ని రకాల ప్రశ్నలను క్విజ్‌లో అడుగుతుంటారు. పిల్లలందరికీ ప్రశ్నలు ఉంటాయి. కెబిసిలో లాగేనే మూడు లైఫ్ లైన్లు కూడా ఉంటాయి.
రాజు దభీ:
రేవా ప్రైమరీ స్కూల్లో టీచరుగా పనిచేస్తున్న రాజు, పిల్లలకు భౌగోళిక శాస్త్రాన్ని నేర్పడంలో ఒక సరికొత్త పంథా ఎంచుకున్నారు. పిల్లల రోజువారీ జీవితాలను పాఠాల కు అనుసంధానం చేసి చెబుతున్నారు. సాంఘిక శాస్త్రంలో మ్యాప్ పాయింటింగ్ ని వినూత్నంగా నేర్పతున్నారు. తమ గ్రామం, చుట్టుపక్కల గ్రామాల్లోని ముఖ్యమైన ప్రదేశాలు, వాటి సరిహద్దులను వాస్తవంలో చూపించి, వారికి మ్యాప్ పాయింటింగ్ మీద అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలు వారి తరగతి గదుల మ్యాపులను సైతం తయారుచేసేలా తర్ఫీదు ఇస్తున్నారు.
అక్బర్ ముల్తానీ:
ఖొదియారానగరాలో టీచరుగా పనిచేస్తున్న అక్బర్‌ది మరొక పంథా. ఈయన పిల్లలకు లెటర్ రైటింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. రేపు వారు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలంటే ఇందులో నైపుణ్యం ఉండాలి అంటున్నారాయన. అయితే ఈయన శిక్షణ ఇచ్చే క్రమంలో పిల్లల చేత ఏకంగా గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రికే ఉత్తరాలు రాయిస్తున్నారు. దీనివలన ఉత్తరాలు రాయడంలో నైపుణ్యం పెరగడంతో పాటు, వివిధ అంశాలమీద ఉత్తరాలు రాయడం వలన వారికి సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్యం ఎలా పనిచేస్తుంది…అనే విషయాలు తెలుస్తాయని ఆయన భావిస్తున్నారు. గుజరాత్ సిఎమ్‌కి తమ ఉద్దేశ్యాన్ని వివరిస్తూ ఓ ఉత్తరం కూడా రాశారు అక్బర్. అంతేకాదు, తమ పిల్లల ఉత్తరాలకు సమాధానాలు ఇవ్వమని కోరారు. పిల్లలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సమాధానం వస్తే….దాన్ని అసెంబ్లీలో చదివి వినిపిస్తారు. ఆ ప్రశ్న సమాధానానికి సంబంధించిన కాపీలు తీసి పిల్లలందరికీ పంచుతారు.
బిందుబా జాలా:
రాజ్ పూర్‌కి చెందిన ఈ టీచరు పిల్లల్లో నిర్ణాయక, విశ్లేషణా శక్తులను, కలిసి పనిచేయడానికి కావలసిన నేర్పుని పెంచుతున్నారు. ఆమె పిల్లలకోసం ఓ పేపరు ప్రచురణ ప్రారంభించారు. దీని నిర్వహణ అంతా పిల్లలే చూస్తున్నారు. వార్తలు సేకరించుకోవడం, రాయడం, ఎడిట్ చేసుకోవడం అంతా పిల్లలే చేస్తున్నారు. పిల్లలు తమ సొంతంగా పేపరు ముద్రించి బయటకు తెచ్చేలా ఆమె తర్ఫీదు ఇస్తున్నారు. ఈ పేపర్‌ని స్కూల్లో పంచడమే కాదు, గ్రామంలోని ఇళ్లకు సైతం పంపుతుంటారు.
శైలేష్ చౌదరి:
ఉట్చల్లోని థుటి ప్రైమరీ స్కూలు టీచరు ఈయన. టీనేజి పిల్లలు ఏ దుర్వ్యసనాల బారిన పడకుండా ఆయన మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఆరు ఏడు ఎనిమిది చదివే పిల్లలతో టొబాకో కంట్రోల్ కమిటీలు ఏర్పాటుచేశారు. పొగాకు వినియోగం వలన వచ్చే వ్యాధులను తెలియజేసే వర్కింగ్ నమూనాలను తయారు చేయిస్తున్నారు. దీనిమీద ప్రదర్శనలు, వర్క్‌షాపులు, క్విజ్‌లు, ఆటలు, వ్యాసరచన వకృత్వ పోటీలు తదితరాలు నిర్వహిస్తున్నారు. పొగాకు వినియోగంతో వచ్చే నష్టాలను వివరించే బ్యానర్లు తయారుచేయించి స్కూలు చుట్టుపక్కల ఏర్పాటు చేయించారు. పొగాకు వినియోగంతో అనారోగ్యాల బారిన పడ్డవారికి సహాయం చేసేందుకు ఆర్థిక నిధులు సమకూర్చుకునేలా విద్యార్థులను ప్రొత్సహిస్తున్నారు.
ఒక్క మంచి ఆలోచనా బీజాన్ని కొన్ని వందల లేత మెదళ్లలో నాటగల శక్తి, అదృష్టం ఉన్నఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు. వారు పిల్లలకు సంస్కారం నేర్పుతూ, వారినుండి నమస్కారాలు అందుకునేలా ఉండాలని ఆశిద్దాం.
– వి. దుర్గాంబ