Telugu Global
Others

ఇంట్లో...మ‌న‌తో పాటు... వేల ప్రాణులు!

ఎప్పుడైనా ఇంట్లో ఒక్క‌రమే ఉన్నప్పుడు…అబ్బా ఒంట‌రిగా ఉన్నామే…అనుకుంటాం క‌దా…కానీ ఈ వార్త విన్నాక ఇక అలా అనుకోలేమేమో.  ఎందుకంటే మ‌న ఇళ్ల‌లో మ‌నతో పాటు వేల‌కొద్దీ జీవులు నివ‌సిస్తున్నాయి.  మ‌న ఇళ్ల‌లో ఉన్న దుమ్ము ధూళిలో క‌నీసం తొమ్మిదివేల జాతుల‌కు చెందిన సూక్ష్మ‌క్రిములు ఉంటాయ‌ట. అమెరికాలో దేశ‌ వ్యాప్తంగా ఉన్న 1200 ఇళ్ల‌లోని దుమ్ముని ప‌రిశీలించి బౌల్డ‌ర్‌లోని కొల‌రాడో యూనివ‌ర్శిటీ శాస్త్ర‌వేత్త‌లు ఈ విష‌యాన్ని తేల్చారు. ఇల్లు ఉన్న ప్ర‌దేశం, ఆ ఇంట్లో నివ‌సించే మ‌నుషులు, పెంపుడు […]

ఇంట్లో...మ‌న‌తో పాటు... వేల ప్రాణులు!
X

ఎప్పుడైనా ఇంట్లో ఒక్క‌రమే ఉన్నప్పుడు…అబ్బా ఒంట‌రిగా ఉన్నామే…అనుకుంటాం క‌దా…కానీ ఈ వార్త విన్నాక ఇక అలా అనుకోలేమేమో. ఎందుకంటే మ‌న ఇళ్ల‌లో మ‌నతో పాటు వేల‌కొద్దీ జీవులు నివ‌సిస్తున్నాయి. మ‌న ఇళ్ల‌లో ఉన్న దుమ్ము ధూళిలో క‌నీసం తొమ్మిదివేల జాతుల‌కు చెందిన సూక్ష్మ‌క్రిములు ఉంటాయ‌ట. అమెరికాలో దేశ‌ వ్యాప్తంగా ఉన్న 1200 ఇళ్ల‌లోని దుమ్ముని ప‌రిశీలించి బౌల్డ‌ర్‌లోని కొల‌రాడో యూనివ‌ర్శిటీ శాస్త్ర‌వేత్త‌లు ఈ విష‌యాన్ని తేల్చారు. ఇల్లు ఉన్న ప్ర‌దేశం, ఆ ఇంట్లో నివ‌సించే మ‌నుషులు, పెంపుడు జంతువులు…ఈ అంశాల‌ను బ‌ట్టి ప‌లుర‌కాల బ్యాక్ట‌రియా, ఫంగ‌స్ ఉన్న‌ట్టుగా ఆ ప‌రిశోధ‌కులు క‌నుగొన్నారు.

ది వైల్డ్ లైఫ్ ఆఫ్ అవ‌ర్ హోమ్స్ అనే సిటిజ‌న్ సైన్స్ ప్రాజెక్టులో భాగంగా ఈ ప‌రిశోధన నిర్వ‌హించారు. ప్ర‌తి స‌గ‌టు ఇంట్లో రెండువేల జాతుల‌కు పైగా ఫంగ‌స్, ఏడువేల ర‌కాల బ్యాక్టీరియా ఉంటుంద‌ని, ముఖ్యంగా ఫంగ‌స్ బ‌య‌ట‌నుండి మ‌న దుస్తుల ద్వారా, తెర‌చి ఉన్న త‌లుపులు, కిటికీల ద్వారా లోప‌లికి వ‌స్తుంద‌ని ఈ శాస్త్ర‌వేత్త‌లు వివ‌రిస్తున్నారు. ఇంట్లో ఉంటున్న‌ది ఆడ‌వారా, మ‌గ‌వారా అనే విష‌యాన్ని బ‌ట్టి కూడా భిన్న‌మైన‌ బ్యాక్టీరియా చేరుతున్న‌ట్టుగా శాస్త్ర‌వేత్త‌లు గ‌మ‌నించారు. అలాగే పెంపుడు జంతువులు సైతం ఇంట్లోకి చేరుతున్న బ్యాక్టీరియాపై ప్ర‌భావాన్ని చూపుతున్నాయి. ఇవ‌న్నీ కాకుండా ఇల్లు ఉన్న ప్రాంతం, ఆ ఇంటి డిజైన్… ఈ రెండు విష‌యాలను బ‌ట్టి కూడా ఇంట్లోకి చేరుతున్న‌ బ్యాక్టీరియాలో తేడాలున్నాయి.

ఇళ్ల‌లో సూక్ష్మ‌జీవులు ఉంటాయ‌న్న‌ది పాత విష‌య‌మే అయినా, ఇప్పుడు శాస్త్ర‌వేత్త‌లు ఇవి మ‌న ఆరోగ్యం మీద ఎలాంటి ప్ర‌భావాన్ని చూపుతాయి…అనే విష‌యాన్ని ప‌రిశోధించాల‌నుకుంటున్నారు. వీటిలో కొన్ని అనారోగ్యాల‌ను, ఎల‌ర్జీల‌ను క‌లిగించేవి ఉన్నా, చాలావ‌ర‌కు హాని చేయ‌నివే అని, కొన్ని మ‌న‌కు ప్ర‌యోజ‌నాన్ని క‌లిగించేవి సైతం ఉన్నాయ‌ని వారు చెబుతున్నారు.

మ‌న ఇంటినిండా, మ‌న చుట్టూ, మ‌న శ‌రీరంమీదా అంత‌టా సూక్ష్మజీవులు ఉన్నాయ‌న్న‌ది నిజం. కానీ మ‌నుషులు వీటి గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. ఇందులో చాలావ‌ర‌కు మ‌న‌కు ఎలాంటి హానీ చేయ‌నివే… అంటున్నారు డాక్ట‌ర్ ఫెర‌ర్ అనే శాస్త్ర‌వేత్త‌. మొత్తానికి మ‌నకు తెలియ‌కుండానే మ‌నం బోలెడు భూత‌ద‌య చూపుతున్నామ‌న్న‌మాట.

-వ‌డ్ల‌మూడి దుర్గాంబ‌

First Published:  5 Sept 2015 6:22 AM IST
Next Story