Telugu Global
Arts & Literature

నాకు నచ్చిన నాకథ

“పాప” కథ గురించి… నా చిన్నప్పుడు మా ఇంట్లో వీర్రాజు అనే అబ్బాయి పనిచేస్తూ ఉండేవాడు. అతని తల్లి అతన్ని తన తల్లిదండ్రుల దగ్గర వదిలేసి మళ్లీ పెళ్లిచేసుకుని వెళ్లిపోయిందట. మా ఇంటి ఎదుట మాలపల్లెలోని జల్లివీరన్న మనవడు అతను. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. మా అమ్మానాన్నల్ని అమ్మ-నాన్న అని,  నన్ను చెల్లెమ్మ అని పిలిచేవాడు. నేను బళ్లో నేర్చుకున్న చదువు ఇంటికొచ్చి అతనికి నేర్పిస్తూ ఉండేదాన్ని. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. మా అమ్మ […]

నాకు నచ్చిన నాకథ
X
K Varalaxmi2
కె. వరలక్ష్మి

“పాప” కథ గురించి…

నా చిన్నప్పుడు మా ఇంట్లో వీర్రాజు అనే అబ్బాయి పనిచేస్తూ ఉండేవాడు. అతని తల్లి అతన్ని తన తల్లిదండ్రుల దగ్గర వదిలేసి మళ్లీ పెళ్లిచేసుకుని వెళ్లిపోయిందట. మా ఇంటి ఎదుట మాలపల్లెలోని జల్లివీరన్న మనవడు అతను. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. మా అమ్మానాన్నల్ని అమ్మ-నాన్న అని, నన్ను చెల్లెమ్మ అని పిలిచేవాడు. నేను బళ్లో నేర్చుకున్న చదువు ఇంటికొచ్చి అతనికి నేర్పిస్తూ ఉండేదాన్ని. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. మా అమ్మ పప్పుచారుతో అన్నంపెట్టిన రోజు “సిన్న ఎండుసేపముక్క కాల్చియ్యమ్మా” అని అడిగేవాడు. బొంగరంలా తిరుగుతూ పనులు చక్కబెట్టేవాడు. కాని, తన తల్లిమాట వస్తే చాలు అక్కడి నుంచి లేచిపోయేవాడు. వాళ్లమ్మంటే అసలు ఇష్టపడేవాడు కాదు.

నా పెళ్లై నేను మా అత్తవారింటికెళ్లేక బాబ్జీ అనే మరో కుర్రాడు మా ధాన్యం మిల్లులో పనిచేసేవాడు. నన్ను “అక్కా” అని పిలిచేవాడు. పదిపన్నెండేళ్ల వయసున్నవాడిని అందరూ దొంగ అని చెప్పుకొచ్చేవారు. వీడినీ పుట్టగానే తల్లి వదిలేస్తే మరెవరో పెంచుతున్నారు. ఎవరిమాటా లెక్కచేయనివాడు నేనేం చెప్పినా వినేవాడు. నామాటకోసం దొంగతనాలు మానేసాడు. వాళ్లిద్దరి గురించీ కథ రాయాలని అన్పించేది. “ఎలా మొదలు పెట్టాలి?” అనుకుంటున్నప్పుడోసారి నేను ప్రయాణిస్తున్న పాసింజరు రైలు కొవ్వూరు స్టేషన్లో చాలాసేపు ఆగిపోయింది. ఈ కథలోని స్టేషను దృశ్యమంతా అక్కడ జరిగిందే. పాప ఒక్కతే నా కల్పన.

శ్రీ కొంగర జగ్గయ్యగారు, ఉప్పల నరసింహంగారు కథా వేదిక తెస్తున్న రోజులవి. ఈ కథను కథావేదికలో ప్రచురించేరు. తర్వాత ఎప్పుడో “విపుల”లో “నాకు నచ్చిన కథ” శీర్షికలో జగ్గయ్య గారు ఈ కథ తనకు నచ్చిన కథ అని ప్రస్తావించేరు. ఆంధ్రప్రభ డైలీలో ఈ కథను మాగ్నమ్‌ ఓపస్‌ అంటూ యాళ్ల అచ్యుత రామయ్యగారు నన్ను ఇంటర్యూ చేసారు.

కథా రచనలో శ్రీకాళీపట్నం రామారావు మాస్టారు నాకు ఆదర్శం. అట్టడుగు వర్గాల జీవితాలమీద కథలు రావాలని నేను కోరుకుంటాను. ఆ జీవితాన్ని దగ్గరనుంచి పరిశీలించి రాయడంవలన ఈ కథ అందరికీ నచ్చిందని నా అభిప్రాయం. బాలిగాడి కేరెక్టరుకి మూలమైన ఇద్దరూ చిత్రంగా మంచి గాయకులు. వీర్రాజైతే తర్వాతి కాలంలో ప్రసిద్ధనటుల సరసన నక్షత్రకుడు, నారదుడు వంటి పాత్రలకి పెట్టింది పేరన్పించుకుని దేశం మొత్తం పర్యటించేడు, తర్వాతి రోజుల్లో తాగుడు అతన్ని మింగేసింది. ఏ మనిషినీ ఒకే కోణంలోంచి చూడకూడదనీ, మనిషి నడవడికలో బహుముఖాలుంటాయనీ చెప్పిన నా కథ, నాకిష్టమైన కథ. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఏమాత్రం పాలుమాలకూడదని గ్రహించాలని ఈ కథముగింపు అలా చేసాను.

* * *

పాప

– కె. వరలక్ష్మి

సూర్యబింబం పశ్చిమాద్రివెనక దిగడానికి సన్నద్దమౌతోంది. ఆకాశం సింధూరం రంగు పైటచెంగును ఆరబెట్టుకుంటోంది. తూర్పున అప్పుడే మొదటి చుక్క మెరవబోతోంది.

మోకాలి మీద ముందుకి వంగి చితుకులు పొయ్యిలోకి ఎగదోసాడు బాలిగాడు. వెదురు గొట్టంతో బుగ్గలనిండా గాలి పూరించి పొయ్యిలోకి ఊదుతున్నాడు. తడిసిన చితుకులు రాజుకోడానికి ఎదురుతిరుగుతున్నాయి. తెల్లని పొగ మాత్రం బాలిగాడి కళ్లల్లో నిండిపోయి నీళ్లు తెప్పిస్తోంది. ఊది ఊది అలిసిపోయి నేలమీద చతికిలపడ్డాడు.

“దీనమ్మా సిగ్గోసిరి. ఎదవ సితుకులు తడిసిపోనాయెహె” అని తిట్టుకున్నాడు.

“ఓరి బాలిగా! సుట్టకాల్సుకోటానికి సిన్న నిప్పెట్రా” టాయ్‌లెట్స్‌ పక్కనించి గుడ్డి ఈరిగాడు ఓ కేకపెట్టేడు.

“ఛెయ్‌, ఉండెహె, ఇదంటుకోక నాను సత్తా ఉంటే, రాజాగోరికి నిప్పుగావాలంట” విసుగంతా గొంతులో చూపించేడు బాలిగాడు.

దూరంగా ఫ్లాట్‌ఫారం విపరీతమైన సందడిగా ఉంది. స్టేషన్లో ట్రెయిను ఆగి ఉంది. దిగినవాళ్లూ, ఎక్కేవాళ్లూ సామాన్లు సరిపోయేయోలేదో చూసుకుని మర్చిపోయిన వాటికోసం బండిలోపలికి, బైటికీ పరుగులెత్తుతున్నారు. ఆ స్టేషన్‌ చిన్నది. అక్కడ ఏ బండీ ఎక్కువసేపు ఆగదు.

బండి ఆగిన వెంటనే బాలిగాడు పరుగెత్తుకెళ్లి కిటికీల దగ్గర అడుక్కోవడం ఓ రౌండు పూర్తిచేసి వచ్చాడు. ఈలోగా పొయ్యికాస్తా ఆరిపోయి ఊరుకుంది. కుండ మీది మూత తీసి చూసాడు. అడుగున నూకలు, పైన నీళ్లూ కదలామెదలకుండా ఉన్నాయ్. పొద్దున తాగిన టీ నీళ్లు తప్ప ఆ రోజంతా కడుపులో ఏం పడలేదు. వాడి కడుపులో ఆకలిమండుతోంది.

చట్టి కింద పొయ్యి మండడంలేదు. పొయ్యి మండేదెప్పుడూ… గంజి తాగేదెప్పుడు?

చుట్టూ చూపుల్ని పరుగెత్తించేడు. పారేసిన కాయితాలేవైనా దొరుకుతాయేమోనని. దరిదాపుల్లో ఎక్కడా ఏం కన్పించలేదు.

“ఏ కాయితమ్ముక్కైనా పడ్డం బయ్యం, తుడిసి సెత్తకుండీలో పాడేత్తారు ఎదవనాకొడుకులు”

స్వీపర్లని తిట్టుకుంటూలేచి చెత్తకుండీ వేపు నడిచేడు. కుడిచేతి గుప్పిటినిండా చిత్తు కాయితాలు బిగించి పట్టుకుని పొయ్యిదగ్గర కొచ్చేడు. అంతకు ముందే కురిసిన సన్నటి జల్లుకి ఆ కాయితాలు కూడా తడిసిపోయున్నాయి.

పొయ్యిలోంచి వస్తున్న పొగమీద కాయితాల్ని కూరి, మళ్లీ ఊదడానికి లంకించుకున్నాడు. ఈసారి అగ్గికి వాడిమీద జాలేసినట్టుంది. రప్పుమని మండింది పొయ్యి. పొయ్యి వెలగడంచూసి బాలిగాడి మొహం వెలిగిపోయింది. “అమ్మయ్య ఇంకేం పర్నేదు. ఐదు నిముసాల్లో గంజి కాసేత్తాను” అనుకున్నాడు.

“బాలిగా, నిప్పు” మళ్లీ అరిచేడు ఈరిగాడు.

“ఈడొకడ్రా బావూ నా పేనానికి, పొయ్యెలిగించిన కాణ్నుంచి అత్తమాటూ నిప్పు నిప్పని సంపేత్తాడు” గొణుక్కుంటూ చిన్న చితుకొకటి పట్టుకెళ్లి ఈరిగాడి చుట్టముట్టించి వచ్చేడు.

“నాబాబే, నాబాబే, సేనా మంచోడివిరా బాలిగా” అని మెచ్చుకున్నాడు ఈరిగాడు. పొద్దున్నే సుట్ట ముక్కకి పదిపైసలు అప్పివ్వలేదని ఈరిగాడు బూతులు తిట్టడం గుర్తొచ్చి “ఎదవ, ఏలపట్టుని ప్లేటు మార్చేత్తాడు” అనుకున్నాడు.

బాలిగాడికి ఊహ తెలిసినప్పట్నుంచీ ఆ ఫ్లాటుఫారమే ఇల్లూ వాకిలీ. ఆ వూరే అమ్మానాన్నా. ఆకలి వాడికి కష్టపడ్డం తప్ప అన్ని రకాల విద్యలూ నేర్పింది. చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు “పోనీలే చిన్నోడు” అని జాలిపడి అన్నం పెట్టిన వాళ్ళంతా పెరిగి పెద్దవాడయ్యాక కూడా వాడదే వృత్తిని అనుసరించబోతే ఈసడించుకున్నారు. కొంతమంది మంచిగా పిలిచి కష్టపడి కడుపుకింత సంపాదించుకోవడం గౌరవప్రదం అని బోధించి చూసేరు. ఆ బోధలేవీ వాడి చెవికెక్కలేదు. ఒకిటి రెండుసార్లు ప్రయత్నం చేసి చూసాడు కాని, వాడి, ఒళ్లు వంగలేదు. స్టేషన్‌ సిబ్బంది కూడా వాడినేదైనా పన్లో పెట్టాలని చూసారు. వాడికి హఠాత్తుగా చెముడొచ్చింది. అంటే నిజంగా వచ్చిందని కాదు. చెవిటి తనం చూడగానే కన్పించేది కాదు కాబట్టి కుంటితనాన్ని కొని తెచ్చుకోవాలని చూసాడు. సొంత శరీరాన్ని సొంతంగా హింసించుకోవడం వాడి తరం కాలేదు. అందుకని రోజూ ఉదయం లేవగానే ఎడంకాలి పాదానికి ఓ మూటెడు పాత గుడ్డల్తో బేండేజీ కడతాడు. అక్కడక్కడ ఎర్రరంగు పులుముతాడు. చేతిలో ఒక డబ్బాతో కుంటుకుంటూ బయలుదేరతాడు. స్టేషన్లో వచ్చే డబ్బుల్తో బీడీలు, ఇడ్లీలు, టీలూ కొనుక్కుంటాడు. అన్నం తినాలనో, గంజితాగాలనో అన్పించిన రోజు ఊళ్లోకిపోయి నూకలు అడుక్కుని తెచ్చుకుంటాడు. మరీ నిర్లక్ష్యంగా ఉన్న ప్రయాణీకులు కన్పించినప్పుడు మాత్రం సంశయించకుండా పిక్‌ పాకెటింగ్‌ చేసేస్తాడు. అదృష్టం బాగుండి కొట్టేసిన పర్స్‌లో డబ్బులెక్కువే ఉంటే నాలుగు రోజులపాటు అడుక్కోవడం మానేసి బిస్కెట్లు, బిర్యానీల మీద బండి లాగించేస్తాడు.

స్టేషన్లో బండి కూతవేసి బయలు దేరింది. ఒక్కసారిగా సందడంతా సద్దుమణిగి పోయింది. ఆ స్టేషన్లో ఆగే ఆఖరు బండి అదే.

పొయ్యికింద చితుకుల్ని ముందుకి తోసేడు బాలిగాడు. మంట కుండ అంచుల్ని తాకింది. ఒక్కసారిగా మూతను పైకి లేపేస్తూ గంజి పొంగింది. పైమీది తువాలు గుడ్డతో మూతను తీసి పక్కన పెట్టి చెక్కపేడుతో గంజిని కలియబెట్టేడు. జేబులోంచి ఉప్పుపొట్లం తీసి చారెడు ఉప్పు గంజిలో వేసేడు, కుండ కిందికి దింపి, పక్కనే ఉన్న ప్లాస్టిక్‌ చెంబులోని నీళ్లు కొద్దిగా మంట మీద చిలకరించేడు. మంట ఆరిపోయి నిప్పులు మిగిలేయి.

నిక్కరు జేబు వెతుక్కుని కాయితంలో చుట్టి ఉన్న ఉప్పు చేపముక్కని అపురూపంగా బైటికి తీసేడు. చెమ్మకి దానికంటుకుపోయిన కాయితాన్ని పూర్తిగా విప్పకుండానే ఆ ముక్కని నిప్పుల్లో పడేసాడు. కర్రపుల్లతో దాన్ని అటూ ఇటూ తిప్పుతూ కూర్చున్నాడు. స్టేషన్‌ పరిసరాలన్నీ ఎండు చేప కాల్తున్న వాసనతో నిండిపోయేయి. ఆ వాసనకి బాలిగాడికి నోట్లో నీళ్లూరి పోతున్నాయి. ఎప్పుడెప్పుడు గంజి చల్లారుతుందా, ఉప్పు చేప నంజుకుని తాగుదామా అన్పిస్తోంది. రోజూ ఉప్పుచేప కొనుక్కునే అవకాశం రాదు. ఎండు సందువా ముక్క రూపాయి పెడితేగాని రాదు. సాధారణంగా బాలిగాడికి గంజిలో నంజుకు పచ్చిమిరపకాయే. అప్పుడప్పుడూ ఇలా అదృష్టం కలిసొచ్చిన్రోజు ఉప్పుచేప.

“ఉప్పుసేప కాలుత్తున్నావేట్రా బాలిగా” ముక్కుపుటాలెగబీలుస్తూ ఈరిగాడు అడిగేడు. “నువ్వు తినేసేక సిన్నముల్లు మిగిల్తే నాకియ్‌రా” నోట్లో ఊరుతున్న నీళ్లని గుటకేస్తూ అన్నాడు.

బాలిగాడికి అర్జంటుగా చెవుడొచ్చింది. “అడుక్కున్న డబ్బులన్నీ బొడ్డుకాడ ముడిసీసి, అందర్నీ దేబిరించుకు బతికేత్తాడు దొంగనాకొడుకు” నోట్లోనే తిట్టుకున్నాడు బాలిగాడు.

ఆసరికి పూర్తిగా చీకటి పడింది. టాయ్‌లెట్స్‌ దగ్గరున్న లైటు ఈరిగాడి మీద పూర్తిగాను, బాలిగాడిమీద పాక్షికంగానూ పడుతోంది.

“గుడ్డోడికి కనపడతాదేట్లే” అనుకుని రెండు కాళ్లూ బారచాపుకుని, మధ్యలో గంజికుండ పెట్టుకుని, ఎడంచేత్తో ఉప్పుచేప పట్టుకుని అతృతగా తినడానికి సిద్ధమయ్యేడు బాలిగాడు. ఓ కన్ను ముసలాడి మీద వేసే ఉంచాడు. గంజితాగే చప్పుడుకి చప్పుళ్లేకుండా వెనకనించొచ్చేసి “కూసింత గెంజి నీల్లియ్యరా బాలిగా” అని కూడా అడిగేస్తాడేమోనని.

కుండ అడుగునున్న మెతుకుల్ని నాలుగు గుక్కలు తిన్నాడో లేదో ఎడంగా పెట్టిన పాదాల మధ్య అడుగెత్తు ఆకారమొకటి నిలబడినట్లై తలపైకెత్తేడు, ఉలిక్కిపడి తాగుతున్న గంజి కొరబోయింది.

రబ్బరు బొమ్మలాంటి పాపాయి వచ్చి తన పాదాల సందున నిల్చుంది. కలోనిజమో అర్థంకాలేదు. తేల్చుకోడానికి కాలితో తాకి చూసేడు. నిజంగానే పిల్ల. పడీపడని వెలుతుర్లోకూడా ఆ పిల్ల ఒంటి రంగు మెరిసిపోతోంది. పట్టుగౌను కాబోలు పిల్ల ఒంటి రంగుతో పోటీ పడుతోంది. మెళ్లో గొలుసు, చేతులకి రెండేసి బుల్లి బుల్లి గాజులు, చెవులకి జూకాలు, నాలుగు ఉంగరాలు “ఇంతవరకూ రైలు కోసం స్టేషన్లో కూచున్న పెళ్ళివోళ్ల తాలూకు అయి ఉంటాదీ పిల్ల. రైలెక్కే సందట్లో వదిలేసి పోయుంటారు” అనుకున్నాడు బాలిగాడు.

అనాలోచితంగా చుట్టూ పరికించేడు ఆ పిల్ల తాలూకా వాళ్లెవరైనా ఉన్నారేమోనని. అవతల ఈరిగాడూ, ఇవతల తనూ తప్ప మరో మనిషి లేరక్కడ, స్టేషన్లో కూడా అలికిడేం లేదు. బైటికి పోవాల్సినోళ్ళంతా ఎప్పుడో వెళ్లిపోయేరు. స్టేషను మేష్టారి గదిలో మాత్రం లైటు వెలుగుతూంది.

బాలిగాడికి తన గుండె చప్పుడు తనకే స్పష్టంగా వినబడుతోంది. వెళ్ళిపోయిన రైలు వెనక్కొచ్చి తన గుండెల్లో పరుగు తీస్తోందా అన్పిస్తోంది. అంత ఆకలీ ఏమైందో తెలీదు గంజి గొంతు దిగడం మానేసింది. ఉప్పుచేప రుచి మారిపోయింది. ఎలాగో గొంతు పెకిలించుకుని మెల్లగా అడిగేడు” నీ పేరేంటి పాప గోరూ?” పాప ఒంటి మీదున్న బంగారం వాణ్ణి బహువచనానికి పురికొల్పింది.

“అమ్మ” అంది పాప.

“నీపేరు.. పేరు…” అన్నాడు వాడు.

“అమ్మ” అంది పాప మళ్లీ

“ఇదేం గోలెహెయ్‌, అమ్మ అమ్మంటాది. మాటల్రావు గామోసు” అనుకున్నాడు. చేతిలో చేపముక్కని చూపించి “తింటావా” అన్నాడు.

పాప తల అడ్డంగా ఊపింది. ఎంగిలి చేత్తో నెత్తిమీదొకటి కొట్టుకున్నాడు. “ఇలాంటి కలిగినింటి పిల్లలు బిస్కత్తులు తింటారు గానీ, ఉప్పుసేపలు తింటారేట్రా ఎదవా” అని తనని తనే తిట్టుకున్నాడు.

ఓ క్షణం ఏం చెయ్యాలో పాలుపోలేదు. ముందు ముఖ్యంగా పాప ఒంటిమీదున్న బంగారాన్ని కాళీచేసెయ్యాలి.

రెండు కాళ్లూ జాగ్రత్తగా దగ్గరికి లాక్కుని, గంజిముంతనీ, ఉప్పుచేపనీ పట్టుకెళ్లి ఈరిగాడి కిచ్చేసి వాడేదో అడుగుతున్నా విన్పించుకోకుండా ఉరుక్కుంటూ వచ్చేసేడు. కుంటికాలి మాటే మర్చిపోయేడు.

గబగబా పాప నగలన్నీ తీసేసి జేబులో వేసుకున్నాడు. జూకాలు మాత్రం రాలేదు. రింగుతో చెవికి చుట్టేసి ఉన్నాయి. తెంపేద్దామా అనుకున్నాడు. అలా చేస్తే పిల్ల ఏడుస్తుందని, ఆ ఏడుపు విని స్టేషనుమేష్టరు బైటికి రావచ్చనీ స్ఫురించింది వాడికి. “పోన్లే దొరికినకాడికే ప్రాప్తం. ఈరోజు లెగ్గానే ఎవరిదో బంగారు మొకం సూడబట్టి ఇంతదురుష్టం కలిసొచ్చింది. ఎప్పుడన్నా కల్లోకన్నా వచ్చిందా ఇంత బంగారం? అమ్మితే ఎంతొత్తాదో కానీ, మొత్తం మీద బంగారానికి మాత్రం సాలా రేటుంటాదంట. తల్లి మాలచ్చిమి కలిసొచ్చిన కాలానికి నడిసొచ్చీసినాది” అనుకున్నాడు.

పాత గుడ్డల సంచిని భుజానికి తగిలించుకున్నాడు. స్టేషన్‌ గేట్లోంచి వెళ్లడానికి ధైర్యం చాల్లేదు. పట్టా వెంబడే వీలైనంత దూరం పోవాలని, తిరిగి కొన్నాళ్ల వరకూ ఈ దరి దాపులకి రాకూడదనీ నిశ్చయించుకున్నాడు. వాతావరణం చల్లగా ఉన్నా చెమటలు దిగకారుతున్నాయి వాడికి. ఓ ఇరవై అడుగులు వేసాక ఏదో అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసేడు. చిట్టిచిట్టి అడుగుల్తో పాప వాడిని అనుసరిస్తోంది. గబగబా వెనక్కెళ్లి పాపముందు మోకాళ్ల మీద కూర్చుని “ఓయ్‌, ఏటిలాగొచ్చేత్తన్నావ్‌, ముందుకెల్లీ కొద్ది సిమ్మ సీకటి. జడుసుకుంటావు టేషన్లోకెల్లిపో మేష్టరుగారు మీ యమ్మకీ నాన్నకీ అప్పగించేత్తారు, ఎల్లెల్లు” అన్నాడు. పాపకేం అర్థమైందో తెలీదుకాని, నవ్వింది. రెండు చేతులూ వాడి భుజాలమీద వేసి ఎత్తుకోమన్నట్టు చూసింది.

ఆ స్పర్శకీ, ఆ చూపుకీ బాలిగాడి మనసు మారుమూలల్లో ఏదో కదిలింది. ఒక్క ఉదుటున పాపాయిని పైకిలేపి ఎత్తుకున్నాడు. పాప వాడి మెడచుట్టూ చేతులు వేసి, విశ్రాంతిగా వాడి భుజం మీద తల వాల్చింది. చంటిపిల్ల స్పర్శ అంత హాయిగా ఉంటుందని వాడికా క్షణం వరకూ తెలీదు. ఈ పిల్లని పెంచుకుంటేనో అన్పించిందో క్షణం.

వాడికి మతిపోయింది. తన దగ్గర ఈ పిల్లని చూసిన వాళ్లెవరికైనా అనుమానం వెంటనే వస్తుంది. పోయి పోయి జైల్లో కూచోవాలి. నడుస్తూనే ఆలోచిస్తున్నాడు పిల్లనెలా వదుల్చుకోవాలా అని. వాడి ఆలోచన తెలిసిన దాన్లా పాపాయి చేతులు మరింత బిగించింది.

“పిల్లల్ని కొనుక్కునీ వోళ్లుంటారంట, ఆళ్లెక్కడుంటారో తెలిత్తే బాగుణ్ణు, వందో ఎయ్యో డబ్బులు కల్లజూద్దును” అనుకున్నాడు. “ఎయ్యిరూపాయలంటే ఒక గోనిసంచి నిండిపోవచ్చు” అనికూడా అనుకున్నాడు. ఆ మాత్రం ఊహకే వాడికి గిలిగింత అన్పించింది. ఎంత ఆలోచించినా వాడి ఊహకి అందలేదు పిల్లల్ని కొనుక్కునే వాళ్లెక్కడుంటారో!

ఇలాంటి ఇషయాలన్నీకల్లుపాక రావులమ్మకి బాగా తెలుస్తాయ్‌. కాని, ఈ వేళప్పుడెళ్తే అక్కడందరూ తాగుబోతెదవలుంటారు. తనకీ రావులమ్మకీ తప్ప మూడో కంటికి తెలియకుండా ఎవ్వారం ముగిసిపోవాల. అప్పటి కప్పుడొక నిర్ణయానికి వచ్చాడు.

పట్టాల వెంబడే కొంతదూరం నడిచి కుడిపక్కడొంకలోకి తిరిగితే దూరంగా పడిపోయిన పాత కొంపొకటుంది. ఈ రాత్రి కందులో తలదాచుకుని పొద్దున్నే రావులమ్మని కలవానుకున్నాడు.

పాపాయి నిద్రపోయిన గుర్తుగా వాడి భుజం మీద తల వాల్చేసింది. అలవాటు లేని వ్యవహారం, చంటి పిల్లనెత్తుకుని నడవడం కష్టంగా ఉంది. చెయ్య, నడ్డి కూడా నొప్పెడుతున్నాయ్‌, పాడుపడ్డ సత్రం ముందుకి చేరేసరికి ఆయాసం వచ్చింది బాలిగాడికి.

తలెత్తి ఆ ఇంటిని చూసేసరికి భయం వేసింది. పగలు చాలా సార్లే అక్కడికి వచ్చాడు. కూలిన గోడల మధ్య లేచిన పిచ్చిమొక్కలతో, గీపెడుతున్న కీచురాళ్ళతో చీకట్లో ఆ ఇల్లు జుట్టు విరబోసుకున్న పిచ్చిదాన్లా ఉంది. ముందు గది తప్ప ఇల్లంతా కూలిపోయింది.

అలవాటు ప్రకారం వాకిలి మెట్లెక్కి ముందు గదిలోకి చేరుకున్నాడు తడువుకుంటూ. పాపని నేలమీద పడుకోబెట్టి జోలెలోంచి కొవ్వొత్తి ముక్కవెతికి తీసి నేలమీద పెట్టాడు. జేబుతడువుకని బీడీముక్క తసి నోట్లో పెట్టుకున్నాడు. అగ్గిపుల్ల గీసి ముందు దీపం వెలిగించి, ఆ పుల్లతోనే బీడీ ముట్టించుకున్నాడు. నేలమీద చతికిలబడి గుండెలనిండా రెండు దమ్ముల పొగపీల్చుకున్నాక గాని వాడికి దడ తగ్గలేదు. ఇదంతా కల కాదనడానికి నిదర్శనంగా నేలమీద పడి నిద్రపోతూన్న పాపాయి ఉంది. జేబుమీద చెయ్యివేసుకున్నప్పుడల్లా చేతికి తగిలి పులకెత్తిస్తున్న నగలు ఉన్నాయి.

గాలికి దీపం రెపరెపలాడింది. చెయ్య అడ్డం పెట్టాడు. పగలంతా అక్కడెవరో పేకాడినట్టుంది. కాల్చిపారేసిన సిగరెట్టు పీకలు, బీడీలు, తాగిపడేసిన సారాయి పేకెట్లు గలీజుగా ఉంది. అలవాటు ప్రకారం వాడి చెయ్య సిగరెట్టు పీకలు, బీడీపీకలు ఏరి జోలెలో పడేసుకుంటోంది.

పాపాయి నిద్రలో అట్నుంచిటు కదిలింది. బాలిగాడి దృష్టి పాపాయి ముకం మీద పడింది. పాలబుగ్గల మీద దీపం వెలుగుపడి మెరుస్తోంది. పున్నమినాటి చందమామ తలపుకొచ్చింది వాడికి. నిద్రలోనే కుడిచేతి బొటనవేలిని నోట్లో పెట్టుకొని మూతిని సున్నాలా చుట్టి జుముకుతోంది. ఆ వేలి నించి పాలొస్తున్నంత తృప్తిగా గుటకలు వేస్తోంది.

రెప్ప వాల్చకుండా కొంత సేపు అలా చూస్తూ ఉండిపోయాడు వాడు. ఏదో ఆప్యాయత ముంచుకు రాగా పాపాయి చెంపకు అంటుకున్న ధూళిని చేత్తో నెమ్మదిగా తుడిచేడు. అలా తుడిచేముందు చేతిని చొక్కాకి రాసి రాసి తుడుచుకొన్నాడు. బంగారం లాంటి ఈ పిల్లని కొనుక్కున్నోళ్లు కన్నోకాలో తీసేసి అడుక్కోడానికి సిద్ధం చేస్తారు కాబోలు… వెన్నులోంచి చలిపుట్టింది వాడికి. “అమ్మా…” అంది పాపాయి నిద్రలో వేలు తియ్యకుండానే.

ఒళ్లు మండిపోయింది బాలిగాడికి. అసలా “అమ్మ” అనే మాటంటేనే అసహ్యం వాడికి. ఇంతందమైన పాపాయిని స్టేషన్లో వదిలేసి రైలెక్కిపోయిన ఆ తల్లికి అమ్మ మనసుండి ఉండదని వాడి ఉద్దేశం. తన తల్లి మాత్రం… ఎక్కడో కనేసి, మరెక్కడో పడేసి పోయింది. ఆ మహాతల్లి అలా వదిలేసి పోయేసరికి బహుశా తనింత ఉండి ఉంటాడేమో. “అసలు ఆడజాతే నమ్మరాని జాతి” అంటాడు ఈరిగాడు. ఆ మాట నిజం.

హఠాత్తుగా లేచి పాప ఏడుపుకి లంకించుకుంది. అటూ ఇటూ దొర్లుతూ కాళ్లు తన్నుకుంటోంది. పరికించి చూస్తే నేలమీదంతా చీమల బారులు, అతృతగా పాపాయిని ఒళ్లోకి తీసుకున్నాడు. గుక్కపట్టి ఏడుస్తోంది పాపాయి. ఏం చెయ్యాలో అర్థం కాలేదు వాడికి. హఠాత్తుగా గుర్తుకొచ్చింది సాయంకాలం నుంచి ఏం తినలేదని.

“ఎలాగిప్పుడు? వచ్చేటప్పుడు ఒక బన్నైనా కొనుక్కొచ్చేను కాదు ఎర్రెదవని” అని తనని తనే తిట్టుకున్నాడు.

బన్ను అనుకోగానే గుర్తుకొచ్చింది వారం క్రితం ఒకసారి బన్నుకొనుక్కుని పూర్తిగా తినకుండానే సంచిలో పడేసుకున్న విషయం. గుడ్డలమూట అడుగున దొరికింది. ఎండిపోయిన రొట్టెముక్కని ఉండలా చేసి పాపాయి నోట్లో కొంచెం వేసాడు. పాపాయి ఏడుపు ఆపింది. ఆకల్తో ఉందేమో వాడువేసే ఉండని చప్పరించి మింగుతోంది. అలా నాలుగైదుసార్లు మింగేసరికి ఎక్కిళ్లు మొదలయ్యాయి. మూలనున్న కుండలోంచి ప్లాస్టిక్‌ డొక్కుతో నీళ్లు ముంచి పాపాయికి తాగించాడు బాలిగాడు. కొంచెం సేపు ఏడుపు ఆపి, గుడ్డిదీపం వెలుతుర్లో బాలిగాడి ముఖాన్నీ, పరిసరాల్నీ పరికించి చూసి మళ్లీ ఏడుపు మొదలు పెట్టింది.

ఆ నిశీధిలో పాప ఏడుపు ప్రతిధ్వనిస్తోంది. రాత్రి గడిచిపోతోంది. బాలిగాడికి నిద్రముంచుకొస్తోంది. జేబులో ఉన్న సొమ్ములూ, పాపాయి ఏడుపూ వాడి కంటికి నిద్రని దూరం చేస్తున్నాయి.

ఆగి ఆగి పాపకి నీళ్లు మాత్రం పడుతున్నాడు.

ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి నిద్రపోయింది పాప.

తెల్లవారు ఝామునెప్పుడో వాడికి తెలీకుండానే నిద్రలోకి జారుకున్నాడు బాలిగాడు.

పడిపోయిన గోడల మీదగా సూర్యుడు తన కిరణాల కళ్లతో తీక్షణంగా బాలిగాడిని చూస్తున్నాడు. ఒళ్లంతా చిటపటలాడినట్టై బాలిగాడికి మెలకువ వచ్చేసింది. అలవాటు ప్రకారం రైలుబళ్ల కూతలూ, టీ-కాఫీల కేకలూ వినపడక పోవడంతో ఒక్క నిముషం ఎక్కుడున్నాడో అర్థం కాలేదు వాడికి. నిద్రలో దూరంగా దొర్లుకుంటూ పోయిన పాపాయిని చూడగానే వాడికి జరిగినదంతా గుర్తుకొచ్చింది. అప్రయత్నంగా వాడి చెయ్యి జేబులోని నగలమీదికి పోయింది. లేచి బైటికొచ్చి చూసాడు.

పరిసరాల్లో ఎక్కాడా అలికిడి లేదు. “ఇంకా నయ్యం, ఏ దేవుడో మేలుసేసి మెలుకువొచ్చేసినాది. ఇంకాసేపుంటే పేకాట మూకంతా వచ్చి పడిపోదూ” అనుకున్నాడు.

రాత్రి వాడి బుర్రలో మెదిలిన ఆలోచనా, అనుకోకుండా ఆ పిల్లమీద జాలిలాంటిదేదో కలగడం గుర్తుకొచ్చింది. రెండిట్లో ఏది మంచిదో బేరీజు వేసుకున్నాడోక్షణం. మొదటిదే లాభసాటి వ్యవహారం అన్పించింది. పిల్ల ఒంటి మీద నగలే కాక, తిరిగి ఎంతో కొంత సైతం దొరుకుతుంది. రెండో ఆలోచన ప్రకారం అనవసరంగా జాలికిపోయి పిల్లని తీసుకెళ్లి స్టేషన్లో అప్పగిస్తే రెంటికీ చెడ్డ రేవడవుతాడు తను. రాత్రి నించీ పిల్లనెక్కడ దాచేవని తిరిగి తంతారు కూడా.

జాలిలాంటిదేదీ తనలో కలక్కుండా ఉండడం కోసమని ఆ పిల్ల ముఖం వైపు చూడకూడదని నిశ్చయించుకుంటూండగానే వాడిమాట వినకుండా వాడి దృష్టి పాపాయి మీదికి పోయింది. రాత్రి చీమలు పాకి ఏడుస్తూందని ఒంటిమీది బట్టలు విప్పేయడంతో ఆ ఉదయపు నీరెండలో పాలరాతి బొమ్మలా మెరుస్తోంది పాపాయి. ఒక చెయ్యి చెంప కింద పెట్టుకుని ఒత్తిగిలి పడుకుని ఉంది. నోట్లో పెట్టుకున్న రెండో చేతివేలు ఎప్పుడు జారిపోయిందో కానీ, కొంచెంగా తెరుచుకున్న పెదవుల మధ్య నాలుకని అర్థ చంద్రాకారంగా చేసి ఆగి ఆగి పాలు తాగుతున్న అనుభూతిని పొందుతోంది.

పాయిని అలాగే లేపి నిద్రాభంగం కలగకుండా భుజం మీద వేసుకున్నాడు. జోలెలోంచి పాతగుడ్డ ఒకటి తీసి పాపాయి మీద పూర్తిగా కప్పేడు. ఊళ్లోంచి వెళ్తే మంచిదికాదని పొలాలకడ్డంపడి ఊరికి ఆ చివరనున్న రావులమ్మ కల్లుపాక వైపు నడిచేడు. కోళ్ల గూడు మీద కూర్చుని పళ్లుతోముకుంటున్న రావులమ్మ అంత పొద్దున్నే వచ్చిన బాలిగాణ్ని చూసి “ఏరా బాలిగా! పొద్దున్నే సుక్కేసుకోవడం కాడికొచ్చిందేటి నీ పని” అని పలకరించింది.

సమాధానమేం చెప్పకుండా బాలిగాడు భుజం మీంచి దించి బల్ల మీద పడుకో బెడుతున్న పాపాయిని చూస్తూ “ఓరి నీ జిమ్మడి పోనూ, ఈ పిల్లనెక్కన్నుంచెత్తుకొచ్చేవురా?” అని అరిచింది.

“నీకు దణ్ణవెడతాను, అరవకండీ రావులమ్మగోరూ” బతిమాలుతున్న ధోరణిలో అన్నాడు బాలిగాడు. “ఈ పిల్ల నాకు దొరికింది. ఎవరో కూటికి లేనోళ్లు పెంచలేక ఒదిలేసుంటారు” అతికినట్టు అబద్దమాడేననుకున్నాడు.

“నోరుముయ్‌ ఎదవా! కూటికి లేనోళ్లు కుర్రదానికి బంగారం జుమికీలు కుట్టించేరేంట్రా…” అంది రావులమ్మ పాపాయి చెవులు పరికిస్తూ. “ఇంతకీ ఈ పిల్లనిక్కడికెందుకు తీసుకొచ్చా?”

“ఎవరైనా కొనుక్కునే వోల్లుంటే అమ్మేద్దామనీ…”నసిగేడు బాలిగాడు. ఓ క్షణం పాపాయిని తదేకంగా చూసింది రావులమ్మ. నోట్టోని పందం పుల్లని విసిరేసి, కాసిన్ని నీళ్లు పుక్కిలించి వచ్చింది.

“ఎవరో ఎందుకు, నేను పెంచుకుంటాను, బంగారం బొమ్మలాగున్నది పిల్ల” అంది. అంటూనే బొడ్లోంచి చిన్నపాటి సంచొకటి తీసి, దాన్లోంచి అయిదు పదులు తీసి వాడి చేతిలో పెట్టింది. వాడింకా నాన్చడం చూసి “ఏంట్రా, ఎదవా, సెప్పేడు” అంది. “బొత్తిగా ఏబై ఇచ్చేరు, సెవులికి బంగారం పోగులున్నాయి గదా…”

“ఉంటే? అయ్యేమన్నా నీ బొడ్డుకాడి సొమ్మేంట్రా” గదమాయించింది రావులమ్మ.

“సర్లే ఈ యాబై కూడా ఏడు” మరో యాభై ఇచ్చింది. పాప తాలూకు పట్టుగౌను తీసి రావులమ్మకిచ్చేడు బాలిగాడు. రావులమ్మ కళ్లు మెరిసాయి.

“ఇంత మంచి గుడ్డలేసేరంటే ఈ పిల్ల తప్పకుండా ఉన్నోళ్ల పిల్లేరా బాలిగా” అంది.

“కాసింత కల్లుసుక్క…” అని కొసిరేడు బాలిగాడు.

“పొద్దున్నే ఇంకా బోణీ అవలేదు. సాయంత్రం పోత్తాన్లేరా” అంది రావులమ్మ. ఓ క్షణం వాడి మనసు ఊగిసలాడింది రావులమ్మ ఇచ్చిన పైకంలోంచిఓ పదిరూపాయలు మార్చేసి కల్లు తాగేద్దావని కాని, ఎందుకో వాడికి ప్రాణం ఒప్పలేదు. డబ్బులన్నీ పదిలంగా మూటకట్టి జోలెలో పాత గుడ్డల అడుగున దాచేసాడు. ఇప్పట్లో పిల్లని ఎవరికంటా పడనియ్యొద్దని రావులమ్మకి ఓ హెచ్చరిక చేసేడు. రావులమ్మ పాకనుంచి వస్తూ దార్లో నగల్ని కూడా పాత గుడ్డలో చుట్టి అడుగున పెట్టేసాడు. అప్పుడు వెలిగింది వాడికి బుర్రలో “పిల్ల తాలూకు వాళ్లెలాగూ వెనక్కి వచ్చి వెతుకుతూ ఉంటారు. ఎప్పడూ స్టేషన్లో పడిఉండే తను అక్కడ కనబడకపోయేసరికి అందరి అనుమానం తన మీదకి తిరుగుతుందని. ఇంకేం ఆలోచించకుండా నగలూ, డబ్బూ కాలి కట్లలో పెట్టి కట్టేసి, కుంటుకుంటూ రైల్వేస్టేషనుకి నడిచేడు.

బాలిగాడు వెళ్లేసరికి స్టేషనంతా సందడిగా ఉంది. అసలంత పొద్దున్నే బళ్లేం లేవు. అటైంలో స్టేషను నిద్రపోతున్నట్టుంటుంది. అలాంటిదీరోజు… బాలిగాడికి అర్దమైపోయింది.

స్టేషనంతా హడావిడిగా తిరుగుతున్న పోలీసుల్ని చూడగానే వాడిగుండె జారిపోయింది. తెలీకుండా ఒళ్లంతా చెమటలు పట్టేసింది. డబ్బాని ఘల్లుఘల్లుమనిపించడం మర్చిపోయి గుటకలు మింగుతూ నిలబడిపోయేడు. పోలీసులు ఈరిగాణ్నీ ఇంకా స్టేషన్లో పడుకునే మరో నలుగురైదుగురు అడుక్కునే వాళ్లనీ వరసగా నుంచోబెట్టి ఏవేంటో అడుగుతున్నారు.

“ఓరి ఎర్రెదవా, నీకసలు బుర్రుందా?” అని తనని తనే తిట్టుకున్నాడు బాలిగాడు.

“ఒచ్చొచ్చి పోలీసోల్ల సేతుల్లో పడ్డావు గదరా” ఎవరి కంట్లో పడకముందే నెమ్మదిగా వెనక్కి తిరిగిపోవాలనుకుంటూండగా “అల్లడుగోనండి, బాలిగాడొచ్చీసినాడు” అన్నాడొక బిచ్చగాడు పోలీసుల్తో. “ఇట్రారా బాలిగా, ఇటూ.. ఇటూ… అయ్యగారేంటో అడుగుతారంట” ఓ పొలికేక పెట్టేడు. “కొంపదీసి పిల్లని తను తీసుకెల్లడం ఈళ్లెవరూ సూళ్లేదుగదా” తనని తాను తమాయించుకుంటూ బాలిగాడు అటు నడిచేడు.

ఆచోటు సరిగ్గా వెయిటింగు రూముకి ఎదురుగా ఉంది. అప్పటి వరకూ అందర్నీ అడిగిన ప్రశ్నలే బాలిగాణ్నీ వెయ్యడం మొదలు పెట్టేరు పోలీసులు.

“నిన్న సాయంకాలం బండెళ్లిపోయేక ఒక చిన్నపాపని చూసేవా? ఆ టైంలో ఎక్కడున్నావు? రాత్రంతా ఎక్కడున్నావు?” అంటూ “లేదు, కాదు” అనే రీతిలో సమాధానాలు చెప్తున్న బాలిగాడి చూపులు మాత్రం వెయిటింగ్‌రూం గుమ్మం మీద అతుక్కుపోయేయి.

అక్కడ కుర్చీలో పాతికేళ్లలోపు ఒకావిడ కూర్చునుంది. అచ్చుగుద్దినట్టున్న పోలికల్నిబట్టి ఆవిడే పాప తల్లి అని అర్ధమైపోయింది వాడికి. ఎప్పట్నుంచి ఏడుస్తుందో కాని కంటికీ మంటికీ ఏకధార అన్నట్టుంది. ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయి చిన్నవైపోయేయి. రాత్రంతా నిద్రలేనందునా, అదే పనిగా ఏడుస్తున్నందునా కళ్లు ఎర్రగా అగ్నిపూలల్లా ఉన్నాయి. జుట్టురేగిపోయి, బొట్టు చెరిగిపోయి పిచ్చిదాన్లా ఉంది. నిన్న ప్రయాణం కోసం కట్టుకున్న జానెడు వెడల్పు ఝరీచీర నలిగిపోయి కన్నీటితో తడిసిపోయింది. పక్కనే నిలబడిన సూటు బూటులోని ఆ వ్యక్తి పాప తండ్రికాబోలు. భుజం మీద తడుతూ భార్యని ఓదారుస్తున్నాడు.

వాళ్లిదర్నీ వెంటనే గుర్తుపట్టేడు బాలిగాడు. నిన్న సాయంత్రం స్టేషన్లో బండికోసం ఎదురుచూస్తూ కుర్చున్న వాళ్లదగ్గరకెళ్లి డబ్బా గలగలలాడించేడు. వాడి కాలికున్న కట్టునీ, దాని మీది ఎర్రమరకల్నీ అసహ్యంగా చూస్తూ ఒళ్లో నిద్రపోతున్న పాపాయిని గట్టిగా హత్తుకుని “పో…పో…” అంది. అతను ఇంగ్లీషులో ఆవిడతో ఏదో అని “దున్నపోతులా ఉన్నావ్‌, పనిచేసుకుని బతకలేవు?” అని కసిరేడు.

బాలిగాడికి ఒళ్లు మండిపోయి వాళ్ల చుట్టూ పేర్చుకున్న బండెడు సామాన్లూ, సూట్‌కేసుల్లోంచి ఒకటి చెక్కేద్దామా అన్పించేసింది. పొయ్యి మీద గంజిపెట్టి రాబట్టి కాని, అంతపనీ చేసేవాడే.

ఇప్పడు వాళ్లిదర్నీ ఆ స్థితిలో చూస్తూంటే వాడికి చాలా తృప్తికలిగింది.

“ఇవతల నేను అడుగుతుంటే పరధ్యానంగా దిక్కులు చూస్తావేట్రా కుంటెదవా” అని లాఠీతో ఒక్కటిచ్చాడు యస్సై. వాడి భుజానికున్న జోలెను లాక్కుని కింద దిమ్మరించి లాఠీతో కెలికి చూసాడో కానిస్టేబుల్‌. ఆధారాలేం దొరకలేదని అందరితోబాటు వాణ్ణీ వదిలేసారు. స్టేషన్లోంచి మాత్రం ఎవర్నీ బైటికి పోవద్దని ఆర్డర్‌ వేసారు.

డబ్బా గలగల్లాడిస్తూ రోజంతా అక్కడే తిరుగుతున్న బాలిగాడి కళ్లు మాత్రం పాప తల్లిని వదిలి రావడం లేదు.

ఆ దుఃఖస్థితిలో ఆవిడ అమ్మకి పర్యాయపదంలా ఉంది.

ఆ మధ్యాహ్నం, సాయంత్రంకూడా ఆవిడ తిండీ, నీరు ముట్టలేదు. ఆ ఏడుపుకి ఇక అంతంటూ ఉండదేమో అన్పించింది వాడికి. ఇంటికి పోదాం రమ్మని బతిమాలుతున్నాడు భర్త. అక్కణ్నుంచి కదలనని ఆవిడ హఠం పట్టింది.

వరుసగా రెండు మూడు బళ్లు రావడంతో ఏదో ట్రెయిన్‌లో ఎవరో తీసుకుపోయుంటారు. పాప అమ్మకోసం ఏడవడం భరించలేక తిరిగి ఇక్కడికే తీసుకొచ్చి వదిలేస్తారని ఆవిడ ఊహ. ఎంత విలువైనవైనా వెధవ సామాన్లు బండిలోకి ఎక్కిస్తూ ఇద్దరూ పాపనెలా మరచిపోయారో ఆమెకి అర్ధం కావడం లేదు. బండి కదిలిన చాలా సేపటికి గాని విషయం అంతుపట్టలేదు. గొలుసులాగి బండిని ఆపి, కంపార్ట్‌మెంట్సన్నీ వెతికి, నిరాశ చెంది టాక్సీలో వెనక్కి వచ్చారు. రాత్రినుంచి పోలీసులు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

సాయంకాలమైంది. ఒక్కసారిగా ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. స్టేషన్లోకి దూసుకొస్తున్న బండికి ఎదురుగా పాప తల్లిపరుగెత్తింది. సమయానికి ఆవిడ భర్తపట్టుకోబట్టికాని చక్రాలకింద ఆవిడ దేహం నుగ్గునుగ్గయ్యేదే.

రోజంతా ఆవిడని గమనిస్తూనే ఉండిపోయిన బాలిగాడికి అమ్మంటే ఏంటో అర్ధమైంది. పాపని పొగొట్టుకుని ఈవిడ ఎంత కుమిలిపోతూందో, తనని పోగొట్టుకుని తన తల్లి కూడా ఇంతగానూ కుమిలిపోయుంటుందని అనుకుంటే వాడికెంతో తృప్తి అనిపించింది.

పాప తల్లిలో తన తల్లిని చూస్తున్నాడు బాలిగాడు. ఇంతకాలం ద్వేషించిన “అమ్మ” అనే పదం ఇప్పుడు చాలా మధురంగా అన్పిస్తోంది వాడికి.

తిరుగు ప్రయాణానికి పాప తండ్రి మాట్లాడిన టాక్సీ స్టేషన్‌ బైట ఆగి ఉంది. భార్యకు ఇంకా నచ్చచెప్పుతూనే ఉన్నాడతను.

పట్టాల కవతల వెయిటింగ్‌రూం కెదురుగా తలకింద జోలెతో పడుకున్న బాలిగాడు ఒక నిర్ణయానికొచ్చి లేచి నిల్చున్నాడు.

పోలీసుల కళ్లుకప్పి పొలాల కడ్డంపడి రావులమ్మ కల్లుపాకకి చేరుకున్నాడు. అప్పడే దుకాణం మూసేసి అన్నీ సర్దేస్తున్న రావులమ్మ “వచ్చేవురా బాలిగా, నువ్వటెళ్లగానే పిల్ల లేచి అమ్మ అమ్మా అని ఒకటే ఏడుపు. పాలన్నీ తాగలేదనుకో. ఇవతల కొట్టునీ, అవతల పిల్లనీ సందరించుకోలేక నల్లమందు పిసరంత మింగించి నిద్రపుచ్చీసేను. లేకపోతే అందరూ “పిల్లెవరూ” అని అడుగుతారుగందా…దా… నీకు కల్లుసుక్కపోత్తాను” అంటోంది.

ఆసరికప్పుడే బాలిగాడు పాపాయిని భుజం మీదేసుకుని బైటికొస్తున్నాడు. పది పది రూపాయల నోట్లనీ రావులమ్మమీదికి విసిరేసి పరుగులంకించుకున్నాడు. నిర్ఘాంతపోయిన రావులమ్మ చెంపన చెయ్యేసుకుని నిలబడిపోయింది. చీకట్లో పొలం గట్టుమీద నుంచి రోడ్డెక్కబోయి కాలుజారి దబ్బున బోర్లాపడిపోయాడు బాలిగాడు. అసంకల్పితంగా వాడు “అమ్మా” అన్నాడు. పడ్డంలో పాపాయికి దెబ్బతగలకుండా కాచుకున్నాడు.

ఆ అదురుకి పాపాయిలేచి ఏడుపు మొదలుపెట్టింది. కట్టుకట్టుకున్న పాదంలో ఎక్కడో కలుక్కుమంది. కాలుపైకి లేవడం కష్టమైంది. “ఏడవకమ్మా… నా తల్లిగదూ… మా అమ్మగదూ…” అంటున్నాడు బాలిగాడు కలవరిస్తున్నట్టు. వాడి కళ్లల్లో బిడ్డకోసం చావుకి సిద్ధపడిన, జీవచ్చవంలా మారిన తల్లి రూపం కదులుతోంది. తల్లి ప్రేమకి ఈ బిడ్డ దూరం కాకూడదు. తల్లి ప్రేమను కోల్పోయిన బతుకెలాంటిదో తనకి తెలుసు.

దూరంగా స్టేషన్‌గేట్లోంచి టాక్సీ ఒకటి బైటికొస్తోంది. పాపాయిని రోడ్డుమీదికి నెట్టి, బాలిగాడు విరిగిన కాలుని ఈడ్చుకుంటూ రోడ్డుకింది తూములోకి పాకిపోయేడు. వాడిచెవులూ, మనసూ రోడ్డుమీదే కేంద్రీకృతమయ్యేయి. ఆ నిశ్శబ్దంలో పాప ఏడుపు సన్నగా విన్పిస్తోంది.

టాక్సీ స్లో అయ్యి, క్రమంగా ఆగింది. తలుపు తీసిన చప్పుడైంది.

“పాపా” అంటూ అరిచి తల్లి పాపని కౌగిట చేర్చుకుని ఉంటుందని బాలిగాడు ఊహించుకుంటున్నాడు. ఆ తల్లిముఖంలో బిడ్డనిచూసిన ఆనందాన్ని చూడాలనుకున్నాడు. అది తనకి సాధ్యం కాదని వాడికి తెలుసు. ఈ సరికి బహుశా పాపని అక్కున చేర్చుకుని ఆ తల్లి ముద్దులు కురిపిస్తూ ఆనందబాష్పాల్తో ముంచెత్తుతూ ఉంటుంది. ఇరవై ఏళ్లు వెనక్కిపోయి తన తల్లి సందిట తననలా ఊహించుకున్న బాలిగాడి కళ్లవెంట ఊహ తెలిసాక మొదటిసారిగా రెండు కన్నీటి చుక్కలు జారిపడి పెదవుల్ని ఉప్పగాచేసాయి.

కొంతసేపు నిశ్శబ్దం తరువాత కారు బయలుదేరింది. కారు దూరంగా వెళ్లిపోయి ఉంటుందని నిర్దారించుకున్నాక అతి ప్రయాసతో పాక్కుంటూ రోడ్డుమీదికి వచ్చేడు బాలిగాడు. గంట తర్వాత అటుగా వెళ్తున్న రిక్షా వాడొకడు బాలిగాణ్ని ఎక్కించుకుని స్టేషన్లో వదిలేసాడు.

ఒక పెద్ద బరువు దిగిపోయిన భావంతో బాలిగాడు దీపస్తంభాని కానుకుని కూర్చుని కాలు నిజంగా విరిగిందా, నొప్పిపట్టిందా అని చూసుకోవాలనుకున్నాడు.

అంతలో వెక్కిళ్లు వినిపించి ఆ ప్రయత్నంగా తలెత్తి వెయిటింగ్‌రూం గుమ్మంవైపు చూసేడు.

అక్కడ కుర్చీలో జీవచ్చవంలా పాప తల్లి. ఆ పక్కనే పాప తండ్రి… పాపని రోడ్డు మీదికి నెడుతూ పాపకి వేసిన నగలు గుర్తుకొచ్చాయి బాలిగాడికి.

*

First Published:  4 Sept 2015 7:13 AM IST
Next Story