Telugu Global
Family

అహం (For Children)

చైనాని పాలించిన టుంగ్‌ వంశీయుల కాలంలో వాళ్లదగ్గర ఒక ప్రధాన మంత్రి ఉండేవాడు. అతను గొప్ప రాజనీతిజ్ఞుడు. దేశవిదేశ వ్యవహారాల్లో రాజుకు ఎంతో సహాయం చేసేవాడు.  దేశాన్ని అల్లకల్లోలాలకు గురికాకుండా చూసేవాడు.  సైనిక విషయాల్లోనూ ఎంతో నైపుణ్యం ప్రదర్శించేవాడు. ఆ ప్రధాన మంత్రికి ఎంతోగొప్పపేరు ఉంది. అందరూ ఆయన్ని గౌరవించే వాళ్ళు. పేరు ప్రఖ్యాతులు,గౌరవ మర్యాదలు, ఐశ్యర్యం,అధికారం అన్నీ ఉన్నా ఆయనకు బుద్ధునిపట్ల భక్తి. బుద్ధుని ధర్మాలను తూచా తప్పకుండా ఆచరించేవాడు.  ఆప్రాంతంలో పేరుపొందిన బౌద్ధ గురువు […]

చైనాని పాలించిన టుంగ్‌ వంశీయుల కాలంలో వాళ్లదగ్గర ఒక ప్రధాన మంత్రి ఉండేవాడు. అతను గొప్ప రాజనీతిజ్ఞుడు. దేశవిదేశ వ్యవహారాల్లో రాజుకు ఎంతో సహాయం చేసేవాడు. దేశాన్ని అల్లకల్లోలాలకు గురికాకుండా చూసేవాడు. సైనిక విషయాల్లోనూ ఎంతో నైపుణ్యం ప్రదర్శించేవాడు. ఆ ప్రధాన మంత్రికి ఎంతోగొప్పపేరు ఉంది. అందరూ ఆయన్ని గౌరవించే వాళ్ళు. పేరు ప్రఖ్యాతులు,గౌరవ మర్యాదలు, ఐశ్యర్యం,అధికారం అన్నీ ఉన్నా ఆయనకు బుద్ధునిపట్ల భక్తి. బుద్ధుని ధర్మాలను తూచా తప్పకుండా ఆచరించేవాడు. ఆప్రాంతంలో పేరుపొందిన బౌద్ధ గురువు ఉండేవాడు. ఆ బౌద్ధ గురువు బుద్ధుడి బోధనల్ని అకుంఠిత దీక్షతో ఆచరించేవాడు. అతను బుద్ధుని బోధనల సారాంశం తెలిసినవాడు. దేశవిదేశాల నుంచి ఆయన దగ్గరకు ఎందరో శిష్యరికం కోసం వచ్చే వాళ్లు. దేశ ప్రధానమంత్రి కూడా ఆయన శిష్యుడే. ఒకరోజు గురువుగారిని దర్శించడానికి ప్రధాన మంత్రి ఆశ్రమానికి వచ్చాడు. గురువుగారికి నమస్కరించాడు. పరామర్శలు అయ్యేకా ఇద్దరూ ధర్మ చర్చల్లో దిగారు. ఎన్నో విషయాలు ప్రధాన మంత్రి అడిగాడు. గురువు వాటన్నిటికీ సమాధానం చెప్పాడు. ప్రధాన మంత్రి ఎంతో ఆనందించాడు. ఇక తను బయల్దేరాల్సిన సమయం వచ్చింది. ప్రధాన మంత్రి ”గురువుగారూ! ఈ రోజు ఎంతో హాయిగా గడిచింది. నాలో కలిగిన ఎన్నో సందేహాలకు మీరు సమాధానాలిచ్చారు. సంతృప్తి కలిగించారు. చివరిగా ఒక ప్రశ్న. దానికి మీరు సరైన సమాధానమిస్తే ఈరోజు సంపూర్ణమయిందని నేను భావిస్తాను” అన్నాడు.

గురువు ”దాందేముంది అడగండి” అన్నాడు. ప్రధానమంత్రి ”అహం అంటే ఏమిటి?” అన్నాడు. ఆ మాటలతో గురువుగారి ముఖం ఎర్రబడింది. నిర్లక్ష్యంగా ప్రధానమంత్రి వేపు చూశాడు. గురువుగారి ముఖంలో రంగులు మారడం చూసి ప్రధాన మంత్రి ఆశ్చర్యపోయాడు. గురువు ప్రధాన మంత్రి కళ్లలోకి చూసి ”ఎంత తెలివి తక్కువ ప్రశ్న వేసావు?” అన్నాడు. ఆ సమాధానంతో ప్రధాన మంత్రి షాక్‌ తీన్నాడు. ఊహించని ఆ సమాధానంతో ప్రధానమంత్రి ఉలిక్కిపడ్డాడు. గురువునుంచీ అతను అట్లాంటి సమాధానాన్ని ఊహించలేదు. అప్పటి దాకా మరచిపోయిన తన అధికారం, స్థాయి అన్నీ అతనికి గుర్తుకొచ్చాయి. అతన్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన ఎదుట ఉన్నది తన గురువన్న విషయాన్ని కూడా అతను మరచిపోయాడు. ఒరలో ఉన్న కత్తి దగ్గరకు అతనిచేయి కదిలింది. కళ్ళలో నిప్పులు కదిలాయి. అతని పరిస్థితి గమనించిన గురువు ” ప్రధానమంత్రిగారూ! దీన్నే అహం అంటారు” అన్నాడు. దాంతో ఒక్కసారిగా ప్రధానమంత్రి ఆవేశమంతా చల్లబడిపోయింది. హఠాత్తుగా అతని పెదాలపై చిరునవ్వు కదిలింది.

– సౌభాగ్య

First Published:  4 Sept 2015 10:31 AM IST
Next Story