చెప్పులకు నమస్కారం! (Devotional)
ఒక వ్యక్తికి జీవితంలో ఎన్నో సమస్యలున్నాయి. కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఎక్కడా వేటికీ పరిష్కారం కనుచూపు మేరలో కనిపించలేదు. ఎవరో పక్కఊళ్లో గొప్ప గురువులు బస చేశారని ఎందరో జీవిత సమస్యలకి ఆయన పరిష్కారమార్గాలు చూపారని నీకు కూడా ఆయన దారి చూపిస్తాడని వెళ్లి ఆయనను సందర్శించమని చెప్పారు. ఆరాటంలో ఉన్న వ్యక్తి ఆధారం కోసం చూస్తాడు. అట్లాగే ఆ వ్యక్తికి ఆ గురువును సందర్శిస్తే తనకు శాంతి దొరక్కపోతుందా? అని ఆశ […]
ఒక వ్యక్తికి జీవితంలో ఎన్నో సమస్యలున్నాయి. కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఎక్కడా వేటికీ పరిష్కారం కనుచూపు మేరలో కనిపించలేదు. ఎవరో పక్కఊళ్లో గొప్ప గురువులు బస చేశారని ఎందరో జీవిత సమస్యలకి ఆయన పరిష్కారమార్గాలు చూపారని నీకు కూడా ఆయన దారి చూపిస్తాడని వెళ్లి ఆయనను సందర్శించమని చెప్పారు. ఆరాటంలో ఉన్న వ్యక్తి ఆధారం కోసం చూస్తాడు. అట్లాగే ఆ వ్యక్తికి ఆ గురువును సందర్శిస్తే తనకు శాంతి దొరక్కపోతుందా? అని ఆశ కలిగింది. ఆ ఆలోచన వచ్చిన వెంటనే బయల్దేరాడు. అది మధ్యాహ్నం. పక్కవూరికి కాలి నడకన వెళ్ళినా అరగంటలో చేరుకోవచ్చు. కానీ అతనికి తక్షణం బయల్దేరాలనిపించింది. ఎండ తగ్గుముఖం పట్టాక వెళ్లవచ్చు. కానీ అతను అప్పటిదాకా ఆగలేకపోయాడు. అంత ఎండలోనే ప్రయాణమయ్యాడు. అరగంట ఎండలో నడిచేసరికి అతనికి చెమట పట్టింది. అలసట వచ్చింది. చిరాకు కలిగింది. అయినా తప్పదు. ఆ ఊరు చేరి, వాకబు చేసి స్వామివారు ఎక్కడున్నారో తెలుసుకున్నారు.
ఒక ఇంటి ముందు తలుపు కొద్దిగా తెరిచి ఉంది. లోపల గురువుగారు గోడకు చేరగిలబడి విశ్రాంతి తీసుకుంటున్నాడు. గురువును చూసిన మరుక్షణం ఈ వ్యక్తి ఎంత తొందరగా గురువు గారిని కలుద్దామా, ఎంత తొందరగా తన జీవిత సమస్యలకు పరిష్కారం అందుకుందామా అన్న హడావుడిలో కాళ్లకున్న చెప్పుల్ని మెల్లగా తీయకుండా కాళ్లను విదిలించాడు. వాటిని వదిలించుకోవాలన్న తొందర అతన్లో కనిపించింది. ఆ విదిలించుకోవడంలో చెప్పులు పైకి లేచి తలుపుకు తగిలి పక్కన పడ్డాయి. లోపల నుంచి గురువు ఆ వ్యక్తిని ఒక కంట గమనిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి హడావుడిగా లోపలికి వచ్చి గురువు కాళ్లమీద పడి నమస్కారం చేశాడు. గురువు కాళ్ళు ముడుచుకున్నాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు.
గురువు ” ముందు నువ్వు బయటకు వెళ్లు. నీ చెప్పులకూ క్షమాపణలు చెప్పిరా” అన్నాడు. ఆ మాటలకు ఆ వ్యక్తి గురువును చూసి ”ఏమంటున్నారు? నేను చెప్పులకు, తలుపుకు నమస్కరించాలా? ప్రాణం లేనివాటికి ప్రణామం చెయ్యాలా?” అన్నాడు. గురువు ”వాటిని విసిరి కొట్టినప్పుడు వాటికి ప్రాణం లేదని నువ్వనుకోలేదు. వాటిని శత్రువుల్లా చూసావు. అంత కోపమెందుకు మొదట వెళ్లి నీ అనుచిత చర్య గురించి, వాటికి క్షమాపణ చెప్పిరా! లేకుంటే ఇక్కణ్నుంచి వెళ్లిపో” అన్నాడు.
ఆ వ్యక్తిలో కొంత ఆవేశం తగ్గింది. బయటకు వెళ్లి ఆ చెప్పులకు, తలుపుకు నమస్కరించి ”నన్ను మన్నించండి. అలసిపోయి ఆగ్రహంలో మిమ్మల్ని తక్కువగా చూశాను. నిర్లక్ష్యంగా ప్రవర్తించాను” అని వాటికి క్షమాపణ చెప్పాడు. కొంత నెమ్మదించాడు. లోపలికి వచ్చాడు. గురువు అతన్ని ప్రేమగా చూసి, ఇప్పుడు శాంతించావు. రా కూర్చో. ప్రేమగా నువ్వు ఉంటే శాంతంతో ఉంటావు. శాంతంగా ఉంటే ఎవరేది చెప్పినా వింటావు. నీ శాంతిలోనే నీ సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి. మనుషుల్ని,చెట్లని, జంతువుల్ని , సమస్త ప్రకృతిని ప్రేమగా చూడు, అక్కడ నీకు శాంతి, సమన్వయం తప్ప ఏమీ కనిపించవు. ప్రేమ లేనప్పుడే సమస్యలుంటాయి. అహంకారముంటుంది. అహంకారముంటే ఆనందముండదు. అన్నీ సమస్యలుగానే ఉంటాయి. సమస్యలు సృష్టించేది నువ్వే. పరిష్కారాలు నీదగ్గరే ఉన్నాయి. నా దగ్గరికి రావడం ఒక నెపం మాత్రమే” అన్నాడు. తన సందేహాల్ని నివృత్తి చేసిన గురువుకి అతను కృతజ్ఞతగా నమస్కరించాడు.
– సౌభాగ్య