ఇలా చేయండి...ఏడేళ్ల జీవితకాలం పెంచుకోండి!
ఇప్పటికే నడక ప్రయోజనాలను తెలిపే సమాచారం మనకు ఎంతో అందుబాటులో ఉంది. ఈ అద్భుతమైన, సింపుల్ వ్యాయామం గురించి పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మరింతగా ఆశ్చర్యం గొలిపే సమాచారాన్ని అందిస్తూనే ఉన్నాయి. ఇటీవల లండన్‌లో నిర్వహించిన యురోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కాంగ్రెస్ లో పరిశోధకులు మరో తాజా అధ్యయన ఫలితాన్ని వెల్లడించారు. రోజుకి కేవలం ఇరవై అయిదు నిముషాల పాటు బ్రిస్క్ వాక్ చేస్తే చాలు, చిరకాలం యవ్వన వంతులుగా కనిపించడంతో పాటు మీ సగటు జీవితకాలం ఏడు […]
ఇప్పటికే నడక ప్రయోజనాలను తెలిపే సమాచారం మనకు ఎంతో అందుబాటులో ఉంది. ఈ అద్భుతమైన, సింపుల్ వ్యాయామం గురించి పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మరింతగా ఆశ్చర్యం గొలిపే సమాచారాన్ని అందిస్తూనే ఉన్నాయి. ఇటీవల లండన్‌లో నిర్వహించిన యురోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కాంగ్రెస్ లో పరిశోధకులు మరో తాజా అధ్యయన ఫలితాన్ని వెల్లడించారు. రోజుకి కేవలం ఇరవై అయిదు నిముషాల పాటు బ్రిస్క్ వాక్ చేస్తే చాలు, చిరకాలం యవ్వన వంతులుగా కనిపించడంతో పాటు మీ సగటు జీవితకాలం ఏడు సంవత్సరాలు పెరుగుతుందని ఈ శాస్త్రవేత్తలు తెలిపారు.
యురోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీలో స్పోర్ట్స్ కార్డియాలజీ విభాగంలో, వారసత్వంగా వచ్చే గుండెవ్యాధుల నిపుణుడైన ప్రొఫెసర్ సంజయ్ శర్మ ఈ విషయంపై మరింత సమాచారాన్ని అందించారు. రోజువారీ తగినంత వ్యాయామంతో హార్ట్ ఎటాక్‌లతో మరణించేవారి సంఖ్యని సగానికి సగం తగ్గించవచ్చని ఆయన అన్నారు. యాభై, అరవై సంవత్సరాల వయసులోనే హార్ట్ ఎటాక్‌కి గురయ్యే ప్రమాదం నుండి ఈ చిన్నపాటి వ్యాయామం మనల్ని రక్షిస్తుందని ఆయన వివరించారు. కరోనరీ గుండె వ్యాధి కారణంగా యుకెలో ప్రతి సెకండ్‌కి ఒకరు మరణిస్తున్నట్టుగా లెక్కలు చెబుతున్నాయి. దాంతో అక్కడ ఈ పరిశోధన మరింత ప్రాధాన్యతని సంతరించుకుంది.
ఈ అధ్యయనం కోసం 30-60 సంవత్సరాల మధ్య వయసున్న, వ్యాయామం అలవాటు లేని 69మందిని ఎంపిక చేసుకున్నారు. వీరంతా సిగరెట్లు తాగని వారు, అలాగే పూర్తిస్థాయి ఆరోగ్యంగా ఉన్నవారు. వీరందరితో ఆరువారాల పాటు ప్రతిరోజూఎరోబిక్స్, కొన్ని కఠిన వ్యాయామాలు చేయించి పరిశీలించి చూశారు. ఈ వ్యాయామాలతో వారిలో యాంటీ ఏజింగ్ ప్రక్రియ మొదలైనట్టుగా, కణజాలంలో పునరుజ్జీవం కలిగినట్టుగా గమనించారు. ఈ ఫలితాలను వెల్లడించిన సంజయ్ శర్మ వ్యాయామంతో మూడునుండి ఏడు సంవత్సరాల జీవితకాలం పెరుగుతుందని, అంతేకాకుండా వ్యాయమం యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తుందని, దీంతో మెదడు పనితీరు మెరుగుపడుతుందని, వృద్ధాప్యంలో వచ్చేమతిమరుపు వ్యాధిని సైతం నివారించవచ్చని వివరించారు.
చక్కని ఆరోగ్యానికి అవసరమైన కనీస వ్యాయామం గురించి చెబుతూ, ఆడయినా మగయినా ఏ వయసు వారయినా రోజుకి కనీసం ఇరవై నుండి ఇరవై అయిదు నిముషాల పాటు వ్యాయామం చేసి తీరాలన్నారు. ముఖ్యంగా శారీరక కదలికలేని ఉద్యోగాలు చేసేవారికి ఇది మరింత అవసరమని ఆయన పేర్కొన్నారు.