Telugu Global
Others

బిగించిన కార్మిక పిడికిలి... జరుగుతున్న సార్వత్రిక సమ్మె

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ రహదారి భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం దేశ వ్యాప్త బంద్‌కు ఆటో యూనియన్‌లు పిలుపునిచ్చాయి. గ్రేటర్‌ పరిధిలో ఆర్టీసీ బస్సులతోపాటు ఆటోలు, క్యాబ్‌లు, ప్రైవేటు బస్సులు, లారీలు నిలిచిపోయాయి. ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు బంద్‌కు మద్దతుగా విధులకు వెళ్లడం లేదు. గ్రేటర్‌ పరిధిలో 3500 ఆర్టీసీ బస్సులు, 1.30 లక్షలకు పైగా ఉన్న ఆటో రిక్షాలు నిలిచిపోయాయి. కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించే సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ […]

బిగించిన కార్మిక పిడికిలి... జరుగుతున్న సార్వత్రిక సమ్మె
X

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ రహదారి భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం దేశ వ్యాప్త బంద్‌కు ఆటో యూనియన్‌లు పిలుపునిచ్చాయి. గ్రేటర్‌ పరిధిలో ఆర్టీసీ బస్సులతోపాటు ఆటోలు, క్యాబ్‌లు, ప్రైవేటు బస్సులు, లారీలు నిలిచిపోయాయి. ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు బంద్‌కు మద్దతుగా విధులకు వెళ్లడం లేదు. గ్రేటర్‌ పరిధిలో 3500 ఆర్టీసీ బస్సులు, 1.30 లక్షలకు పైగా ఉన్న ఆటో రిక్షాలు నిలిచిపోయాయి. కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించే సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, రంగారెడ్డి రీజియన్‌లకు చెందిన బస్సులు దాదాపుగా నిలిచిపోనున్నాయి. సమ్మెకు ఆర్టీసీ టీఎంయూ, ఎన్‌ఎంయూ, ఈయూలు ఇప్పటికే మద్దతు తెలపడంతోపాటు కార్మికులు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తున్న బంద్‌ ప్రభావం…
రెండు తెలుగు రాష్ర్టాల్లో సార్వత్రిక సమ్మెలో పలు కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి. రహదారి రవాణా భద్రత బిల్లును ఉపసంహరించుకోవాలని, కనీస వేతనాన్ని రూ.15 వేలకు పెంచాలని డిమాండు చేస్తూ పలు సంఘాలు రవాణా బంద్‌ చేపట్టాయి. రైల్వేలో ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ కేంద్రప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల్లో రవాణ బంద్‌ సాగుతోంది. ఈ బంద్‌ కారణంగా ఆంధ్రా యూనివర్శిటీలో జరిగే యూజీ, వృత్తివిద్యా కోర్సుల పరీక్షలను వాయిదా వేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న దుష్ట ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికలోకం మరోసారి దేశ వ్మాప్తంగా సమ్మె శంఖారావాన్ని మోగించనుంది. సెప్టెంబర్‌ 2 (బుధవారం) జరగనున్న ఈ చారిత్రాత్మక సమ్మెకు ఇప్పటికే సన్నా హాలు పూర్తయ్యాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అనుబంధ కార్మిక సంఘమైన బిఎంఎస్‌ మినహా మిగిలిన అన్ని సంఘాలూ సమ్మెకు మద్దతు ప్రకటించాయి. రాష్ట్రంలోనూ సమ్మె సన్నాహాలు జోరుగా సాగాయి. సమ్మెకు ముందస్తుగా రాష్ట్రమంతా బైక్‌ ర్యాలీలు, ప్రదర్శనలతో హోరెత్తింది. సమ్మెకు మద్దతుగా రైతులు, వ్యవసాయ కార్మికులు మండల కార్యాలయాలు, కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఎపి ఎన్‌జిఓలు కూడా సమ్మెకు మద్దతు పలికారు.

సెప్టెంబర్‌ 2 సార్వత్రిక సమ్మె సందర్భంగా సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌, ఎఐసిటియు కార్యదర్శి గురుదాస్‌ దాస్‌గుప్తా, ఐఎన్‌టియుసి ఉపాధ్యక్షులు అశోక్‌సింగ్‌ తదితరులు బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. కార్మిక సంఘాల తరుపున గురుదాస్‌ దాస్‌గుప్తా మాట్లాడుతూ.. ‘మోడీ ప్రభుత్వం దూకుడుగా అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని హెచ్చరిస్తూ.. సెప్టెంబర్‌ 2న ఒక్క రోజు సమ్మె చేపడుతున్నాం. దీనితోనైనా ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుని కార్మిక సంఘాలను చర్చలకు పిలవాలి. లేకపోతే భవిష్యత్తు ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తాం’ అని స్పష్టం చేశారు. సమ్మె నుంచి బిఎంఎస్‌ తప్పుకోవడంపై స్పందిస్తూ..’జులైలోనే దేశవ్యాప్త సమ్మె నిర్వహించాలని కార్మిక సంఘాలు భావించాయి. కానీ అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వానికి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఒక్క యేడాదైనా గడువు ఇవ్వాలనే బిఎంఎస్‌ సూచన మేరకు సెప్టెంబర్‌కు వాయిదా వేశాం. కానీ చివరి నిమిషంలో సమ్మె నుంచి బిఎంఎస్‌ తప్పుకోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా బిఎంఎస్‌ తమ నిర్ణయాన్ని పున:సమీక్షించుకుని కార్మికుల ఐక్య కూటమిలో చేరాలని కోరుతున్నాం’ అని అన్నారు. పైగా కార్మిక సంఘాల 12 డిమాండ్లలో ఏడింటినీ ఆమోదించామని ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల సవరణ, జాతీయ రహదారి రవాణా భద్రత బిల్లు, కనీస వేతనాల పెంపు, అమలు తదితర అంశాలపై తాము దృష్టి కేంద్రీకరించినట్టు ఆయన చెప్పారు.

First Published:  2 Sept 2015 1:39 AM IST
Next Story