Telugu Global
Family

మీరు అభివృద్ధి చెందాలి (Devotional)

ఒకసారి గురునానక్‌ తన శిష్యుడయిన మర్ధనుడితో ఒక గ్రామాన్ని సందర్శించాడు. ఆ గ్రామస్థులు ఆధ్యాత్మిక విషయాలకు విలువనిచ్చేవాళ్ళు కారు. నిజాయితీ లేనివాళ్ళు. నానక్‌ కొన్నాళ్ళు ఆ గ్రామంలో ఉండి తిరిగి వెళుతూ చాలా సానుకూలంగా ఆ గ్రామస్థులకు వీడ్కోలు చెబుతూ తన చేతులుపైకి ఎత్తి “మీరు అభివృద్ధి చెందాలి?” అని ఆశీర్వదించాడు. తరువాత నానక్‌ తన శిష్యుడితో ఇంకొక గ్రామం చేరాడు. ఈ గ్రామస్థులు ఆ గ్రామస్థులులాగా కాకుండా చాలా దయ గలవాళ్ళు. ఆధ్యాత్మిక దృష్టి ఉన్న […]

ఒకసారి గురునానక్‌ తన శిష్యుడయిన మర్ధనుడితో ఒక గ్రామాన్ని సందర్శించాడు. ఆ గ్రామస్థులు ఆధ్యాత్మిక విషయాలకు విలువనిచ్చేవాళ్ళు కారు. నిజాయితీ లేనివాళ్ళు. నానక్‌ కొన్నాళ్ళు ఆ గ్రామంలో ఉండి తిరిగి వెళుతూ చాలా సానుకూలంగా ఆ గ్రామస్థులకు వీడ్కోలు చెబుతూ తన చేతులుపైకి ఎత్తి “మీరు అభివృద్ధి చెందాలి?” అని ఆశీర్వదించాడు.

తరువాత నానక్‌ తన శిష్యుడితో ఇంకొక గ్రామం చేరాడు. ఈ గ్రామస్థులు ఆ గ్రామస్థులులాగా కాకుండా చాలా దయ గలవాళ్ళు. ఆధ్యాత్మిక దృష్టి ఉన్న వాళ్ళు. వాళ్ళు గురునానక్‌ను గౌరవించి ఆయన బోధనలు విని ఆయన్ని ఎంతో గౌరవించారు. గ్రామం సరిహద్దుదాకా వచ్చి ఆయనకు వీడ్కోలు పలికారు.

ఆ గ్రామం వదిలిపెడుతూ గురునానక్‌ చేతులు పైకి ఎత్తి వాళ్ళను ఆశీర్వదిస్తూ “మీరు మీ స్థలాన్ని వదిలిపెడతారు” అన్నాడు.

ఆ మాటలు విని మర్ధనుడు ఆశ్చర్యపోయాడు. మార్గమధ్యంలో “గురుదేవా! మీరు మిమ్మల్ని పట్టించుకోని వాళ్ళని అభివృద్ధి చెందమని, మిమ్మల్ని గౌరవించిన వాళ్ళని స్థానభ్రంశం చెందమని అన్నారు. ఇది చిత్రంగా ఉంది. ఎందుకలా అన్నారు?” అని అడిగాడు.

దానికి నానక్‌ “ఈ రెండో గ్రామంలోని జనాలు మంచి వాళ్ళు. విలువలు గలవాళ్ళు. వాళ్ళు ఉన్న స్థలాన్ని వదిలివేరే చోటుకి వెళితే వాళ్ళ ఉన్నతమయిన ధర్మాల్ని, విలువల్ని అందరికీ పరిచయం చేస్తారు, ప్రచారం చేస్తారు. వాళ్ళ ప్రభావంతో జనం నైతిక పరివర్తనకు లోనవుతారు. ఆ కారణంగా ప్రపంచం కొంత మారుతుంది. అందుకని వాళ్ళని “మీ స్థలాన్ని వదిలిపెడతారు” అన్నాను.

ఇక మొదటి గ్రామం జనాలు విలువలు తెలియనివారు. అధ్యాత్మిక దృష్టి లేనివాళ్ళు. అందుకని వాళ్ళని అభివృద్ధి చెందమన్నాను. అక్కడే ఉండి ఆస్థిపాస్తులు సంపాదించుకోమన్నాను. ఎక్కడికీ వెళ్ళవద్దన్నాను. అందువల్ల వాళ్ళ “అజ్ఞానం” ఇతరులకు వ్యాపించకుండా ఉంటుంది. అది నా ఉద్దేశం అన్నాడు.

గురునానక్‌ ఆంతర్యానికి మర్దనుడు సంతోషించాడు.

– సౌభాగ్య

First Published:  1 Sept 2015 6:31 PM IST
Next Story