Telugu Global
Others

క‌న్న‌డ సాహితీవేత్త క‌ల‌బుర్గి దారుణ‌హ‌త్య 

ప్రముఖ కన్నడ సాహితీవేత్త, హంపీ వ‌ర్సిటీ మాజీ ఉప కులపతి ఎం.ఎం.కలబుర్గి (77)ని గుర్తు తెలియని సాయుధులు కాల్చి చంపారు. ధార్వాడ ప‌ట్ట‌ణం క‌ల్యాణ్‌న‌గ‌ర్ సుబుర్గ్ ప్రాంతంలో తన స్వగృహంలో క‌ల‌బుర్గిపై దాడి చేశారు. ధార్వాడ క‌మిష‌న‌ర్ ర‌విప్ర‌సాద్ క‌థ‌నం మేర‌కు ఇద్దరు ఆగంతకులు బైక్‌పై కలబుర్గి ఇంటికి వచ్చారు. వారిలో ఒకడు రోడ్డు మీదే నిలబడగా, మరొకడు లోపలకు వచ్చాడు. కాలింగ్‌ బెల్‌ మోగడంతో తలుపు తీసుకొని బయటకు వచ్చిన కలబుర్గిపై దాడి చేశాడు. అతి […]

క‌న్న‌డ సాహితీవేత్త క‌ల‌బుర్గి దారుణ‌హ‌త్య 
X
ప్రముఖ కన్నడ సాహితీవేత్త, హంపీ వ‌ర్సిటీ మాజీ ఉప కులపతి ఎం.ఎం.కలబుర్గి (77)ని గుర్తు తెలియని సాయుధులు కాల్చి చంపారు. ధార్వాడ ప‌ట్ట‌ణం క‌ల్యాణ్‌న‌గ‌ర్ సుబుర్గ్ ప్రాంతంలో తన స్వగృహంలో క‌ల‌బుర్గిపై దాడి చేశారు. ధార్వాడ క‌మిష‌న‌ర్ ర‌విప్ర‌సాద్ క‌థ‌నం మేర‌కు ఇద్దరు ఆగంతకులు బైక్‌పై కలబుర్గి ఇంటికి వచ్చారు. వారిలో ఒకడు రోడ్డు మీదే నిలబడగా, మరొకడు లోపలకు వచ్చాడు. కాలింగ్‌ బెల్‌ మోగడంతో తలుపు తీసుకొని బయటకు వచ్చిన కలబుర్గిపై దాడి చేశాడు. అతి సమీపం నుంచి రెండు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తుండ‌గానే క‌ల‌బుర్గి క‌న్నుమూశారు. క‌ల‌బుర్గి హ‌త్య‌పై కేసు న‌మోదు చేశామ‌ని, నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేశామ‌ని క‌మిష‌న‌ర్ చెప్పారు. హంపీ యూనివర్సిటీ ఉప కులపతిగా పనిచేసిన కలబుర్గి సాహితీ రంగంలో తనదైన ముద్ర వేశారు. క‌ల‌బుర్గి వ‌చ‌న సాహిత్యం ద్వారా క‌న్న‌డ సాహితీరంగానికి ఎన‌లేని సేవ‌లందించారు. సాహితీ ప్రస్థానంలో ఎన్నో పురస్కారాలు అందుకొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ, కన్నడ సాహితీ పురస్కారం, పంపా అవార్డు, పురస్కారాలను అందుకొన్నారు. మ‌త‌, కుల మూఢాచారాల‌పై నిర్మొహ‌మాటంగా వ్యాఖ్యానించే… కల‌బుర్గిపై కొన్ని వ‌ర్గాలు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నాయ‌ని స‌మాచారం. ఈ హ‌త్య‌కు ఆ వ‌ర్గాలే కార‌ణ‌మా? ఇత‌ర కార‌ణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.
క‌ల‌బుర్గి హ‌త్య‌పై క‌న్న‌డ‌నాట ఆగ్ర‌హ‌జ్వాల‌
vc-shotకలబుర్గి కాల్చివేత‌పై క‌ర్ణాట‌క‌లో ఆగ్ర‌హ‌జ్వాల‌లు ఎగిసిప‌డుతున్నాయి. రచ‌యిత‌లు, ఉద్య‌మ‌కారులు, విద్యార్థులు, సాహితీ విమ‌ర్శ‌కులు ఈ హ‌త్య‌ను ఖండిస్తూ ఆందోళ‌న‌కు దిగారు. సామాజిక‌, మ‌త‌ప‌ర‌మైన అంశాల‌పై త‌న భావాల‌ను స్వేచ్ఛ‌గా వెల్ల‌డించే క‌ల‌బుర్గిని కొన్నివ‌ర్గాలు త‌మ శ‌త్రువుగా భావించేవ‌ని సాహితీవేత్త‌లు అంటున్నారు. వ‌చ‌న ర‌చ‌న‌లో క‌న్న‌డ సాహిత్యానికి ఎన‌లేని సేవ‌లందించిన క‌ల‌బుర్గి ప్రాచీన లిపి ప‌రిష్క‌ర్త‌, అధ్య‌య‌న‌వేత్త‌గానూ క‌న్న‌డనాట పేరొందారు. క‌ల‌బుర్గి హ‌త్య‌పై కర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. బెంగ‌ళూరు నుంచి హెలికాప్ట‌ర్‌లో ధార్వాడ చేరుకున్న సీఎం క‌ల‌బుర్గికి నివాళుల‌ర్పించారు. క‌ల‌బుర్గి లేని లోటు క‌న్న‌డ సాహితీరంగానికి తీర‌నిలోట‌ని క‌న్న‌డ ర‌చ‌యిత‌లు బ‌ర్గూరు రామ‌చంద్ర‌ప్ప‌, మ‌రుల సిద్ధ‌ప్ప‌, గిరిష్ క‌ర్నాడ్‌లు అన్నారు. క‌ల‌బుర్గి దారుణ‌హ‌త్య‌పై న్యాయ‌విచార‌ణ జ‌రిపించాల‌ని ప్ర‌తిప‌క్ష నేత మాజీ సీఎం జ‌గ‌దీశ్ షెట్ట‌ర్ డిమాండ్ చేశారు.
First Published:  31 Aug 2015 12:59 AM GMT
Next Story