ఒకవైపు ధగధగ...మరో వైపు దగా… దగా!
అభివృద్ధి జరిగితే పేదరికం పోతుందా… పేదరికాన్ని తరిమివేయడమే అభివృద్ధా…గుడ్డుముందా, పిల్లముందా అన్నట్టుంది కదా. అభివృద్ధితోనే అన్నీ సాధ్యమనీ, జిడిపి రేటు పెంచేయాలనే నినాదాలు మన నాయకుల నోటివెంట ఎప్పుడూ వినబడుతుంటాయి. భారతదేశాన్ని అభివృద్ధి పరంగా ప్రపంచ దేశాలకంటే ముందుకు పరుగులు పెట్టించాలని, అందుకు తాము నిద్రాహారాలు మానేసి కృషి చేస్తున్నామంటారు. ఆ పరుగుల సంగతి కాసేపు పక్కన పెడదాం…ఇక్కడ మనం చూస్తున్న చిత్రంలో అత్యాచారానికి గురయిన తన తొమ్మిదేళ్ల చిన్నారికి వైద్యం కోసం, ఒక తండ్రి ఆమెను ఎత్తుకుని నాలుగు కిలోమీటర్లు పరుగు తీస్తున్నాడు. ఎందుకంటే వారికి […]
అభివృద్ధి జరిగితే పేదరికం పోతుందా… పేదరికాన్ని తరిమివేయడమే అభివృద్ధా…గుడ్డుముందా, పిల్లముందా అన్నట్టుంది కదా. అభివృద్ధితోనే అన్నీ సాధ్యమనీ, జిడిపి రేటు పెంచేయాలనే నినాదాలు మన నాయకుల నోటివెంట ఎప్పుడూ వినబడుతుంటాయి. భారతదేశాన్ని అభివృద్ధి పరంగా ప్రపంచ దేశాలకంటే ముందుకు పరుగులు పెట్టించాలని, అందుకు తాము నిద్రాహారాలు మానేసి కృషి చేస్తున్నామంటారు. ఆ పరుగుల సంగతి కాసేపు పక్కన పెడదాం…ఇక్కడ మనం చూస్తున్న చిత్రంలో అత్యాచారానికి గురయిన తన తొమ్మిదేళ్ల చిన్నారికి వైద్యం కోసం, ఒక తండ్రి ఆమెను ఎత్తుకుని నాలుగు కిలోమీటర్లు పరుగు తీస్తున్నాడు. ఎందుకంటే వారికి అలా కాకుండా మరెలాగూ ఆసుపత్రికి వెళ్లే స్థోమత లేదు.
జార్ఖండ్‌లోని ఈస్ట్ సంగ్‌భమ్ జిల్లాకు చెందిన ఓ పేద కుటుంబం కథ ఇది. ఈ ఇంటి దీపమైన తొమ్మిదేళ్ల పాప, తన ఇంటి దగ్గర ఆడుకుంటుంటే ఒక దుర్మార్గుడు దూరంగా నది ఒడ్డుకు తీసుకువెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో ఆమె పొట్టలోని పేగులు సైతం గాయాలపాలయ్యాయి. ప్రాథమిక హెల్త్ కేర్ సెంటర్ల నుండి రాంచీలోని ప్రభుత్వ ఆసుపత్రుల వరకు తిరిగి కూతురిని బతికించుకున్నారు ఆ తల్లిదండ్రులు. ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. అయితే గాయాలకు డ్రస్సింగ్ కోసం వారానికి రెండుసార్లు వారి నివాసిత ప్రాంతానికి నాలుగుకిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక హెల్త్ కేర్ సెంటర్ కి వెళ్లాల్సి ఉంది. ప్రభుత్వ రవాణా సదుపాయం, ఆ సదుపాయాన్నితమకు తాముగా కల్పించుకునే ఆర్థిక స్థోమత రెండూ లేకపోవడంతో ఆమెను మోసుకుంటూ ఆ తల్లిదండ్రులు నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు. రాంచీ డాక్టర్లు ఆమె కోలుకుంటుందని చెప్పారని, కానీ ప్రస్తుతం ఆమెకు ఇంకా డ్రస్సింగ్ అవసరం ఉందని ఆ తండ్రి చెప్పాడు. పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అతను మరో అత్యాచార కేసులో కూడా నిందితుడు.
ఇంత జరిగాక ఇప్పుడు అక్కడి ప్రభుత్వం మేలుకుంది. గత శుక్రవారమే జార్ఖండ్ హైకోర్టు ఆ కుటుంబానికి లక్షరూపాయలు సహాయం అందించాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. కేసుని సుమోటోగా స్వీకరిస్తున్నట్టుగా ప్రకటించింది. స్థానిక అధికారులు వారికి ఒక సైకిల్, ఆర్థిక సహాయం, ఆ పాప తండ్రికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఉపాధిని చూపిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు ఆ తండ్రి రోజు కూలీగా పనిచేస్తున్నాడు. వీలయితే ప్రభుత్వ పథకాల కింద భూమిని సైతం ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇవన్నీ ఆ కుటుంబానికి అందుబాటులోకి రావచ్చు. అయితే అది ఎప్పుడూ…ఆ చిన్నారి బతుకు ఛిద్రం అయ్యాక. ఇక్కడ ఒక విషాదకరమైన సత్యం మన కళ్లకు స్పష్టంగా కనబడుతోంది. ఓ కుటుంబానికి అవసరం అయిన కనీస ఆర్థిక స్థోమత, సహాయం, ఉపాధి లాంటివన్నీ ఆ చిన్నారి అంతటి శిక్షని అనుభవించాక అందుబాటులోకి వస్తున్నాయి. లేకపోతే అవి సంవత్సరాలు గడిచినా వారి దరిదాపుల్లోకి రావు. ఈ సంఘటనలో బాధితురాలయిన చిన్నారి తండ్రికి ఒక మంచి ఉపాధి ఉండి ఉంటే, ఆమెని ఆ తల్లిదండ్రులు ఒంటరిగా వదిలివెళ్లేవారు కాదేమో…ఆమె సురక్షితంగా స్కూల్లో ఉండి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదేమో….అత్యాచారాలపై అమలవుతున్న చట్టాలు మరింత ధృడంగా ఉంటే, అలాంటి అవగాహన, చట్టం పట్ల భయం సక్రమంగా కలిగించి ఉంటే ఈ ఘోరం ఆగేదేమో…కనీసం ఘోరం జరిగిన వెంటనే అధికారులు సక్రమంగా స్పందిస్తే ఆ తల్లిదండ్రులు ఆమె చికిత్సకోసం అన్ని పాట్లు పడేవారు కాదు. ఒక పక్క ఆడపిల్లను బతికించుకుందాం, చదివించుకుందాం…అనే స్లోగన్లు ఇచ్చుకుంటూనే వారికి కనీసం రక్షణ ఇవ్వలేని పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు ఉంటున్నాయి.
తల్లిదండ్రుల పేదరికం, వలసలు, అమ్మాయిలను స్కూళ్లకు పంపకుండా ఒంటరిగా వదిలివేయాల్సి రావడం… ఇవన్నీ ఆడపిల్లలను మరింతగా ఆపదల్లోకి నెట్టేస్తున్నాయి. భ్రూణ హత్యల మీద పోరాటం చేద్దామని ప్రగల్బాలు పలుకుతున్న నేతలు, పుట్టి పెరుగుతున్న చిన్నారుల రక్ష ణనే పట్టించుకోవడం లేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం జార్ఖండ్‌లో గత ఏడాది 1050 రేప్ కేసులు నమోదు అయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం గ్రామాల్లోనూ, గ్రామాలకు దగ్గరలోనూ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కొరత బాగా ఉంది. గ్రామీణులకు సరైన వైద్యం అందని ద్రాక్షపండులాగే ఉంది. ఇప్పుడు మళ్లీ మనం ప్రభుత్వ స్లోగన్‌ని ఒకసారి గుర్తు చేసుకుందాం…అభివృద్ధితో పేదరికం పోతుందని. అయితే ఇది సరికాదని పేదరికం పోతేనే దాన్ని అభివృద్ధి అనాలని మనకు ఇలాంటి సంఘటనలు ఎన్నో రుజువు చేస్తున్నాయి. ఎందుకంటే జిడిపి ఎంత పెరిగినా అంతకంటే ఎక్కువగా సంపద పంపకంలో వ్యత్యాసం కనబడుతోంది. అది ఆకాశానికి భూమికి ఉన్న వ్యత్యాసమంత. అట్టడుగున ఉన్న పది శాతం మంది నిరుపేదల కంటే టాప్ స్థాయిలో ఉన్న పదిశాతం మంది ధనవంతులు 370 రెట్లు అధికంగా సంపదని కలిగి ఉన్నారు. అందుకే మనం జిడిపి (గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జాతీయ స్థూల ఉత్పత్తి)ని ఎంతగా పెంచినా, మరో జిడిపి (గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ ప్రొటెక్షన్) ఏ మాత్రం జరగదని…పైన పేర్కొన్న చిన్నారులు పెరుగుతున్న దేశ సంపదకు ఎప్పటికీ వారసులు కారని, పేదరికపు బానిసలుగానే మిగులుతుంటారని అర్థమవుతోంది.
-వడ్లమూడి దుర్గాంబ