హోదా, ప్యాకేజీలు... కేంద్రాన్ని రెండూ అడిగాం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌కోసం, భావి తరాల మనుగడ కోసం ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు కావాలని తాను ప్రధానమంత్రి నరేంద్రమోడిని కోరినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రం ఎన్నో కష్టాల్లో ఉందని, అందరికీ ఆందోళన కలిగించే విధంగా ఆర్ధిక పరిస్థితి ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను, హక్కులను కాపాడడంలో తెలుగుదేశం ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డంగా విభజించిందని, విభజన పాపంలో […]
BY sarvi31 Aug 2015 9:16 AM IST
X
sarvi Updated On: 31 Aug 2015 9:16 AM IST
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌కోసం, భావి తరాల మనుగడ కోసం ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు కావాలని తాను ప్రధానమంత్రి నరేంద్రమోడిని కోరినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రం ఎన్నో కష్టాల్లో ఉందని, అందరికీ ఆందోళన కలిగించే విధంగా ఆర్ధిక పరిస్థితి ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను, హక్కులను కాపాడడంలో తెలుగుదేశం ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డంగా విభజించిందని, విభజన పాపంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా భాగస్వామ్యం ఉందని ఆయన ఆరోపించారు. నీచమైన చర్యకు దిగడానికి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందని, లోక్‌సభ తలుపులు మూసేసి… ప్రత్యక్ష ప్రసారాలను నిలిపి వేసి తొలిసారి ఆర్టికల్-3ని ఉపయోగించిందని ఆంద్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేసిందని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. ఈ విభజనకు హేతుబద్దత లేని ఆయన అన్నారు. బెయిల్ కోసం, జైలు శిక్ష పడకుండా తప్పించుకోవడం కోసం కాంగ్రెస్‌తో రాజీ పడి ఆంధ్రప్రదేశ్ చీల్చడానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరించిందని, విభజన బిల్లు పెట్టిన సమయంలో ఎంపీగా ఉన్న జగన్ పార్లమెంటులో ఎక్కడ దాక్కున్నారో తెలపాలని చంద్రబాబు డిమాండు చేశారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ రెండూ కావాలని తాను ఢిల్లీ పర్యటనలో ప్రధానిని కోరానని, ఈ అంశాలతోపాటు వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్రకు, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని అడిగానని ఆయన తెలిపారు.
తాము విభజనకు వ్యతిరేకంగా ఆనాడు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆంధ్రప్రదేశ్‌ను యూపీఏ ప్రభుత్వం విభజించిందని ఆరోపించారు. ఎంపీలుగా ఉన్న వైఎస్ జగన్మోహనరెడ్డి, మేకపాటి రాజమోహనరెడ్డి అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు ఉపసంహరించుకున్నారో తెలపాలని చంద్రబాబు డిమాండు చేశారు. రెండు రాష్ట్రాలకు న్యాయం చేస్తూ నిర్ణయం తీసుకోవాలని తమ పార్టీ ఆనాడు కోరిందని, విభజన చేయదలచుకుంటే ఆంధ్ర ప్రాంత ప్రజలను, చేయకూడదనుకుంటే తెలంగాణ ప్రాంత ప్రజలను ఒప్పించాలని ఆనాడు తాము కోరామని, కాని తమ విజ్ఞప్తిని పెడచెవిన పెట్టి యూపీఏ అన్యాయంగా, అక్రమంగా రాష్ట్రాన్ని చీల్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల కుట్రల వల్ల రాష్ట్ర విడిపోయిందని చంద్రబాబు విమర్శించారు. సబ్జెక్టుపై మాట్లాడితే ఎంత సేపైనా ఓపిక పడతామని, అలా కాకుండా ఇష్టానుసారం గొడవ చేద్దామని చూస్తే సహించేది లేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కర్ణాటకకు బెంగుళూరు, తమిళనాడుకి చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ ఉంది కానీ… ఆంధ్రప్రదేశ్‌కు ఏమీ లేదని, అయినా భయపడకుండా,… బాధ పడకుండా ముందుకెళుతున్నామని ఆయన అన్నారు. విభజన సమయంలో బీజేపీ నాయకులు అరుణ్‌జైట్ల, వెంకయ్యనాయుడు రాష్ట్రానికి అండగా మాట్లాడారని, అదే సమయంలో సభలోనే ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తా లేకుండా పోయారని ఆరోపించారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు అభ్యంతరం చెప్పారు. సభా నాయకుడి ప్రకటనపై వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. దానికి స్పీకర్ అభ్యంతరం చెబుతూ ప్రకటన పూర్తయ్యాక కావలసినంత సమయం ఇస్తానని, మీరు చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పవచ్చని అన్నారు. అయితే దీనిపై సంతృప్తి చెందని వైఎస్‌ఆర్ పార్టీ నాయకులు సభ జరగకుండా అడ్డుపడ్డారు. ఈ దశలో ఆర్థికమంత్రి యనమల జోక్యం చేసుకుని సభా నియమాలను వైఎస్‌ఆర్‌సీపీ పాటించడం లేదని, ముఖ్యమంత్రి ప్రకటన పూర్తయిన తర్వాత విపక్ష నేతతోపాటు సభ్యులు మాట్లాడవచ్చని అన్నారు. సభ నడవకుండా చేయడమే ఈ పార్టీ ఉద్దేశ్యంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని అభివృద్ధి నిరోధక పార్టీ వైసీపీ అంటూ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా పేరుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ మంత్రులను తొలగిస్తే కేంద్ర కేబినెట్‌లో చేరాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతుందని ఆరోపించారు. దీంతో ఆ పార్టీ నాయకులు స్పీకర్ పొడియం ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సభ నియమాలను తుంగలోకి తొక్కి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్నారని, ఇది క్షంతవ్యం కాదని అన్నారు. ఎంతకీ విపక్ష సభ్యుల గందరగోళం తగ్గకపోవడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.
Next Story