ఓ కొత్త ఆలోచన...వనితకు, పర్యావరణానికి వరం!
గుజరాత్‌కి చెందిన శ్యామ్‌సుందర్ బెడేకర్ ఒక మంచి పరికరాన్ని కనుగొన్నారు. ఓ సదాశయంతో చేసే ఆలోచన సమాజానికి ఎంత మేలు చేస్తుందో ఆయన నిరూపించారు. మహిళలు, ముఖ్యంగా గ్రామాల్లో నివసించే వారు, రుతుక్రమం సమయంలో వాడే నాప్‌కిన్‌లను ఎక్కడంటే అక్కడ పడేయకుండా, దానివలన పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఆయన ఒక మంచి మార్గాన్ని కనిపెట్టారు. ఆయన రూపొందించిన ఒక చక్కని పరికరం ఇప్పుడు గ్రామీణ మహిళలకు ఒక సులువైన సదుపాయంగా, పర్యావరణానికి మేలు చేసేదిగా ప్రశంసలు అందుకుంటోంది. గుజరాత్‌లోని వడోదరకు చెందిన శ్యామ్‌సుందర్ […]
గుజరాత్‌కి చెందిన శ్యామ్‌సుందర్ బెడేకర్ ఒక మంచి పరికరాన్ని కనుగొన్నారు. ఓ సదాశయంతో చేసే ఆలోచన సమాజానికి ఎంత మేలు చేస్తుందో ఆయన నిరూపించారు. మహిళలు, ముఖ్యంగా గ్రామాల్లో నివసించే వారు, రుతుక్రమం సమయంలో వాడే నాప్‌కిన్‌లను ఎక్కడంటే అక్కడ పడేయకుండా, దానివలన పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఆయన ఒక మంచి మార్గాన్ని కనిపెట్టారు. ఆయన రూపొందించిన ఒక చక్కని పరికరం ఇప్పుడు గ్రామీణ మహిళలకు ఒక సులువైన సదుపాయంగా, పర్యావరణానికి మేలు చేసేదిగా ప్రశంసలు అందుకుంటోంది.
గుజరాత్‌లోని వడోదరకు చెందిన శ్యామ్‌సుందర్ తాను తయారు చేసిన ఈ పరికరానికి అశుద్ధినాశక్ అని పేరుపెట్టారు. 53 సంవత్సరాల శ్యామ్, టెక్స్‌టైల్ కెమిస్ట్రీలో బిఎస్‌సి చదువుకున్నారు. మొదట టెక్స్‌టైల్ కంపెనీల్లో క్వాలిటీ కంట్రోల్ అధికారిగా పనిచేసేవారు. ఇప్పుడు బట్టల రంగుల కు సంబంధించిన కంపెనీ లో పనిచేస్తున్నారు. శ్యామ్ సుందర్ భార్య స్వాతి ఇంతకుముందే అతిచౌకగా నాణ్యతగల నాప్‌కిన్స్ తయారుచేసే విధానాన్ని రూపొందించి, దాన్నిగ్రామీణ మహిళలకు నేర్పించారు. అలా ఆమె గిరిజన మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చారు. వారికి పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన విధానంలో నాప్‌కిన్‌లు అందుబాటులోకి రావడంతో పాటు, వాటి తయారీతో ఉపాధి సైతం లభించింది. అయితే వాటిని ఎక్కడంటే అక్కడ పడేయకుండా, పర్యావరణానికి హాని చేయకుండా మాయం చేసే మార్గమేదీ ఆమెకు కనిపించలేదు. ఈ దిశగా స్వాతి ప్రయత్నాలు చేస్తున్నపుడు శ్యామ్ తన సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు.
చెత్తకుండీలు, చెత్తపారబోసే ప్రదేశాలు లేని గ్రామీణ ప్రాంతాలకు ఈ అవసరం ఎక్కువగా ఉందని ఆయన గుర్తించారు. అలాగే వాడిన నేప్‌కిన్స్‌ని అంతం చేసే పద్ధతి సరిగ్గా ఉంటే గ్రామీణ మహిళలు వాటిని వాడేందుకు ముందుకు వస్తారని కూడా ఆయనకు అనిపించింది. అలా అశుద్ధినాశక్ పరికరం తయారైంది. దీన్ని తయారుచేసే క్రమంలో అది టెక్నికల్‌గా బాగా పనిచేసేలా, వాణిజ్యపరంగా విజయం సాధించేలా, విలువైన ఆకర్షణీయమైన వస్తువుగా కనిపించకుండానే బాగా పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. ఎర్రగా మట్టి కూజాలా కనిపించే ఈ పరికరాన్ని కాంక్రీటు సామాగ్రితో రూపొందించారు. స్టీలు లాంటివైతే ఖర్చుఎక్కువ, పైగా అలా ఉంటే అవి దొంగిలించబడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇందులో చీమలు, దోమలు, బొద్దింకలు లాంటి ఎలాంటి క్రిమికీటకాలు చేరకుండా చక్కని అమరిక చేశారు.
ఒకేసారి ఐదునుండి ఇరవై వరకు వాడేసిన శానిటరీ నాప్‌కిన్లు ఇందులో పడతాయి. మహిళలు పైన ఉన్న చిన్నపాటి మూతని తెరచి అందులో నేప్‌కిన్స్ వేసి తరువాత ఎండుగడ్డి, లేదా పేపర్లు వేసి అగ్గిపుల్లవేస్తే చాలు, ఎలాంటి పొగ, వాసన లేకుండా అవన్నీ కాలి బూడిద అవుతాయి. బూడిదని మాత్రం తీసి పారేయాల్సి ఉంటుంది. అయితే ఆ బూడిదను మొక్కలకు ఎరువుగా వాడవచ్చని చెబుతున్నారు. చీమలు, బొద్దింకలు లాంటివి చేరకుండా ఈ పరికరం మొదట్లో ప్లేటులా ఉన్న ఆకారంలో నీళ్లు పోయాల్సి ఉంటుంది. ఇంటి బయటపెట్టేసినా ఎవరినీ ఆకట్టుకోని విధంగా, ఒక పనికిరాని వస్తువు అనే అభిప్రాయం కలిగేలా జాగ్రత్త తీసుకున్నారు. రెండువేల రూపాయల ధరతో విక్రయిస్తున్న ఈ పరికరాలు ఇప్పటివరకు రెండువేల వరకు వినియోగంలోకి వచ్చాయి. సర్వ శిక్షా అభియాన్ పరిధిలో ఉన్న స్కూళ్లు, కొన్ని యూనివర్శిటీలు, హోటళ్లలో దీన్ని వినియోగిస్తున్నారు.
ఈ సంవత్సరం మార్చిలో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ప్రదర్శ నా కార్యక్రమంలో శ్యామ్ తన నూతన ఆవిష్కరణను ప్రదర్శించారు. ఇప్పటి వరకు శ్యామ్ రోటీపాపడ్ మేకర్, పురుగుమందులు వాడే పైపు, తదితర వస్తువులను కనిపెట్టినా ఇది ఆయనకు వాటన్నింటికంటే మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఎందుకంటే అశుద్ధినాశక్ గ్రామీణ భారత ముఖచిత్రాన్ని మార్చే మంచి ప్రయత్నాల్లో ఒకటిగా నిలిచింది కాబట్టి.