వావ్...ఇదీ ఆరోగ్యమేనట!!!
వావ్, మైండ్ బ్లోయింగ్, వండర్‌ఫుల్…ఇలాంటి ఉద్వేగ భరితమైన పదాలు మన నోటినుండి రావాలంటే…అలాంటి అనుభవాలు ఎదురుకావాలి. అందమైన దృశ్యాలు, సాహసాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు…ఇలాంటివి మన జీవితాల్లో వాస్తవంగా సంభవించే అవకాశాలు తక్కువ. కానీ సినిమాలు, టివి కార్యక్రమాలు, వీడియోలు, కథలు, కళలు వీటి ద్వారా ఇలాంటి అద్భుతం… అనిపించే దృశ్యాలు, సంఘటనలు మనకు ఎదురవుతుంటాయి. విషయమేమిటంటే ఇలా ఎంత ఎక్కువగా మనం వావ్… అంటూ ఆశ్చర్యానందాలకు గురవుతుంటామో అంత ఎక్కువగా మనకు ఆరోగ్యం సమకూరుతుందట. డిస్కవరీ ఛానల్‌లో జంతువుల విన్యాసాలు చూస్తూ ఈ లోకాన్ని మర్చిపోవడం, […]
వావ్, మైండ్ బ్లోయింగ్, వండర్‌ఫుల్…ఇలాంటి ఉద్వేగ భరితమైన పదాలు మన నోటినుండి రావాలంటే…అలాంటి అనుభవాలు ఎదురుకావాలి. అందమైన దృశ్యాలు, సాహసాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు…ఇలాంటివి మన జీవితాల్లో వాస్తవంగా సంభవించే అవకాశాలు తక్కువ. కానీ సినిమాలు, టివి కార్యక్రమాలు, వీడియోలు, కథలు, కళలు వీటి ద్వారా ఇలాంటి అద్భుతం… అనిపించే దృశ్యాలు, సంఘటనలు మనకు ఎదురవుతుంటాయి. విషయమేమిటంటే ఇలా ఎంత ఎక్కువగా మనం వావ్… అంటూ ఆశ్చర్యానందాలకు గురవుతుంటామో అంత ఎక్కువగా మనకు ఆరోగ్యం సమకూరుతుందట. డిస్కవరీ ఛానల్‌లో జంతువుల విన్యాసాలు చూస్తూ ఈ లోకాన్ని మర్చిపోవడం, సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమాలను కళ్లప్పగించి చూడడం, మృదువైన సంగీతం వింటూ మైమరచిపోవడం వీటన్నింటికీ ఇది వర్తిస్తుంది.
బెర్కలీలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ, ఎమోషన్ అనే ప్రతిక ద్వారా ఈ విషయాలను వెల్లడించింది. పాజిటివ్ ఎమోషన్లు ముఖ్యంగా ఆశ్చర్యం, అద్భుతం లాంటి ఫీలింగ్స్ మనిషి ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతాయని, వాపు సంబంధిత అనారోగ్యాలు వచ్చే అవకాశాలను ఇవి తగ్గించి వేస్తాయని ఇందులో వెల్లడించారు. మన శరీరంలో ఒత్తిడి, నెగటివ్ ఎమోషన్లు పెరిగితే వాపు సంబంధింత రోగాలు తెచ్చిపెట్టే కొన్నిరకాల సైటోకిన్స్ అనే ప్రొటీన్లు ఎక్కువగా విడుదల అవుతాయి. ఈ చిన్న కణాలు జ్వరాలు, గాయాలను మాన్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి కానీ దీర్ఘకాలంలో ఇవి మధుమేహం, గుండెజబ్బులు, డిప్రెషన్ లాంటి వ్యాధులను తెచ్చిపెడతాయి. ఇలాంటపుడు పాజిటివ్ భావోద్వేగాలు దీనికి వ్యతిరేకంగా, మనిషికి మేలుచేస్తాయా అనే కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. 200మందిపై ఈ పరిశోధన నిర్వహించినపుడు అద్భుతాశ్చర్యాలకు గురయినవారి లాలాజలంలో శరీరంలో వాపుకి కారణమయ్యే కణాలు తగ్గినట్టుగా గమనించారు. నేరుగా కాకపోయినా వాటర్‌ఫాల్స్, సముద్ర చేపలు, ఖగోళ చిత్రాలు లాంటివాటిని వీడియోలో చూసినా మంచి ఫలితం ఉంటుందని వీరు చెబుతున్నారు.
అందమైన ప్రకృతిలో నడవడం, మంచి సంగీతం వినడం, ఏదన్నా కళకు అంకితమై జీవించడం ఇలాంటివన్నీ మన ఆరోగ్యం మీద, మన జీవితకాలంమీద ప్రభావాన్ని చూపుతాయని కాలిఫోర్నియా యూనివర్శిటీ సైకాలజిస్టు డ్యాచర్ కెల్ట్ నర్ అంటున్నారు. మనం మరొక్కసారి వావ్…అనేలా ఇలాంటి ఫీలింగ్స్ కి నిజంగానే మంచి ప్రయోజనాలున్నాయని, వీటివలన మనలో సహనం, ఇతరులకు సహాయం చేసే గుణాలు పెరుగుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాదు, భౌతిక వస్తుసేవల కంటే మానసిక అనుభూతులకు ప్రాధాన్యం ఇచ్చే గుణం పెరుగుతుంది. జీవితం అత్యంత సంతృప్తికరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రకృతితో సంబంధం లేకుండా పెరుగుతున్న నేటి పిల్లలకు ఈ తరహా అనుభూతులు మరిన్ని కావాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేచర్‌కి దూరంగా పెరిగే పిల్లల్లో నేచర్ డెఫిసిట్ డిజార్డర్… అనే మానసిక సమస్య ఉంటుందని లాస్ట్ చైల్డ్ ఇన్ ద వుడ్స్… అనే పుస్తకాన్ని రాసిన రిచర్డ్స్ లౌ అంటున్నారు. ఈ పదాన్ని సృష్టించిన ఈ రచయిత ప్రకృతితో సంబంధం లేకపోతే సంపూర్ణ ఆరోగ్యం, జీవితంలో సంతృప్తి, ఆధ్యాత్మికత…ఇలాంటివాటిని అనుభూతి చెందలేరని చెబుతున్నారు. అందమైన ప్రకృతిలో ఆనందాన్ని అనుభవించడం, అందమైన దృశ్యాలున్న సినిమాలు, ఫొటోగ్రఫీ, శిల్పాలు, చిత్రాలు, విచిత్రాలు, భౌగోళిక వింతలు… ఇలాంటివి చూడడం అనేది డాక్టర్ల ప్రిస్ర్కిప్షన్‌లో ఉండాల్సిందేనని శాస్త్రవేత్తలు గట్టిగానే చెబుతున్నారు.
ఇదే సమయంలో మనం ఒక విషయాన్ని గుర్తించాలి. అతడు సినిమాలో మహేష్‌బాబు, త్రిషతో ఒక డైలాగ్ చెబుతాడు. చంద్రుడు రోజూ అలాగే కనబడతాడు… కానీ దాన్ని గుర్తించే స్థితిలో తాను లేనని. అలాగే ఆహా, అద్భుతం…అనే ఫీలింగ్స్ ఎలాగైతే ఆరోగ్యాన్ని ఇస్తాయో, ముందు ఆ ఫీలింగ్స్ ని అనుభూతి చెందడానికి మనం కూడా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. అంటే మనలో జిజ్ఞాస, కుతూహలం, ఆశావహ దృక్పథం, అందాన్ని ఆస్వాదించే శక్తి చిన్నతనంలో లాగానే సజీవంగా ఉండాలన్నమాట. మనకు తెలుసు, వయసు పెరుగుతున్న కొద్దీ మనలో ఈ లక్షణాలు తగ్గిపోతుంటాయి. ఎంత అందమైన, అద్భుతమైన దృశ్యం కనిపించినా ఆ…ఏముందిలే… అనే స్థాయికి చేరితే మనలో ఎంతో కొంత మానసిక జడత్వం, నిరాశా నిస్పృహలు, మొదలైనట్టే. స్పందించే గుణం లేకపోయినా, ఇతరులను మెచ్చుకునే, ప్రోత్సహించే లక్షణాలు లోపించినా ఇలాంటి నెగెటివిటీ పెరుగుతుంది. దీంతో వావ్…అనలేరు…ఆ లాభాలనూ పొందలేరు. మొత్తానికి భూమిలాగానే ఇక్కడ ఉన్న చాలా విషయాలు ఇలా సర్కిల్లా ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉండడం..వావ్… ఓ విచిత్రమే!!!!
-వి.దుర్గాంబ