బౌద్ధం " ప్రమాణాలు (Devotional)
ఇప్పటి దాకా మనం చర్చించుకొన్న ప్రమాణాల్లో బౌద్ధం కేవలం రెండే రెండు ప్రమాణాల్ని అంగీకరించింది. అవి 1. ప్రత్యక్షం, 2.అనుమానం. ఈ రెండు ప్రమాణాల్లో కూడా ప్రత్యక్షాన్నే బౌద్ధం ప్రధానంగా ఎంచుకుంది. ఈ ప్రత్యక్షంలో కూడా ఉన్న దోషాల్ని తొలగించుకొని, యోగి ప్రత్యక్షాన్ని సంస్కరించి- మిగిలిన ప్రత్యక్ష ప్రమాణాన్నే పరమప్రమాణంగా బౌద్ధం ఎంచింది. ఇక, శబ్ద ప్రమాణాన్నైతే బుద్ధుడు తీవ్రంగా తిరస్కరించాడు. అంటే…. వేదాల్ని, వేదప్రమాణాన్ని తిరస్కరించాడు. కాబట్టి వేదాన్ని కాదన్నవాడు నాస్తికుడు కాబట్టి (నాస్తికో వేదనిందః) […]
ఇప్పటి దాకా మనం చర్చించుకొన్న ప్రమాణాల్లో బౌద్ధం కేవలం రెండే రెండు ప్రమాణాల్ని అంగీకరించింది. అవి 1. ప్రత్యక్షం, 2.అనుమానం.
ఈ రెండు ప్రమాణాల్లో కూడా ప్రత్యక్షాన్నే బౌద్ధం ప్రధానంగా ఎంచుకుంది. ఈ ప్రత్యక్షంలో కూడా ఉన్న దోషాల్ని తొలగించుకొని, యోగి ప్రత్యక్షాన్ని సంస్కరించి- మిగిలిన ప్రత్యక్ష ప్రమాణాన్నే పరమప్రమాణంగా బౌద్ధం ఎంచింది.
ఇక, శబ్ద ప్రమాణాన్నైతే బుద్ధుడు తీవ్రంగా తిరస్కరించాడు.
అంటే….
వేదాల్ని, వేదప్రమాణాన్ని తిరస్కరించాడు. కాబట్టి వేదాన్ని కాదన్నవాడు నాస్తికుడు కాబట్టి (నాస్తికో వేదనిందః) బుద్ధుణ్ణి కూడా నాస్తికుడనే అంటారు. బౌద్ధాన్ని నాస్తి దర్శనాల్లో ఒక దర్శనంగా చేర్చారు.- బుద్ధుడు ఎందుకు శబ్ద ప్రమాణాన్ని తిరస్కరించాడు? ఈ ప్రశ్న – బుద్ధుడు వేదాన్నే కాదు- ఏ శబ్ద ప్రమాణాన్నైనా తిరస్కరించాడు. ఎందుకంటే.. అలా తిరస్కరించడం ప్రతీత్య సముత్పాదంలో ఒక భాగమే.
వేదం కానీండి, బైబిల్ కానీండి, ఖురాన్ కానీండి, ఇతర ఏ మతగ్రంథమైనా కానీండి, అవి కొన్ని నియమాల్ని, నీతుల్ని ప్రమాణాలుగా బోధించాయి. ఆ బోధనలు ఏదో ఒక కాలానికి చెందినవి మాత్రమే. కాలం మారుతోంది. సంస్కృతీ, నాగరికతలూ జీవవిధానాలూ మారతాయి. కానీ ఆ గ్రంథాలు మారవు. నాగరికతా వికాసానికి అవి ప్రతిబంధకాలవుతాయి.
ఉదాహరణకి…
వేదాల్నే తీసుకుందాం. వేదాల నిండా యజ్ఞయాగాది క్రియలు ఉన్నాయి. ఎంతో హింస ఉంది. ఒక్కో యాగంలో వేలాది పశువుల్ని (ముఖ్యంగా ఆవుల్ని) చంపడం ఉంది. దాన్ని ఈ రోజున ఎవరైనా ఒక దైవకార్యంగా, పుణ్యకార్యంగా చేయగలమా?
రెండోది: రామాయణంలో చదువుకొంటున్న శూద్ర శంబుకుణ్ణి శ్రీరాముడు స్వయానా శిరచ్ఛేదం చేశాడు. ధర్మాన్ని కాపాడాడని రాముణ్ణి మునులు, బ్రాహ్మలు తెగపొగిడారు. ఈ రోజున ఆ నియమాన్ని పాటించగలమా? చదువుకునే శూద్రుల్ని, పంచముల్ని తలలు నరగ్గలమా? కనీసం ఆ పేరు చెప్పి బడికి రాకుండా చేయగలమా?
ఇలాగే..
ఇతర మత గ్రంథాల్లోని విషయాలు కూడా. ముస్లిం సంప్రదాయ వాదులు ఎంత ఆక్రోశించినా స్త్రీ విద్యను, స్త్రీ స్వేచ్ఛను ఆపగలరా? హరించగలరా? హరించడాన్ని ధర్మంగా భావించగలరా?- లేదు కదా! పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి ముస్లిం దేశాల్లో స్త్రీలుకూడా పరిపాలించే స్థాయికి ఎదిగారు….
అంటే…
కాలం మారుతోంది. మార్పు అనివార్యం అవుతుంది. అసలు బౌద్ధం చెప్పిన ప్రతీత్య సముత్పాదమంటేనే ‘మార్పు’ కదా! ఈ ప్రపంచం నిరంతరం మారుతుంది. మార్పే దీని ఉనికి. అని చెప్పిన బుద్ధుడు ఎప్పటికీ మారని, మారకూడదని చెప్పే వేద ప్రమాణాన్ని ఎలా అంగీకరిస్తాడు. నిజం చెప్పాలంటే ఇది వేదాలమీద వ్యతిరేకత, ద్వేషం కాదు- ప్రతీత్య సముత్పాదం పట్ల ఉన్న నమ్మకం. మార్పు అనివార్యం అనే దృక్పథం. నూతన విధానాన్ని ఆహ్వానించడం.
”బాగానే ఉంది- ఇతర, గ్రంథ ప్రమాణాన్ని తిరస్కరించాడు, మరి ఆయన చెప్పిన మాటల్నే నమ్మమన్నాడా?” అంటారు కొందరు. నిజానికి ఇది సరైన ప్రశ్న. అడగాల్సిన ప్రశ్న- దీనికి బుద్ధుడు ఏం చెప్పాడో చూద్దాం.
”ఏ గ్రంథ ప్రమాణాన్నీ ప్రమాణంగా స్వీకరించ వద్దు. ఏ గ్రంథంలో ఉందనో, ఎవరో ఒక గొప్ప వ్యక్తి చెప్పాడనో, ఏ గురువు బోధించాడనో నమ్మవద్దు. చివరికి నేను చెప్పానని కూడా విశ్వసించవద్దు. మీ అనుభవానికి అందని దాన్ని భుజాన వేసుకోవద్దు. మీ జ్ఞానానికీ, అనుభవానికీ అందేదాన్నే విశ్వసించండి”- అన్నాడు.
బహుశా..
ఈ ప్రపంచంలో బుద్ధుడు తప్ప మరే ప్రవక్తా, లేదా మరే తత్త్వవేత్తా ఇలా నిర్భీతిగా, నిజాయితీగా చెప్పలేదు.
– బొర్రా గోవర్థన్