చేతనతో చేసేదే కర్మ (Devotional)
ఒక పని జరగడం వెనుక ఒక ఆలోచన ఉంటుంది. కానీ, మన ప్రమేయం లేకుండా కూడా కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. చేయాలనే ఉద్దేశ్యం లేకుండా జరిగే క్రియలు కర్మలు కావు. వాటికి ‘కర్మ ఫలాల్ని’ అంటించ కూడదు. అంటే ఆ కర్మల్ని మంచి కర్మలనీ, చెడ్డ కర్మలన్నీ అనకూడదు. చేతనతో లేదా ఉద్దేశ్యంతో చేసే కర్మలే కర్మలు- దీనికి బౌద్ధంలో ఒక కథ ఉంది…. ఒక విహారంలో గ్రుడ్డివాడైన ఒక భిక్షువు ఉంటాడు. అతను ఒక […]
ఒక పని జరగడం వెనుక ఒక ఆలోచన ఉంటుంది. కానీ, మన ప్రమేయం లేకుండా కూడా కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. చేయాలనే ఉద్దేశ్యం లేకుండా జరిగే క్రియలు కర్మలు కావు. వాటికి ‘కర్మ ఫలాల్ని’ అంటించ కూడదు. అంటే ఆ కర్మల్ని మంచి కర్మలనీ, చెడ్డ కర్మలన్నీ అనకూడదు.
చేతనతో లేదా ఉద్దేశ్యంతో చేసే కర్మలే కర్మలు- దీనికి బౌద్ధంలో ఒక కథ ఉంది….
ఒక విహారంలో గ్రుడ్డివాడైన ఒక భిక్షువు ఉంటాడు. అతను ఒక సాయంత్రం ఆరుబైట నడుస్తూ ఉంటాడు. అతని కాళ్ళక్రింద పడి కొన్ని కీటకాలు చనిపోతూ ఉంటాయి. ‘బౌద్ధ భిక్షువులు దిక్కులు చూస్తూ, నిర్లక్ష్యంగా నడవ కూడదు. తెలిసి తెలిసీ కీటకాల్ని కూడా చంపకూడదు’ అనేది ఒక భిక్షు నియమం. ఆ గుడ్డి భిక్షువు వలన కీటకాలు చనిపోవడం చూసిన మరో భిక్షువు, బుద్ధుని దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్తాడు.
అప్పుడు బుద్ధుడు…
”ఇది అతను తెలిసి చేసినది కాదు కదా! కాబట్టి ఆ జీవుల్ని చంపిన పాపఫలం అతనికి అంటదు. అది అకుశల కర్మ కాదు” అని చెప్తాడు.
మన నిత్య జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనకు తెలియకుండా జరిగే ఇలాంటి సంఘటనల్లో ”సారీ! చూల్లేదు” అని అంటాం. అవతలి వారు కూడా ”సరే! ఫరవాలేదు” అని చిరునవ్వుతోనే క్షమించేస్తారు.
అయితే ఇలాంటి వాటిక్కూడా ”తగాదాలు పెట్టుకునేవారూ ఉంటారు”- అయితే, వారి శాతం చాలా తక్కువే. మన భారతీయ శిక్షా స్మృతి(ఐ.పి.సి.) కూడా తెలియక చేసినదాన్ని తప్పు అని, తెలిసి చేసిన తప్పుని నేరమని నిర్వచిస్తుంది.
తెలియక చేసిన తప్పుల్ని క్షమించడం మానవనైజం. అంటే బుద్ధుడు చెప్పిన కర్మఫలం అనేది మానవీయ కోణంలోంచి చూడాల్సిన ఒక సహజప్రక్రియే. మానవుల్లోని సహజాతమైన ప్రేమను మేల్కొల్పే ధర్మమే బౌద్ధుల కర్మవాదం.
– బొర్రా గోవర్థన్