కర్మ-వ్యక్తిగతం (Devotional)
బౌద్ధం ప్రధానంగా నైతికశాస్త్రం. శుద్ధ విజ్ఞానశాస్త్రం కాదు. కేవలం భౌతికశాస్త్రం కాదు. మానవుల్ని దుఃఖాన్నుండి బైటపడేయటానికి ఉపక్రమించిన ఒక మానవీయ సిద్ధాంతం. బౌద్ధం దేన్ని చెప్పినా, దాన్ని మానవుని మనుగడతో ముడిపెట్టే చెప్తుంది. నైతిక భూమిక లేని ఏ విధానాన్ని అది బోధించదు. ఎందుకంటే బౌద్ధానికి మానవుడే కేంద్రం. మానవత్వమే పునాది. దీన్ని కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతంతో పోల్చవచ్చు. ఈ విశ్వానికి భూమే కేంద్రం అన్నాడు టాలెమీ. ఆయనకి ఈ భూమి చుట్టూ విశ్వమంతా తిరుగుతున్నట్లు అనిపించింది. […]
బౌద్ధం ప్రధానంగా నైతికశాస్త్రం. శుద్ధ విజ్ఞానశాస్త్రం కాదు. కేవలం భౌతికశాస్త్రం కాదు. మానవుల్ని దుఃఖాన్నుండి బైటపడేయటానికి ఉపక్రమించిన ఒక మానవీయ సిద్ధాంతం.
బౌద్ధం దేన్ని చెప్పినా, దాన్ని మానవుని మనుగడతో ముడిపెట్టే చెప్తుంది. నైతిక భూమిక లేని ఏ విధానాన్ని అది బోధించదు. ఎందుకంటే బౌద్ధానికి మానవుడే కేంద్రం. మానవత్వమే పునాది.
దీన్ని కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతంతో పోల్చవచ్చు.
ఈ విశ్వానికి భూమే కేంద్రం అన్నాడు టాలెమీ. ఆయనకి ఈ భూమి చుట్టూ విశ్వమంతా తిరుగుతున్నట్లు అనిపించింది. కానీ నిజానికి భూమే సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ సత్యాన్ని కోపర్నికస్ గ్రహించాడు.
అలాగే…
”దేవుడే మనిషిని చేశాడు” అని ఈశ్వరవాదుల నమ్మకం. వారికి ఈ విశ్వానికి దేవుడే కేంద్రం. కానీ మనిషే దేవుణ్ణి సృష్టించాడు. మనిషే మానవ జీవనానికి కేంద్రం అంది బౌద్ధం. అంటే..
దైవ కేంద్ర సిద్ధాంతాన్ని కాదని మానవ కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బౌద్ధం.
విజ్ఞాన శాస్త్రంలో మన దగ్గరున్న భూమి తన కేంద్రస్థానాన్ని పోగొట్టుకుంది. విశ్వ కేంద్ర స్థానం చాలా దూరానికి పోయింది. కాని, నైతిక శాస్త్రంలో దూరంగా ఉన్న దైవకేంద్రం పోయి, ‘మానవ కేంద్రం’ ముందుకొచ్చింది.
అందుకే బౌద్ధం తన ధర్మంలో మనిషికి, మనసుకి, నైతికతకి పెద్ద పీటవేసింది.
కాబట్టి బౌద్ధంలోని కర్మ సిద్ధాంతం ‘వ్యక్తిగత బాధ్యతను’ బోధిస్తుంది.
దూరంగా ఉన్న దైవానికి పూజలు, బలులు, పునస్కారాలు చేస్తే ‘మంచి’ జరగదు. నీ కర్మల వల్లే నీకు మంచి జరుగుతుంది. అని మనిషిని జవాబుదారీ చేస్తుంది. పలాయనవాదిగా మార్చదు.
మంచి విత్తనం మంచి వృక్షాన్నిచ్చినట్లు, మంచి ‘కర్మ’ మంచి ఫలితాన్నిస్తుంది. నీ మంచికీ, చెడుకూ నీవే కారణం అని మనిషిని తీర్చిదిద్దుతుంది.
మనిషి కర్మలకీ, మనిషి ప్రయత్నాలకీ బౌద్ధం విలువ కట్టినంతగా మరే తాత్త్విక ధర్మం విలువ కట్టలేదు.
– బొర్రా గోవర్థన్