బాబు స్ర్కిప్ట్ ప్రకారమే పవన్ యాక్షన్... ఎలాగంటే..?
జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాలలో జరిపిన ఒక రోజు పర్యటన, ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై రకరకాల విశ్లేషణలు, వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. భూసేకరణపై ఆయన టీట్లు, రైతులకు మద్దతుగా ఆయన చేస్తున్న కామెంట్లు చూసి ఇంకేముంది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు, పవన్‌కల్యాణ్‌కు మధ్య పెద్ద అగాథం ఏర్పడిపోయిందని, వారి ఫ్రెండ్‌షిప్ చెడిపోయినట్లేనని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే తాను చంద్రబాబును విమర్శించడానికి ఇక్కడకు రాలేదని పవన్ […]
BY sarvi24 Aug 2015 6:18 AM IST
X
sarvi Updated On: 26 Aug 2015 4:58 AM IST
జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాలలో జరిపిన ఒక రోజు పర్యటన, ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై రకరకాల విశ్లేషణలు, వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. భూసేకరణపై ఆయన టీట్లు, రైతులకు మద్దతుగా ఆయన చేస్తున్న కామెంట్లు చూసి ఇంకేముంది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు, పవన్‌కల్యాణ్‌కు మధ్య పెద్ద అగాథం ఏర్పడిపోయిందని, వారి ఫ్రెండ్‌షిప్ చెడిపోయినట్లేనని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే తాను చంద్రబాబును విమర్శించడానికి ఇక్కడకు రాలేదని పవన్ చాలా స్పష్టంగా చెప్పాడు. చంద్రబాబుతో గొడవపెట్టుకోవడానికి తాను ఇక్కడకు రాలేదని పవన్ అందరికీ అర్ధమయ్యే భాషలోనే చెప్పాడు. నిజానికి చంద్రబాబు పంపిస్తేనే సినిమా బిజీ షెడ్యూలును పక్కనపెట్టి మరీ అక్కడకు వచ్చాడు. తండ్రిలాంటి అన్నగారిని వ్యతిరేకించి మరీ రాజకీయాలలోకి వచ్చానంటున్న పవన్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా తీరికలేనంత బిజీ. అభిమానుల సభలో జరిగిన గలభాను దృష్టిలో పెట్టుకుని సాయంత్రానికి వెళ్లి అన్నను కలిశాడనుకోండి.. అది వేరే కథ. మరి అలాంటి బీజీ నెస్ హీరో రాజధాని గ్రామాలకు ఎందుకు వచ్చాడు? భూసేకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? భూసేకరణ ఆర్డినెన్స్‌లో కొత్తగా చేర్చిన అనేక అంశాలలో రైతుల నుంచి భూమిని బలవంతంగా లాక్కునేందుకు వీలుకల్పించే సెక్షన్లు ఉన్నా మూడు పంటలు పండే భూములను రైతుల అనుమతి లేకుండా తీసుకోవడానికి వీల్లేదు. అసలు పంటలు పండే భూమిని సేకరించడానికి అవకాశమే లేదు. అందుకే పవన్ భూసేకరణ వద్దు.. భూ సమీకరణ ద్వారా రైతులను ఒప్పించి భూములు సమీకరించండి అని సూచిస్తున్నాడు. అంటే ఆయన చంద్రబాబు ప్రతినిధిగానే అక్కడకు వచ్చాడని అర్ధం కావడం లేదూ? సమీకరణకు రైతులను మానసికంగా సిద్ధం చేస్తే చంద్రబాబు పని సులువయి పోతుంది. మిగిలిన ఐదువేల ఎకరాలను కూడా కైంకర్యం చేసేయొచ్చు. అందుకే పవన్‌ను చంద్రబాబు రంగంలోకి దించాడని అర్ధం చేసుకోవాలి. ఇక మంత్రులు రావెల, ప్రతిపాటి, నారాయణలపై పవన్ కల్యాణ్ విమర్శలు, మురళీ మోహన్ భూముల గురించి ప్రస్తావన వంటి వన్నీ డ్రామాను రక్తి కట్టించేందుకు సాగిన ప్రయత్నాలు. రైతుల వద్ద మార్కులు కొట్టేయడం కోసం ప్రయాస అన్నమాట. పవన్‌కు దెబ్బ తగలకుండా ఒక రాయి విసరడం కోసం అక్కడ ఒక చౌదరిని కూడా నియోగించారు. అతనా పనిని చక్కగా నిర్వర్తించాడు. ఆ రాయిని పట్టుకుని పవన్ రైతులతో మాట్లాడుతుండగా బాబుగారి బాకా పత్రికలు, చానళ్లు కెమెరాలను క్లిక్‌మనిపించాయి.. రోజంతా ఊదరగొట్టాయి. పవన్‌కు కావలసినంత మైలేజీ. జనం చెవిలో క్యాబేజీ. బలప్రయోగంతో భూసేకరణను అమలు చేయాల్సి వస్తే చంద్రబాబు ప్రభుత్వానికి అప్రతిష్ట. ఆ ఇబ్బంది లేకుండా భూములు ఇప్పించేందుకు పవన్‌ను రంగంలోకి దించారు. అంటే నొప్పి తెలియకుండా మత్తిచ్చి మన అవయవాలను కోసి తీసేసుకుంటారన్నమాట. మత్తు డాక్టర్ ఇచ్చిన మత్తు దిగాక గానీ మన నొప్పి మనకు తెలియదు. పవన్ కల్యాణ్ ఇపుడు మత్తుడాక్టర్ పని సమర్థవంతంగా పోషిస్తున్నాడు. రాజధాని రైతులకు నొప్పి తెలియాలంటే కొద్దికాలం ఆగాలి. అందుకని పవన్ కల్యాణ్ తాజా పర్యటన ఎపిసోడ్ అంతా చంద్రబాబు నాయుడు తయారు చేసి ఇచ్చిన స్ర్కిప్ట్ ప్రకారమే సాగిపోయిందని అర్ధం కావడంలేదూ….? స్టార్ట్… కెమెరా… యాక్షన్ .. కట్ అంతా అనుకున్నట్లుగానే జరిగిపోయింది. రైతులకు పవన్ టోపీ… చంద్రబాబు హ్యాపీ…
– తోట సతీష్
Next Story