ఏపీకి ద్రోహం చేసింది బీజేపీయే: ఉండవల్లి
తాను రాష్ట్రానికి వస్తున్నాను కాబట్టే ఏపీకి తానొచ్చిన ప్రతిసారీ ఏదో ఒక ప్రాజెక్టు తెస్తున్నానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన ప్రకటనను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ తీవ్రంగా విమర్శించారు. అసలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ దుస్థితిలో ఉండడానికి కారణమే భారతీయ జనతాపార్టీ అని, అందులో వెంకయ్యనాయుడి పాత్ర కూడా ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఏ తీర్మానం చేసిందో… ఏ చట్టమైతే చేసిందో దాన్ని అమలు చేయడానికే కేంద్ర ప్రభుత్వానికి చేతులు రావడం లేదని […]
BY sarvi24 Aug 2015 10:53 AM IST
X
sarvi Updated On: 24 Aug 2015 2:32 PM IST
తాను రాష్ట్రానికి వస్తున్నాను కాబట్టే ఏపీకి తానొచ్చిన ప్రతిసారీ ఏదో ఒక ప్రాజెక్టు తెస్తున్నానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన ప్రకటనను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ తీవ్రంగా విమర్శించారు. అసలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ దుస్థితిలో ఉండడానికి కారణమే భారతీయ జనతాపార్టీ అని, అందులో వెంకయ్యనాయుడి పాత్ర కూడా ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఏ తీర్మానం చేసిందో… ఏ చట్టమైతే చేసిందో దాన్ని అమలు చేయడానికే కేంద్ర ప్రభుత్వానికి చేతులు రావడం లేదని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదాకు ఏ కమిటీ కూడా ఒప్పుకోలేదన్నారు. మరి రాష్ట్ర విభజనకు ఏకమిటీ ఒప్పుకుందని ఉండవల్లి ప్రశ్నించారు. విభజనకు రాని అడ్డంకి ప్రత్యేక హోదాకు ఎందుకొచ్చిందని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అఘాయిత్యం చేస్తే భారతీయ జనతాపార్టీ ద్రోహం చేసిందని ఆయన చెప్పారు. బీజేపీ మద్దతుతోనే ఏపీ గొంతు కోశారని ఆయన అన్నారు.నాటి యూపీఏ ప్రభుత్వం ఏపీ నష్టపోయిన ప్రతిపైసా కేంద్రం నుంచి గ్రాంటుల రూపంలో అందించాలని చట్టం చేసిందని, దాన్ని అమలు చేయడం కూడా ఎన్డీయే ప్రభుత్వానికి చేతకావడం లేదని ఉండవల్లి విమర్శించారు. ఇప్పటివరకు కేంద్రం గ్రాంటుల రూపంలో ఇచ్చింది కేవలం రూ. 2500 కోట్లు మాత్రమేనని, అంతకుమించి ఒక్కపైసా కూడా ఇవ్వలేదని ఉండవల్లి తెలిపారు.
ప్రత్యేక హోదాతో సహా అన్ని అంశాలు కాంగ్రెస్ ఏపీకి చేకూర్చినవేనని వాటిని అమలు చేయడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారని ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ప్రస్తావన వచ్చినప్పుడు కాంగ్రెస్ ఐదేళ్ళు అంటే కాదు పదేళ్ళు ఉండాల్సిందేనని వెంకయ్యనాయుడు డిమాండు చేశారని, ఆ ఒక్క అంశం తప్ప ఆయన ఇంకేమీ డిమాండు చేయలేదని… మొత్తం అంతా తానే చేసినట్టు చెబుతున్నారని ఉండవల్లి విమర్శించారు. వెంకయ్యనాయుడు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఏమయిపోయేదోనని ప్రధాని మోడి ఆంధ్రలో జరిగిన బహిరంగసభలో అన్నారని, అవే మాటలు ఇపుడు వెంకయ్య కూడా పలుకుతున్నారని అన్నారు. అసలు వెంకయ్య కాంగ్రెస్ చేసింది అమలు చేయించడం తప్ప ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఏపీ అడ్డంగా విడిపోవడానికి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీజేపీయే కారణమని, నిజానికి ఆనాడు చిరంజీవి, సుజనాచౌదరి, సీఎం రమేష్‌లు అందరూ రాష్ట్ర విభజనపై విభేదించారని, రాజ్యసభలో నిలదీశారని కానీ బీజేపీ ఒక్కటే రాష్ట్ర విడిపోవడానికి కారణమైందని ఉండవల్లి గుర్తు చేశారు. ఇదేంటి తలుపులు మూసేశారు అని ఓ అమాయక ఎంపీ ప్రశ్నిస్తే… ‘నీకు తెలీదులే కూర్చో’ అంటూ నోరుమూయించారని, ఇవన్నీ రికార్డుల్లో ఉంటాయని గుర్తు చేశారు. లొక్‌సభలో తలుపులు మూసి తీర్మానం చేయడానికి, ఒక వ్యూహం ప్రకారం సుష్మా స్వరాజ్‌ను మాట్లాడేట్టుగా చేయడానికి కారణం బీజేపీ పార్టీయేనని, ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ విభజన కుదరదంటే తీర్మానం పాసయ్యేదా అని ఉండవల్లి ప్రశ్నించారు.
వెంకయ్యా… నీకిది తగునా
పార్టీల మార్చేవారని విమర్శిస్తూ తాడేపల్లిగూడెం సభలో వేదికమీద ఉన్నవారందరినీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అవమానించారని ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. చొక్కా మార్చేవారా నన్ను విమర్శించేది అని వెంకయ్య వేదిక మీద నుంచి ప్రశ్నించి ఆ సభలో ఉన్న వారందరినీ అవమాన పరిచారని ఉండవల్లి అన్నారు. ఒక్క వెంకయ్యనాయుడు, మంత్రి మాణిక్యాలరావు తప్ప అనాడు వేదిక మీదున్న పెద్దలంతా పార్టీలు మారిన వారేనని అన్నారు. చంద్రబాబునాయుడు, కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, రాయపాటి సాంబశివరావు, మాగంటి బాబు… ఇలా వీరంతా పార్టీలు మారి తెలుగుదేశంలోకి వచ్చారని, వారంతా వెంకయ్య మాటలు విని చిన్నబోయారని, వేదికపై ఉన్న వారిని వెంకయ్యనాయుడు వంటి సీనియర్ నేత ఇలా అవమానించవచ్చా అని ప్రశ్నించారు. పార్టీలు మారకూడదని రాజ్యాంగం ఎక్కడైనా చెప్పిందా… అదేమన్నా నేరమా అని నిలదీశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ప్రధాని మోడి అపాయింట్‌మెంట్ ఇవ్వడం ఏపీకి మంచిరోజులు రావడానికి సంకేతంగా తాను ఆశిస్తానని, ఇప్పటికైనా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు మేలు చేసేలా వ్యవహరించాలని ఆయన డిమాండు చేశారు. మోడిని కలిసిన తర్వాత ఆయన రాష్ట్రానికి మంచి మాటలు మోసుకొస్తారని భావిస్తున్నానని ఉండవల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళుతున్న చంద్రబాబుకు ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Next Story