Telugu Global
Family

నల్లనయ్య (For Children)

కాశ్మీర్‌లో ఒక ప్రాంతానికి చెందిన రాజకుమారుడు తమ సరిహద్దు రాజ్యానికి చెందిన రాజకుమారిని పెళ్ళిచేసుకోవాలనుకున్నాడు. కారణం ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆ రాజకుమారుడు ”నువ్వు నన్ను పెళ్ళాడి నా రాజ్యానికి రాణిగా వస్తావా!” అని అడిగాడు. ఆ రాజకుమారి ఒప్పుకుంది. కానీ ఒక చిత్రమైన మాట చెప్పింది. ‘నేనెప్పుడూ నీలాంటి వాణ్ణే పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాను కానీ ఒకరోజు నాకొడుకు నీ కూతుర్ని పెళ్ళిచేసుకుంటాడు’ అంది. రాజు ఈ మాటల్ని అర్థం చేసుకోవడానికి అంతగా ఆలోచించలేదు. […]

కాశ్మీర్‌లో ఒక ప్రాంతానికి చెందిన రాజకుమారుడు తమ సరిహద్దు రాజ్యానికి చెందిన రాజకుమారిని పెళ్ళిచేసుకోవాలనుకున్నాడు. కారణం ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆ రాజకుమారుడు ”నువ్వు నన్ను పెళ్ళాడి నా రాజ్యానికి రాణిగా వస్తావా!” అని అడిగాడు.

ఆ రాజకుమారి ఒప్పుకుంది. కానీ ఒక చిత్రమైన మాట చెప్పింది. ‘నేనెప్పుడూ నీలాంటి వాణ్ణే పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాను కానీ ఒకరోజు నాకొడుకు నీ కూతుర్ని పెళ్ళిచేసుకుంటాడు’ అంది.

రాజు ఈ మాటల్ని అర్థం చేసుకోవడానికి అంతగా ఆలోచించలేదు. ఆ మాటలకు అర్థం లేదనుకున్నాడు. అతను రాజకుమారిని పెళ్లాడి కొన్నాళ్ళకు తన రాజధానికి చేరాడు.కానీ తన రాజధానిలో అడుగుపెట్టిన మరుక్షణం ఆమెని కలవడం మానేశాడు. పట్టించుకోలేదు. కొన్నాళ్ళు చూసి ఆమె తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయింది.

కొద్దిరోజులు గడిచాయి. రాజు తిరిగి రాలేదు. రాజకుమారి ఒక అందమైన కుర్రాడికి జన్మనిచ్చింది. అతను కొద్దిగా నలుపుగా ఉండడంతో నల్లనయ్య అని పేరు పెట్టింది. చిన్నప్పటినించీ రాజోచితమైన విలువిద్య, కత్తిసాము వంటి విద్యల్లో ప్రావీణ్యం సంపాదించాడు. రాణి తనదేశంలో ప్రసిద్ధుడయిన గజదొంగను పిలిపించి దొంగతనంలోని మెలకువలన్నీ కొడుక్కి నేర్పించింది. కొడుకు ఎందుకివన్నీ? అన్నాడు. సమయం వచ్చినపుడు చెబుతాను అంది.

కొన్నాళ్ళ తరువాత ఆమె కొడుకుకు దగ్గర కూచోబెట్టుకుని ‘నాయనా! మీ నాన్న పెళ్ళయిన కొన్ని మాసాలకే నన్ను వదిలేశాడు. దానికి ప్రతిఫలం అతను అనుభవించాలి. నువ్వు నీ ప్రతిభతో అతని దగ్గర చేరి నీ దొంగతనాలతో రాజ్యాన్ని అల్లకల్లోలం చెయ్యాలి. చివరికి రాజే. అమ్మా! ఈ దొంగ ఎవడో దొరికితే అతనికి నా కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తాడని తన నోటిగుండా అనాలి. కానీ నువ్వు ఆ అవకాశం వచ్చినపుడు తిరస్కరించాలి. ఆ సమయం వచ్చినపుడు నాకు ఆ వార్తని పంపి నా రాకకోసం ఎదురుచూడు! అంది. ‘నల్లనయ్య’ రాజు నగరానికి వెళ్ళి అక్కడి ఉన్నతాధికారుల్ని మంచి చేసుకుని మెల్లగా ఆ స్థానంలో అడుగుపెట్టి అందరికీ మంచివాడయ్యాడు. మెల్లగా రాత్రిళ్ళు దొంగతనాలు చేస్తూ ఉదయం తాజాగా రాజాస్థానంలో కనిపించేవాడు. చాలా సంపన్నుల ఇళ్ళల్లో సాహసవంతమైన దొంగతనాలు చేశాడు. ఈ దొంగతనాలతో చాలా ఆందోళన చెందిన రాజు తన సైనికాధికారుల్ని సమావేశపరిచి వాళ్ళని తీవ్రంగా హెచ్చరించి అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బంధించాలని ఆదేశించాడు.

ప్రధాన సైనికాధికారే రంగంలోకి దిగాడు. రాత్రిళ్లు నగరంలో పర్యటించాడు. నగర సరిహద్దుల్లో అతను తిరుగుతూ ఉంటే ఒక గుడ్డిదీపం వెలుగులో ఒక స్త్రీ మొక్కల పిండిని రుబ్బడం కనిపించింది. సైనికాధికారి ఆమె దగ్గరికి వెళ్ళి ‘ ఈ రాత్రి పూట ఎందుకు మొక్కజొన్నల్ని రుబ్బుతున్నావు’ అన్నాడు.

‘అయ్యా! నా బిడ్డ ఆరోగ్యం బాగా లేకపోవడంతో వాడు మేలుకొని ఉంటే ఏపనీ చెయ్యలేను. ఇది వాడు నిద్రపోయే సమయం. అందుకని పిండి రుబ్బుతున్నా’ అన్నది.

‘ఈ దారంట ఎవరయినా వెళ్ళడం చూశావా?’ అన్నాడు.

ఆమె ‘అయ్యా! మీరేమయినా అతన్ని చూశారా? నిన్న రాత్రి నా గుడిసెలోకి జొరబడి దోచుకునిపోయాడు. బహుశా ఈరోజు కూడా వస్తాడని అనుకుంటున్నా’ అన్నది.

‘ఐతే అతను వచ్చేదాకా నేను ఎదురుచూసిపట్టుకుంటాను’ అన్నాడు.

ఆమె ‘అయ్యా! ఒక విషయం చెబుతాను. మీరు ఈ బట్టల్లో ఉంటే అతను మిమ్మల్ని చూసి తప్పించుకుని పారిపోయే వీలుంది. మీరు నా బట్టలు వేసుకుని నా స్థానంలో కూచుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి’ అంది.

ఆమె మాటలు సైనికాధికారికి నచ్చాయి. ఆమె బట్టలు వేసుకుని మొక్కజొన్నలు రుబ్బుతున్నట్లు కూచున్నాడు.

మరుసటి రోజు ఉదయం నగరంలో మరిన్ని ఇళ్ళల్లో దొంగతనం జరిగినట్లు, ప్రధాన సైనికాధికారి ఇంట్లో భారీ చోరీ జరిగినట్లు సైనికాధికారి చీరకట్టి నగర పొలిమేరలో మొక్కజొన్నల పిండి రుబ్బుతూ కనిపించినట్లు వార్త అందరికీ తెలిసింది.

తరువాత ప్రధానమంత్రి ఇంట్లో దొంగతనం జరిగింది. ఇక మిగిలింది రాజు ఇంట్లో. చివరికి దొంగ తనంతట తనే ముందుకు వచ్చి దొంగతనం మానేస్తానంటే తనకూతుర్ని ఇచ్చి పెళ్ళి చేస్తానని రాజు ప్రకటించాడు.

మరుసటి రోజు రాజభవనం ముందు జనం గుంపులుగా చేరారు. దొంగ తప్పక వస్తాడని ఎదురుచూశారు. జనంలోని నల్లనయ్య రాజు ముందుకు వచ్చి “రాజా! నేను ఈ దొంగతనాలు చేసింది” అని దొంగతనం చేసినవన్నీ వివరించాడు. రాజు అతను ఒప్పుకున్నందుకు సంతోషించి తనకూతుర్ని భార్యగా ఇస్తానన్నాడు. అప్పుడు నల్లనయ్య! ‘మా అమ్మని పిలిపిస్తాను. ఆమె సలహా ఇస్తుంది’ అన్నాడు. రాణి అక్కడకి వచ్చింది. రాజు గుర్తించలేదు. ఆమె ‘నా కుమారుడు నీ కుమార్తెను పెళ్ళిచేసుకోడు. ఎందుకంటే అన్న చెల్లెల్ని పెళ్ళిచేసుకోడు కదా!’ అంది.

రాజుకు అర్థం కాలేదు. తను రాజునుపెళ్ళి చేసుకునే ముందు కోరిక వెల్లడించడం, రాజు తనని నిర్లక్ష్యం చెయ్యడం, తన నగరానికి తిరిగి వెళ్ళడం, కొడుకును పెంచి పెద్దచెయ్యడం అన్నీ రాణి వివరించింది. రాజు పశ్చాత్తాపంతో రాణిని క్షమాపణలు కోరాడు. నల్లనయ్యను తన వారసుడుగా ప్రకటించాడు.

– సౌభాగ్య

First Published:  21 Aug 2015 6:32 PM IST
Next Story