Telugu Global
Family

మొదట నేను (Devotional)

ఆ నగరంలో ఒక సమావేశమందిరం ఉంది. అక్కడ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనునిత్యం జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఒక సుప్రసిద్ధుడయిన ఆధ్యాత్మిక వేత్త ఆ సమావేశ మందిరంలో దైవం యొక్క గొప్పదనాన్ని గురించి ఉపన్యసించాడు. మముక్షువులు చాలామంది ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆయన గంటసేపు అనర్ఘళంగా ఉపన్యాసించాడు. అందరూ ఆసక్తిగా విన్నారు. ఆనందించారు. ఉపన్యాస అనంతరం ఆయన “మీరు నేను గంటసేపు చేసిన ఈ ఉపన్యాసం విన్నారు. సంతోషం. కానీ ఎవరికి ఎంతెంత అర్ధమయిందో, […]

ఆ నగరంలో ఒక సమావేశమందిరం ఉంది. అక్కడ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనునిత్యం జరుగుతూ ఉంటాయి.

ఒకసారి ఒక సుప్రసిద్ధుడయిన ఆధ్యాత్మిక వేత్త ఆ సమావేశ మందిరంలో దైవం యొక్క గొప్పదనాన్ని గురించి ఉపన్యసించాడు. మముక్షువులు చాలామంది ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆయన గంటసేపు అనర్ఘళంగా ఉపన్యాసించాడు. అందరూ ఆసక్తిగా విన్నారు. ఆనందించారు.

ఉపన్యాస అనంతరం ఆయన “మీరు నేను గంటసేపు చేసిన ఈ ఉపన్యాసం విన్నారు. సంతోషం. కానీ ఎవరికి ఎంతెంత అర్ధమయిందో, ఏమాత్రం గుర్తుందో అవసరమయినపుడు ఆ విషయాల్లో ఏమి గుర్తు తెచ్చుకుంటారో నాకయితే తెలీదు. అందుకని ఇప్పటిదాకా నేను చెప్పిన దానికి సారాంశంగా సంక్షిప్తంగా మూడు ముక్కలు చెబుతాను. మీరు పేపరు మీద రాసుకోండి. లేదా ఏ చిన్ని కాగితం మీదయినా రాసుకోండి” అన్నాడు. అందరూ కలం, కాగితం తీసుకున్నారు.

ఆ ఆధ్యాత్మిక వేత ఇంతవరకూ నేను ఇచ్చిన ఉపన్యాసం సంక్షిప్త సారాంశం. “మొదట దేవుడు, రెండోది ప్రపంచం, మూడోది నేను”. అంటే మొదటి స్థానం దేవుడిది. జీవితంలో మనం ఎప్పుడూ మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. తరువాత ప్రపంచం. అంటే ఇతరులకు వీలయినంత ఉపకారం చేయాలి. అంటే మనకు చేతనయినంత సాయం చేయాలి. మూడోది నేను. అంటే మనం. మొదట ఆరెండు విషయాలకు ప్రాధాన్యమిచ్చిన తరువాతనే మనకు మనం ఏమయినా చేసుకోవాలి” అని ఆ మూడు మాటల్ని వ్యాఖ్యానించాడు.

అందరి దగ్గరా పెన్ను పేపర్‌ ఉండడంతో అందరూ రాసుకున్నారు. కానీ ఒక వ్యక్తి దగ్గర పెన్ను లేకపోవడంతో రాసుకోలేదు. అయినా మూడు ముక్కలు గుర్తుండవా అనుకుని వాటిని స్మరించాడు. “మొదట దేవుడు, రెండోది ప్రపంచం, మూడోది నేను” ఇలా అనుకుని అరే! నాకు నోటికి వచ్చేసిందని సంబరపడ్డాడు.

అప్పుడు రాత్రి పదిగంటలయింది. అతను దారి వెతుక్కుంటూ ఇంటిముఖం పట్టాడు. ఆ హడావుడిలో మూడు ముక్కలు గుర్తు తెచ్చుకున్నాడు. “మొదట ప్రపంచం, రెండోది దేవుడు, మూడోది నేను” అతను ప్రపంచాన్ని ముందుకు తెచ్చి దేవుణ్ణి రెండోది చేసిన సంగతి మరచిపోయాడు.

దారిలో జనం గుంపు. దాన్ని తప్పించుకుని ఒక సందులోకి వెళ్ళి ఊపిరి పీల్చుకుని మూడు ముక్కల్ని మననం చేశాడు. “మొదట నేను, రెండోది ప్రపంచం, మూడోది దేవుడు”. నేనును మొదటికి తెచ్చి దేవుణ్ణి చివరికి తోసిన సంగతి అతను గుర్తించలేదు.

మనుషులు ఆధ్యాత్మిక విషయాలు విన్నపుడు దాదాపు దేవునికి దగ్గరగా ఉంటారు. నిత్యకృత్యాలలో మునిగితే దేవుడు వెనకబడతాడు. స్వార్ధం ముందుకు వచ్చి “నేను” ముఖ్యమవుతుంది. ఎవరికి వారు మనుషులు ఈ సంగతి గుర్తించాలి.

– సౌభాగ్య

First Published:  21 Aug 2015 6:31 PM IST
Next Story