బ్రాండ్ అంబాసిడర్‌గా...నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్!
రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే మనకు మన జాతీయగీత రచయితగా, గీతాంజలి కవిత్వంతో నోబెల్ సాధించిన గొప్ప సాహితీ వేత్తగా, అద్వితీయమైన దేశభక్తుడిగా మాత్రమే గుర్తొస్తారు. పొడుగైన గడ్డంతో శాంతచిత్తాన్ని ప్రతిబింబించే చూపులతో ఆయన రూపం కూడా అలాగే ఉంటుంది. అలాంటి రవీంద్రనాథ్ ఠాగూర్ సబ్బులు, తలనూనెలకు ప్రచారకునిగా ప్రకటనల్లో కనిపించారంటే నమ్మగలమా…కానీ ఇది నిజం. ఆయన అలాంటి ప్రకటనల్లో కనిపించారు. ఒక్కటి రెండు కాదు, పుస్తకాలు, కాస్మొటిక్స్, స్టేషనరీ, మందులు, ఆహార ఉత్పత్తులు, సంగీత పరికరాలు ఇలా రకరకాల వస్తువులకు ఠాగూర్ ప్రచారం చేశారు. చేశారు […]
రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే మనకు మన జాతీయగీత రచయితగా, గీతాంజలి కవిత్వంతో నోబెల్ సాధించిన గొప్ప సాహితీ వేత్తగా, అద్వితీయమైన దేశభక్తుడిగా మాత్రమే గుర్తొస్తారు. పొడుగైన గడ్డంతో శాంతచిత్తాన్ని ప్రతిబింబించే చూపులతో ఆయన రూపం కూడా అలాగే ఉంటుంది. అలాంటి రవీంద్రనాథ్ ఠాగూర్ సబ్బులు, తలనూనెలకు ప్రచారకునిగా ప్రకటనల్లో కనిపించారంటే నమ్మగలమా…కానీ ఇది నిజం. ఆయన అలాంటి ప్రకటనల్లో కనిపించారు. ఒక్కటి రెండు కాదు, పుస్తకాలు, కాస్మొటిక్స్, స్టేషనరీ, మందులు, ఆహార ఉత్పత్తులు, సంగీత పరికరాలు ఇలా రకరకాల వస్తువులకు ఠాగూర్ ప్రచారం చేశారు. చేశారు అనేకంటే…ఆయన ప్రమేయం పూర్తి స్థాయిలో లేకుండానే అలా జరిగేలా చేశారు…ఆయా వస్తువుల ఉత్పత్తిదారులు. ఈ ప్రకటనలు చాలా వరకు బాసుమతి, కోల్ కతా మున్సిపల్ గెజిట్, భాండార్ తదితర పుస్తకాల్లో, ఆనందబజార్, అమృత బజార్, ది స్టేట్స్ మ్యాన్ లాంటి పత్రికల్లో వచ్చేవి.
ఇది ఎలా మొదలైందో చెప్పాలంటే…రచయితలు తమ పుస్తకాలకు ముందుమాట రాయమని ఠాగూర్ వద్దకు వచ్చేవారు. ఆయన రాసి ఇచ్చేవారు. ఆ రచయితలు, తమ పుస్తకాల పబ్లిసిటీకోసం ఆయన రాసిన వ్యాఖ్యలను పత్రికల్లో ఆయన ఫొటోతో పాటు ప్రచురించుకునే వారు. అలా పుస్తకాలతో మొదలై వస్తువుల వరకు వచ్చింది. ఉత్పత్తి దారులు తమ వస్తువుల గురించి నాలుగు మంచి మాటలు రాసిపెట్టమని ఆయనను కోరటం, ఆయన రాసిపెట్టడం, ఆ మాటలు ఆయన ఫొటోతో సహా ఆయా ఉత్పత్తుల ప్రకటనల్లో కనిపించడం… ఇలా చాలా జరిగాయని ఆయన జీవితంపై పరిశోధనలు నిర్వహించిన అరుణ్‌కుమార్ రాయ్ అంటున్నారు.
1889లో ఠాగూర్, తాను రాసిన పాటలను ప్రమోట్ చేస్తూ కనిపించడంతో మొదలుపెట్టి, 1941లో మరణించే నాటివరకు అలా కొన్ని వందల ప్రకటనల్లో కనిపించారని రాయ్ తెలిపారు. రబీంద్రనాథ్ ఓ చలా చిత్ర… పుస్తకంతో సినిమాలపై ఉత్తమ పుస్తక రచయితగా జాతీయ సినీ అవార్డుని సొంతం చేసుకున్న అరుణ్ కుమార్ రాయ్, ఆ తరువాత దశాబ్దం పాటు ఈ విషయంమీద పరిశోధనలు చేసి ఠాగూర్ ప్రకటనల్లో కనిపించడం వెనుక ఉన్న ఆసక్తికరమైన అంశాలను రబీంద్రనాథ్ ఓ విజ్ఞాపన్ (ఠాగూర్ అండ్ అడ్వర్టైజ్‌మెంట్స్)గా ప్రచురించారు. అయితే ప్రజల్లో తనకున్న పేరుని వస్తువుల ప్రమోషన్ కోసం వినియోగించిన ఠాగూర్ ప్రతిఫలంగా ధనం ఆశించినట్టుగా కనబడదని, ఆయన స్వదేశీ వస్తువులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ధ్యేయంతోనే అలా చేశారని రాయ్ పేర్కొన్నారు. ఫారిన్ ఉత్పత్తులకంటే మన ఉత్పత్తులు ఏమాత్రం తక్కువ కాదనే అర్థం వచ్చేలా ఠాగూర్ ప్రచార వ్యాఖ్యలు రాసేవారు. అలా ఠాగూర్ రేడియం స్నో, గోద్రేజ్ సబ్బు ప్రకటనల్లో కనిపించారు. ఇదే విషయం మీద పరిశోధనలు చేసిన పవిత్రా సర్కార్ సైతం ఇదే విషయాన్ని తేల్చారు. విదేశీ కంపెనీల పోటీకి తట్టుకుని నిలబడలేక అవస్థలు పడుతున్న స్వదేశీ కంపెనీలకు దేశభక్తితోనే ఠాగూర్ ప్రచారం చేశారని ఆమె పేర్కొన్నారు. అయితే కారణాలు వెల్లడి కాలేదు కానీ ఠాగూర్ బ్రిటీష్ మల్టీ నేషనల్ కంపెనీ క్యాడ్ బరీ ఉత్పత్తి, బోర్న్ విటా యాడ్‌లోనూ కనిపించారు.
వస్తుసేవలకే కాక కొంతమంది వ్యక్తులు సైతం ఆయన పేరుని వ్యక్తిగత లబ్దికోసం వినియోగించుకున్నారు. 1935లో రిజర్వు బ్యాంకు స్థానిక బోర్డు ఎన్నికల్లో పోటీచేసిన అమర్ కృష్ణ ఘోష్ ఠాగూర్ తనని ఆశీర్వదిస్తున్నఫొటోతో ప్రచారం చేసుకున్నాడు. అలా ఠాగూర్ బ్రాండ్‌నేమ్ ఒకటి మార్కెట్లో విస్తృతంగా వినియోగంలోకి వచ్చింది. 1919లో జలియన్‌వాలా బాగ్ దురంతం తరువాత ఠాగూర్ తనకు బ్రిటీష్ వారు ఇచ్చిన నైట్ హుడ్ బిరుదుని వదులుకున్నారు. వెంటనే ఓ పళ్లరసాల వ్యాపారి తన షాపు ముందు ఒక కొటేషన్ రాయించాడు. ఠాగూర్ తన నైట్‌హుడ్ బిరుదుని వదులుకున్నారు…కానీ మీరు అంత తేలిగ్గా మా రుచికరమైన పళ్ల రసాలు తాగకుండా ఉండగలరా….అని. ఇవన్నీ పక్కనపెడితే ఠాగూర్ మొట్టమొదట ప్రచారం చేసింది ఒక భావోద్వేగాన్ని…. అదే దేశభక్తి. ఆనాడు తన దేశభక్తితో, రచనలతో కోట్లమందిలో స్ఫూర్తిని నింపారు కనుకనే ఠాగూర్ ఇప్పుడు జీవించి ఉంటే ఆయన బ్రాండ్ విలువ కోట్లలోనే ఉండేదని ప్రచార రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.