Telugu Global
Family

ఒక చేత్తో సూర్యుణ్ణి ఆపడం (Devotional)

రబ్బీ నచ్‌మాన్‌ ప్రజలకు ఎన్నో విషయాల్లో సలహాలు ఇచ్చేవాడు. సందేహాలు తీర్చేవాడు. శిష్యులకు బోధలు చేసేవాడు. ఆ విధంగా ఆయన మంచిపేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు ఒక శిష్యుడు గురువు దగ్గరికి వచ్చి మొఖం దిగులుగా పెట్టి నిల్చున్నాడు. గురువు ఏమైందని శిష్యుణ్ణి అడిగాడు. శిష్యుడు “గురువు గారూ! మీ దగ్గర ఎంతగానో పవిత్ర గ్రంధాల అధ్యయనం చేశాను. అవి ఎన్నో మార్గదర్శకాల్ని రూపొందించినమాట వాస్తవం. కాదనను. కాని ఇప్పటినించీ నేను వాటిని అధ్యయనం చెయ్యడం మానేద్దామనుకుంటున్నాను” అన్నాడు. […]

రబ్బీ నచ్‌మాన్‌ ప్రజలకు ఎన్నో విషయాల్లో సలహాలు ఇచ్చేవాడు. సందేహాలు తీర్చేవాడు. శిష్యులకు బోధలు చేసేవాడు. ఆ విధంగా ఆయన మంచిపేరు తెచ్చుకున్నాడు.

ఒకరోజు ఒక శిష్యుడు గురువు దగ్గరికి వచ్చి మొఖం దిగులుగా పెట్టి నిల్చున్నాడు. గురువు ఏమైందని శిష్యుణ్ణి అడిగాడు.

శిష్యుడు “గురువు గారూ! మీ దగ్గర ఎంతగానో పవిత్ర గ్రంధాల అధ్యయనం చేశాను. అవి ఎన్నో మార్గదర్శకాల్ని రూపొందించినమాట వాస్తవం. కాదనను. కాని ఇప్పటినించీ నేను వాటిని అధ్యయనం చెయ్యడం మానేద్దామనుకుంటున్నాను” అన్నాడు.

గురువు గారు “ఏమయింది? అంతకష్టం నీకు ఏమొచ్చిపడింది?” అన్నాడు.

శిష్యుడు “నేను చిన్నయింట్లో నా సోదరులు, తల్లిదండ్రులతోబాటు నివసిస్తాను. అట్లాంటిచోట ఉంటూ ఆదర్శవంతమయిన పవిత్రగ్రంధ అధ్యయనం నాకు అసాధ్యమనిపిస్తోంది” అన్నాడు.

గురువు ఆకాశంలో ఉన్న సూర్యుణ్ణి చూపి “నీ చేతితో కళ్ళను మూయి” అన్నాడు.

శిష్యుడు గురువు చెప్పినట్లే చేశాడు.

గురువు “సూర్యడు కనిపిస్తున్నాడా?” అన్నాడు.

శిష్యుడు లేదన్నాడు.

గురువు “నీ చేయి చిన్నది. అయినా అది పూర్తిగా సూర్యశక్తిని అడ్డుపెట్టింది. అనంత విశ్వాన్ని ధగధగలాడించే సూర్యుణ్ణి కూడా అదుపులో పెట్టింది. చిన్ని సమస్యలు నిజమే. అవి నీ అనంత శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అడ్డకుంటాయి. “మంచిపనులు చేయగల సత్సంకల్పం లేకుంటే ఆటంకాలకి ఇతరులను కారణాలుగా చెబుతాం. నువ్వే ఆలోచించు” అన్నాడు.

శిష్యుడి కళ్ళు తెరచుకున్నాయి.

– సౌభాగ్య

First Published:  19 Aug 2015 6:31 PM IST
Next Story