నారాయణ కాలేజీలో ఇద్దరు విద్యార్థినిల ఉరి
మొన్న రిషితేశ్వరీ.. నేడు నందిని, మనీషా… ఇలా అర్ధాంతరంగా చదువుల సరస్వతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. కడపలోని నారాయణ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్‌ఈయర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యలు కలకలం రేపాయి. నారాయణ కాలేజీ హాస్టల్ గదిలో ఇద్దరు విద్యార్థినులు ఫ్యాన్‌లకు ఉరివేసుకున్నారు. వారి ఆత్మహత్యతో విద్యార్థి సంఘాలు కాలేజీపై దాడికి దిగాయి. ఆందోళన కారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇటు తమ పిల్లల ఆత్మహత్యలపై మృతుల తల్లిదండ్రులు అనేక అనుమానాలు […]
BY sarvi18 Aug 2015 5:49 AM IST
X
sarvi Updated On: 18 Aug 2015 6:10 AM IST
మొన్న రిషితేశ్వరీ.. నేడు నందిని, మనీషా… ఇలా అర్ధాంతరంగా చదువుల సరస్వతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. కడపలోని నారాయణ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్‌ఈయర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యలు కలకలం రేపాయి. నారాయణ కాలేజీ హాస్టల్ గదిలో ఇద్దరు విద్యార్థినులు ఫ్యాన్‌లకు ఉరివేసుకున్నారు. వారి ఆత్మహత్యతో విద్యార్థి సంఘాలు కాలేజీపై దాడికి దిగాయి. ఆందోళన కారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇటు తమ పిల్లల ఆత్మహత్యలపై మృతుల తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం తరగతులు ముగిసిన తర్వాత హాస్టల్ గదిలోకి వెళ్లిన విద్యార్థులు దీనంగా చున్నీలకు వెలాడుతున్న నందిని, మనీషా మృతదేహాలను చూసి షాక్ అయ్యారు. వెంటనే ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యానికి చెప్పారు. విషయం తెలిసిన విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు హాస్టల్‌కు చేరుకున్నారు. విగతజీవులుగా ఉన్న తమ బిడ్డలను చూసి బోరున విలపించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై నందిని, మనీషా తల్లిదండ్రులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తమ పిల్లల ఆత్మహత్యలకు కళాశాల యాజమాన్యమే కారణమని ఆరోపించారు.
సూసైడ్ నోట్ ఉందా?… ఉంటే ఏమైంది?
నందిని, మనీషా ఆత్మహత్యల పట్ల విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. వీరి ఆత్మహత్యలు జరిగిన తీరును పరిశీలిస్తే వందల మంది విద్యార్థినులు ఉన్న హస్టల్‌లో ఆత్మహత్య చేసుకోవడం ఎలా సాధ్యం అన్న విషయం ఇపుడు చర్చనీయాంశమైంది. విద్యార్థినుల సూసైడ్ నోట్‌ను కాలేజీ యాజమాన్యం మాయం చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమాచారం తెలిసిన వెంటనే విద్యార్థి సంఘాల నేతలు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన చేశారు. విద్యార్థి సంఘాల నేతలు, మృతుల బంధువులు కాలేజీపై దాడికి దిగారు. ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఒక దశలో నారాయణ కాలేజ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని వారు డిమాండు చేశారు. జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీని కూడా బాధితులు చుట్టు ముట్టారు. దీంతో పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బందిని దింపితేగాని పరిస్థితి అదుపులోకి రాలేదు. హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు లాఠీచార్జ్ చేసి తరిమి వేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా తయారైంది. రాష్ర్ట పురపాలక శాఖ మంత్రి నారాయణకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణను స్వయంగా తానే పర్యవేక్షిస్తానని జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ చెబుతున్నారు. విద్యార్థునుల సూసైడ్‌తో కాలేజీ ఆవరణ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story