గురువుల గైర్హాజరీపై ఆగ్రహించిన పిల్లలు- హైకోర్టుకు ఫిర్యాదు
మామూలుగా మాస్టారు రాకపోతే పిల్లలకు భలే సంతోషంగా ఉంటుంది. ఎంచక్కా ఆడుకోవచ్చని ఆనందపడతారు. కానీ ఆ పిల్లలు అలా కాదు… తమ స్కూలుకు పాఠాలు చెప్పాల్సిన గురువులు రావడం లేదు… స్కూలుకు వెళ్లి ఏమీ నేర్చుకోలేక పోతున్నాం.. చదువుకోవడానికి వెళ్లి ఆడుకుని వచ్చేస్తున్నాం.. అసలు మనం స్కూలుకు వెళుతున్నది చదువుకోవడానికా లేక ఆడుకోవడానికా..? ఇలాంటి ప్రశ్నలు ఆ విద్యార్థులను వేధించాయి. తమ సమస్యకు పరిష్కారం ఎవరు చెప్పగలరా అని ఆలోచించారు.. ఏకంగా హైకోర్టు తలుపు తట్టారు. తమ […]
BY Pragnadhar Reddy17 Aug 2015 9:27 PM GMT
X
Pragnadhar Reddy Updated On: 17 Aug 2015 9:27 PM GMT
మామూలుగా మాస్టారు రాకపోతే పిల్లలకు భలే సంతోషంగా ఉంటుంది. ఎంచక్కా ఆడుకోవచ్చని ఆనందపడతారు. కానీ ఆ పిల్లలు అలా కాదు… తమ స్కూలుకు పాఠాలు చెప్పాల్సిన గురువులు రావడం లేదు… స్కూలుకు వెళ్లి ఏమీ నేర్చుకోలేక పోతున్నాం.. చదువుకోవడానికి వెళ్లి ఆడుకుని వచ్చేస్తున్నాం.. అసలు మనం స్కూలుకు వెళుతున్నది చదువుకోవడానికా లేక ఆడుకోవడానికా..? ఇలాంటి ప్రశ్నలు ఆ విద్యార్థులను వేధించాయి. తమ సమస్యకు పరిష్కారం ఎవరు చెప్పగలరా అని ఆలోచించారు.. ఏకంగా హైకోర్టు తలుపు తట్టారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ హైకోర్టుకు లేఖ రాశారు. పిల్లల నుంచి అందిన ఆ లేఖను చూసిన హైకోర్టు దానిని తీవ్రంగా పరిగణించింది. లేఖను సూమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ సంచలనం సృష్టించింది మరెవరో కాదు… మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు మండలం చింతకుంట గ్రామానికి చెందిన విద్యార్థులు. హైకోర్టుకు సుమారుగా 900 వరకు లేఖలు పంపించారు. ఒక్కో విద్యార్థి తమ ఆవేదనను తమ లేఖలో పొందుపరిచారు. టీచర్లు రాకపోవడంతో తాము చదువుకోలేకపోతున్నామని వాపోయారు. దీనిపై హైకోర్టు వెంటనే స్పందించింది. ఆ స్కూలులో ఉపాధ్యాయులు ఎందుకు లేరని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆదేశించింది. అసలు ఆ జిల్లా డీఈవోను వెంటనే ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలపాలని షోకాజ్ జారీ చేసింది. అసలు ఆ స్కూలుకు టీచర్లు ఉన్నారా లేదా.. ఉంటే ఎందుకు రావడం లేదు..? టీచర్లు ఉండి రాకుంటే తక్షణమే వారిని తొలగించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. మరో రెండు రోజుల్లో ఈ కేసు తదుపరి విచారణ జరగనున్నది. అప్పటికల్లా ప్రభుత్వం పూర్తి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
Next Story