అతని రాజ్యం (Devotional)
ఒక రాజు శక్తివంతుడు. అతనిది చాలా పెద్దరాజ్యం. అతనికి ఎదురుతిరిగే ధైర్యం ఎవరికీ లేదు. దాంతో తనని మించినవాడు ఎవడూ లేడని ఆ రాజు అహంకరించే వాడు. అతనికి సంతృప్తిగా జీవించేవాళ్ళంటే మంట. మరీ సన్యాసులు ఎలా అంత నిర్మలంగా జీవిస్తారో అంతుపట్టేది కాదు. ఆ రాజ్యంలో గొప్ప పేరు పొందిన ఒక సన్యాసిని రాజు తన ఆస్థానానికి ఆహ్వానించాడు. ఆ సన్యాసి వచ్చాడు. రాజు ఆ సన్యాసిని పరిశీలించాడు. నిరాడంబరంగా, నెమ్మదిగా కనిపించాడు. రాజు “నేను […]
ఒక రాజు శక్తివంతుడు. అతనిది చాలా పెద్దరాజ్యం. అతనికి ఎదురుతిరిగే ధైర్యం ఎవరికీ లేదు. దాంతో తనని మించినవాడు ఎవడూ లేడని ఆ రాజు అహంకరించే వాడు. అతనికి సంతృప్తిగా జీవించేవాళ్ళంటే మంట. మరీ సన్యాసులు ఎలా అంత నిర్మలంగా జీవిస్తారో అంతుపట్టేది కాదు.
ఆ రాజ్యంలో గొప్ప పేరు పొందిన ఒక సన్యాసిని రాజు తన ఆస్థానానికి ఆహ్వానించాడు. ఆ సన్యాసి వచ్చాడు.
రాజు ఆ సన్యాసిని పరిశీలించాడు. నిరాడంబరంగా, నెమ్మదిగా కనిపించాడు.
రాజు “నేను చాలా కొద్ది తిండి, బట్టతో సంతృప్తి పడే సర్వసంగపరిత్యాగి అయిన సన్యాసిని చూసి ఈర్ష్యపడతాను” అన్నాడు.
దానికి సన్యాసి ” రాజా! నేను కూడా అత్యల్పమయినదానితో సంతృప్తిపడే వ్యక్తిని చూసి అసూయపడతాను. మరీ నాకంటే తక్కువదానితో సంతృప్తిపడే వ్యక్తిని చూసి ఈర్ష్యపడతాను” అన్నాడు.
రాజు “ఆసంగతి నువ్వెట్లా చెప్పగలవు? ఈ రాజ్యమే నాదయినపుడు ఈ రాజ్యంలోని అన్నీ నావయినపుడు నాది అనుకోవడానికి ఎవరికన్నా ఎట్లావీలుపడుతుంది?” అన్నాడు.
సన్యాసి “రాజా! నా సంతృప్తికి ఒకటే కారణం. నాలో స్వర్గ సంబంధమయిన సంగీతముంది. సమస్త ప్రపంచానికి సంబంధించిన నదులు, పర్వతాలు నాలోవున్నాయి. నాకు చంద్రుడున్నాడు, సూర్యుడున్నాడు. అనంతగోళాల అంతరిక్షముంది. ఎందుకంటే దేవుడు నా ఆత్మలో ఉన్నాడు. రాజా! నీకున్నది ఈ రాజ్యం మాత్రమే” అన్నాడు.
దాంతో రాజు అహంకారం మాయమయింది. ఆయన తన సింహాసనం దిగివచ్చి సన్యాసి పాదాలమీద పడ్డాడు.
– సౌభాగ్య