Telugu Global
Family

కుంకుమపూలు (For Children)

ఆ న్యాయవాది ఆ ప్రాంతంలో సుప్రసిద్ధుడు. అర్జంటు కేసులేవో ఉంటే ఫైళ్ళు తిరగేస్తున్నాడు. అంతలో తలుపు దగ్గర ఏదో శబ్దం వినిపించింది. ఎవరో వ్యక్తి వినయంగా చేతులు కట్టుకుని నిల్చున్నాడు. లాయర్‌ అతన్ని చూసి ‘రేపురా! ఇప్పుడు చాలా అర్జంటు పనిమీద ఉన్నా’ అన్నాడు. ఆ వ్యక్తి ‘అయ్యా! మీరే నన్ను కాపాడాలి. చాలా కష్టాల్లో వున్నా’ అన్నాడు. లాయర్‌ ఫైళ్ళు మూసి అతన్ని దగ్గరకు రమ్మన్నాడు. ఆ వ్యక్తి వినయంగా వచ్చాడు. ఏమిటి విషయమన్నాడు లాయర్‌. […]

ఆ న్యాయవాది ఆ ప్రాంతంలో సుప్రసిద్ధుడు. అర్జంటు కేసులేవో ఉంటే ఫైళ్ళు తిరగేస్తున్నాడు. అంతలో తలుపు దగ్గర ఏదో శబ్దం వినిపించింది.

ఎవరో వ్యక్తి వినయంగా చేతులు కట్టుకుని నిల్చున్నాడు. లాయర్‌ అతన్ని చూసి ‘రేపురా! ఇప్పుడు చాలా అర్జంటు పనిమీద ఉన్నా’ అన్నాడు.

ఆ వ్యక్తి ‘అయ్యా! మీరే నన్ను కాపాడాలి. చాలా కష్టాల్లో వున్నా’ అన్నాడు. లాయర్‌ ఫైళ్ళు మూసి అతన్ని దగ్గరకు రమ్మన్నాడు. ఆ వ్యక్తి వినయంగా వచ్చాడు. ఏమిటి విషయమన్నాడు లాయర్‌.

ఆ వ్యక్తి ‘లాయర్‌గారూ! నేను రైతును. ఐతే నేను కుంకుమపూల పంట వేస్తే అదంతా దావానలం వ్యాపించి నాశనమయింది. నేను వ్యవసాయం వదిలి చిన్న వ్యాపారం ప్రారంభించాను. దానికోసం డబ్బు కావాల్సి వచ్చి ఒక వడ్డీ వ్యాపారస్థుని దగ్గర అప్పు తీసుకున్నాను. కానీ అతను విపరీతమైన వడ్డీలు వేశాడు. అది అసల్ని మించిపోయింది. నేనుకట్టలేకపోయాను. అతను కోర్టుకు వెళ్ళి నాపైన కేసు పెట్టాడు. పరిస్థితి ఇది. మీరు నన్ను గట్టెక్కించాలి అన్నాడు.

లాయర్‌ ఆలోచించి ‘నువ్వు దిగులుపడకు ఈ కేసు నించి సులభంగా గట్టెక్కుతాం. నేను నీకు అనుకూలంగా తీర్పు వచ్చేలా వాదిస్తాను. ఐతే నేను ఎంత ప్రముఖ న్యాయవాదినో నీకు తెలుసు. నా ఫీజు ఎక్కువని కూడా తెలుసుకునే ఉంటావు. అదెలా ఇస్తా’వన్నాడు.

ఆ వ్యక్తి ‘మీరు దిగులుపడకండి. అది నేను చెల్లిస్తాను’ అని భరోసా ఇచ్చాడు.

కేసు కోర్టుకు వెళ్ళింది. ఈ వ్యక్తి మీద కేసు వేసిన వడ్డీ వ్యాపారస్థుడు తన డబ్బు తిరిగి చెల్లించలేదని ఫిర్యాదు చేశాడు.

జడ్జి ఈ పేదరైతును చూసి ‘నిజమేనా? నువ్వు ఇతని దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదా?’ అన్నాడు.

ఈ రైతుకు అంతకు ముందే తన న్యాయవాది కోర్టులో ఎలా ప్రవర్తించాలో ఏం చెప్పాలో ముందుగా తర్ఫీదు ఇచ్చాడు. జడ్జి ఆ మాట అడిగిన వెంటనే రైతు ఏడుస్తూ ‘కుంకుమపువ్వు, కుంకుమపువ్వు’ అన్నాడు. జడ్జికి విషయం అంతుపట్టలేదు. చూసే జనమంతా ఏమిటీ విచిత్రమనుకున్నారు?

రైతు తరపున న్యాయవాది రైతు దీనగాథను వివరించాడు. అతని పొలం అగ్నికి ఆహుతి కావడం చెప్పాడు.

దాంతో జడ్జిగారు కూడా కన్నీళ్ళు తుడుచుకున్నాడు. కేసు కొట్టేశారు.

లాయర్‌ ‘చూశావా నాపనితనం’ అని రైతుతో అని, ‘మరి నా ఫీజు’ అన్నాడు.

రైతు కన్నీళ్ళు పెట్టుకుని ‘కుంకుమపువ్వు’ అంటూ వెళుతూ వెనక్కి తిరిగి ‘చూశావా నా పనితనం’ అన్నాడు.

-సౌభాగ్య

First Published:  16 Aug 2015 6:32 PM IST
Next Story