Telugu Global
Others

టీమిండియాగా పని చేద్దాం... అభివృద్ధిని సాధిద్దాం

ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోడి పిలుపు దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ… దేశంలో పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా 125 కోట్ల మంది భారతీయులు టీమిండియాగా పనిచేద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పేదల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నామన్న ఆయన, మన పథకాలు, వ్యవస్థలు వారికి ఉపయోగపడాలన్నారు. కులతత్వం, మతతత్వం దేశాన్ని […]

టీమిండియాగా పని చేద్దాం... అభివృద్ధిని సాధిద్దాం
X

ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోడి పిలుపు
దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ… దేశంలో పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా 125 కోట్ల మంది భారతీయులు టీమిండియాగా పనిచేద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పేదల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నామన్న ఆయన, మన పథకాలు, వ్యవస్థలు వారికి ఉపయోగపడాలన్నారు. కులతత్వం, మతతత్వం దేశాన్ని పట్టి పీడిస్తున్నాయన్న ప్రధాని, అభివృద్ధి నినాదంతో వీటన్నింటినీ భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటూ మతఛాందసానికి ఎటువంటి పరిస్థితుల్లో తావుండకూడదని స్పష్టం చేశారు. భిన్నత్వంలో ఏకత్వం అన్న భారత తత్వమే ప్రపంచానికి దిక్సూచిగా ఉందన్నారు. దేశంలో ఒక ఉద్యమంగా వ్యాపించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్‌ ప్రతి భారతీయుడినీ కదిలించిందని చెప్పారు. గతంలో తాను ఎర్రకోట నుంచి మరుగుదొడ్ల గురించి మాట్లాడితే ఈయనేం ప్రధాని అంటూ ఎద్దేవా చేశారన్నారు. ఇప్పుడు చిన్నారులే స్వచ్ఛ భారత్‌కు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారారంటూ ఇళ్లను స్వచ్ఛంగా ఉంచే బాధ్యతను బాలలు స్వీకరించారని వారిని అభినందించారు. అటువంటి బాలలకు తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు.
పేదలను ఆర్థికంగా బలోపేతం చేస్తే భారత ఆర్థిక వ్యవస్థకు ఢోకా ఉండదన్నారు. దేశాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యమే ప్రధానమంటూ భారత్‌ సమున్నత శిఖరాలకు చేరుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మన ప్రణాళికలు, ఆలోచనలు దేశాభివృద్ధికి కొత్తదారులు వేయాలన్న ప్రధానమంత్రి, జన్‌ధన్‌ యోజన మంచి ఫలితాలనిచ్చిందని, ఒక్క పిలుపుతో పేదలంతా బ్యాంకు ఖాతాలు తెరిచారని తన హర్షాన్ని తెలియజేశారు. ఊహించినదానికి భిన్నంగా వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమయ్యాయంటూ ఇది భారత పేదలు సాధించిన విజయమని పేర్కాన్నారు. నెలకు ఒక రూపాయితో బీమా పథకం ప్రవేశపెట్టామని, ఫలితంగా 100 రోజుల్లో 10 కోట్ల కుటుంబాలు బీమా పథకంలో చేరాయని తెలిపారు.
ప్రాణాలను పణంగా పెట్టి, జీవితాలను త్యాగం చేసి బ్రిటిష్ పాలన నుంచి జాతికి విముక్తి ప్రసాదించిన స్వాతంత్ర్య సమరయోధులకు సెల్యూట్‌ చేస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎందరో సమరయోధులు వారి జీవితాలను కారాగారాలకు అంకితం చేసి స్వాతంత్య్రాన్ని మనకు కానుకగా అందించారన్నారు. మహాపురుషుల పోరాట ఫలితమే స్వతంత్ర భారతమంటూ వారి త్యాగాలను నిత్యం స్మరించుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో దాదాపు కేంద్ర మంత్రులందరూ పాల్గొన్నారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతోపాటు ఎంపీలు, రాజకీయ, అధికార, అనధికార ప్రముఖులు పాల్గొని దేశమాతకు వందనం సమర్పించారు. అంతకు ముందు ప్రధాని మోదీ రాజ్ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

First Published:  15 Aug 2015 5:28 AM IST
Next Story