Telugu Global
Family

దేవుడికి అన్నీ తెలుసు (Devotional)

ఒక పండితుడు ఎన్నో శాస్త్రాల్లో పాండిత్యం సాధించినవాడు. వాదోపవాదాల్లో ఎందర్నో పండితుల్ని జయించినవాడు. దాంతో అతనికి అంతులేని ఆత్మవిశ్వాసం, అహంకారం. ఎవర్నీ లెక్క పెట్టేవాడు కాదు. అతను నిరంతరం దేశ సంచారం చేసేవాడు. ఎందర్నో కలిసి ఎంతో విషయసేకరణ చేసేవాడు. ఆవిధంగా ఒకసారి ఒక గ్రామం బయల్దేరాడు. దారిలో సూర్యుడు తీక్షణంగా తన కిరణాల్ని ప్రసరించాడు. పైగా అది వేసవికాలం. ఎండమండిపోతుంది. సూర్యుడికి పండితుడయినా పామరుడయినా ఒకటే కదా! ఎవడ్నీ వదిలి పెట్టడు కదా! పైగా పండితుడికి […]

ఒక పండితుడు ఎన్నో శాస్త్రాల్లో పాండిత్యం సాధించినవాడు. వాదోపవాదాల్లో ఎందర్నో పండితుల్ని జయించినవాడు. దాంతో అతనికి అంతులేని ఆత్మవిశ్వాసం, అహంకారం. ఎవర్నీ లెక్క పెట్టేవాడు కాదు.

అతను నిరంతరం దేశ సంచారం చేసేవాడు. ఎందర్నో కలిసి ఎంతో విషయసేకరణ చేసేవాడు. ఆవిధంగా ఒకసారి ఒక గ్రామం బయల్దేరాడు. దారిలో సూర్యుడు తీక్షణంగా తన కిరణాల్ని ప్రసరించాడు. పైగా అది వేసవికాలం. ఎండమండిపోతుంది. సూర్యుడికి పండితుడయినా పామరుడయినా ఒకటే కదా! ఎవడ్నీ వదిలి పెట్టడు కదా! పైగా పండితుడికి బట్టతల. మృదంగం వాయించినట్లు తలను కిరణాలనే కట్టెల్తో కొట్టాడు.

పండితుడు చెమటతో తడిచి ముద్దయ్యాడు. భరించలేని వేడితో కొంతదూరం కూడా నడవలేననిపించింది. అటూఇటూ చూశాడు. దూరంగా ఒక పెద్ద మర్రిచెట్టు కనిపించింది. “హమ్మయ్య” అని నిటూర్చి త్వరగా అడుగులువేసి ఆ మర్రి చెట్టుకిందికి వెళ్ళాడు. తల్లి కౌగిలిలా ఆ మర్రిచెట్టు నీడ చల్లగా ఉంది. అది చాలా పెద్దమర్రిచెట్టు. దట్టమైన కొమ్మలు ఆకులు. విశాలంగా విస్తరించింది. ఆ మర్రిచెట్టు కింద జనం విశ్రాంతి తీసుకోడానికి ఎవరో బండలతో అరుగులు కట్టారు. ఇంకెవరో చలువ పందిరి ఏర్పాటు చేశారు. నీటికుండలు ఏర్పాటుచేశారు. పండితుడికి ప్రాణం లేచివచ్చినట్లయింది. ముఖం కడుక్కుని చల్లని నీటిని కడుపునిండుగా తాగి బండలమీద చల్లటి నీడలో కాసేపు విశ్రమించాడు. మెలకువరాగానే కళ్ళు తెరిచి పైకి చూశాడు.

మర్రిచెట్టులోని చిన్నిచిన్ని ఎర్రటి కాయలు తననే చూస్తున్నట్లనిపించాయి. మర్రిచెట్టు పర్వతమంత మహావృక్షం. అంతపెద్ద చెట్టుకు ఇంత చిన్ని కాయలా? పండితుడికి నవ్వు వచ్చింది. అతని మనసులో గుమ్మడికాయలు మెదిలాయి. సన్నటి తీగకు పెద్దపెద్ద గుమ్మడికాయలు. పెద్ద మర్రి వృక్షానికి చిన్నిచిన్ని కాయలు. ఇందులో ఏదో తేడా ఉన్నట్లనిపించింది. ప్రపంచాన్ని సృష్టించేటప్పుడు దేవుడు కొన్ని తలకిందుల పనులు చేశాడేమో అనిపించింది. లేకుంటే నిజానికి ఇక్కడ గుమ్మడికాయలు, అక్కడ మర్రిపండ్లు ఉండాలి అనుకున్నాడు.

అంతలో ఉన్నట్లుండి గాలి వీచింది. గాలికి ఒక చిన్ని మర్రిపండు తుపాకీ గుండు దూసుకొచ్చినట్లు పండితుడి తలపై టంగుమని శబ్దం చేస్తూ పడింది. ఆ దెబ్బతో నిముషంపాటు పండితుడి కళ్ళు బైర్లుకమ్మాయి. వెంటనే ఆ మర్రిపండు స్థానంలో గుమ్మడికాయ తన తలమీద పడివుంటే ఎలా ఉండేదని ఊహించాడు. ఆ ఊహే భయం కలిగించింది. పగిలిన తన తలను ఊహించుకుని బెంబేలెత్తిపోయాడు.

పండితుడి అహంకారం అదృశ్యమైంది.

చేతులు జోడించి ఆకాశంలోని చూసి “దేవా! ఏది ఎక్కడ ఎందుకు ఉండాలో నీకు తెలుసు. నా అజ్ఞానంతో ఇంకోలా భావించాను. నన్ను మన్నించు తండ్రీ” అని తలను నేలకు వాల్చి దేవుణ్ణి వేడుకున్నాడు.

– సౌభాగ్య

First Published:  14 Aug 2015 6:31 PM IST
Next Story