Telugu Global
Others

ఆధార్  త‌ప్ప‌నిస‌రి కాదు: సుప్రీంకోర్టు 

కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు అందించే సంక్షేమ ప‌థ‌కాల‌ను పొంద‌డానికి ప్ర‌జ‌ల‌కు ఆధార్ కార్డు త‌ప్ప‌నిస‌రి చేయ‌రాద‌ని ప్ర‌భుత్వాల‌కు సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. ఇలాంటి ఆదేశాలను ఇంతకుముందే సుప్రీంకోర్టు ప్రకటించినా దాన్ని ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీంతో మళ్ళీ ఇదే విషయమై దాఖలైన పిటిషన్‌పై స్పందిస్తూ… ప్ర‌జా పంపిణీ ప‌థ‌కం, ఆహార‌ధాన్యాలు, కిరోసిన్‌, వంట గ్యాస్ పంపిణీకి మిన‌హా మ‌రే ఇత‌ర అవ‌స‌రాల‌కూ ఆధార్ కార్డును వినియోగించ‌రాద‌ని సుప్రీం స్ప‌ష్టం చేసింది. ఆధార్ కోసం సేక‌రించిన వ్య‌క్తిగ‌త […]

ఆధార్  త‌ప్ప‌నిస‌రి కాదు: సుప్రీంకోర్టు 
X
కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు అందించే సంక్షేమ ప‌థ‌కాల‌ను పొంద‌డానికి ప్ర‌జ‌ల‌కు ఆధార్ కార్డు త‌ప్ప‌నిస‌రి చేయ‌రాద‌ని ప్ర‌భుత్వాల‌కు సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. ఇలాంటి ఆదేశాలను ఇంతకుముందే సుప్రీంకోర్టు ప్రకటించినా దాన్ని ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీంతో మళ్ళీ ఇదే విషయమై దాఖలైన పిటిషన్‌పై స్పందిస్తూ… ప్ర‌జా పంపిణీ ప‌థ‌కం, ఆహార‌ధాన్యాలు, కిరోసిన్‌, వంట గ్యాస్ పంపిణీకి మిన‌హా మ‌రే ఇత‌ర అవ‌స‌రాల‌కూ ఆధార్ కార్డును వినియోగించ‌రాద‌ని సుప్రీం స్ప‌ష్టం చేసింది. ఆధార్ కోసం సేక‌రించిన వ్య‌క్తిగ‌త బ‌యోమెట్రిక్ స‌మాచారాన్ని వేరెవ్వ‌రికీ ఇవ్వ‌రాద‌ని అధికారుల‌ను ఆదేశించింది అయితే, క్రిమిన‌ల్ కేసుల విచార‌ణ‌లో కోర్టు అనుమ‌తితో ఆ స‌మాచారాన్ని వినియోగించ‌వచ్చ‌ని సూచించింది. సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆధార్ కార్డుల‌ను త‌ప్ప‌నిస‌రి చేయ‌డాన్ని స‌వాల్ చేస్తూ దాఖ‌లైన ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యాల‌ను మంగ‌ళ‌వారం జ‌స్టిస్ జె. చ‌ల‌మేశ్వ‌ర్ నేతృత్వంలోని త్రిస‌భ్య‌ ధ‌ర్మాస‌నం విచారించింది. ఆధార్ కార్డుల త‌యారీ కోసం వ్య‌క్తిగ‌త వివ‌రాలను సేక‌రించ‌డం వ్య‌క్తుల ప్రయివ‌సీని ఉల్లంఘించిన‌ట్లవుతుందా? వ్య‌క్తిగ‌త గోప్య‌త హ‌క్కు ప్రాథ‌మిక హ‌క్కు కింద‌కు వ‌స్తుందా? అనే విస్త్ర‌త అంశాల‌పై నిర్ణ‌యించ‌టానికి ఆ అంశాన్ని రాజ్యాంగ ధ‌ర్మాస‌నానికి నివేదించాల్సిందిగా చీఫ్ జ‌స్టిస్ హెచ్‌.ఎల్‌.దత్తుకు సిఫారుసు చేసింది. వ్య‌క్తిగ‌త గోప్య‌త హ‌క్కు ప్రాథ‌మిక హ‌క్క‌యితే దాని ప‌రిధి ఏమిటో నిర్ణ‌యించాల‌ని సూచించింది. సుప్రీం ఆదేశాల ప్ర‌కార‌మే సామాజిక ప్ర‌యోజ‌నాల ప‌థ‌కాల మిన‌హా మ‌రే ఇత‌ర అవ‌స‌రాల‌కూ వినియోగించ‌బోమ‌ని, ఆధార్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో పూర్తి అవ‌గాహ‌న క‌ల్పించిన త‌ర్వాత వారి అంగీకారం మేర‌కే ఆధార్ జారీ చేస్తామ‌ని ప్ర‌భుత్వం త‌ర‌పున అటార్నీ జ‌న‌ర‌ల్ ముకుల్ రోహత్గీ వాంగ్మూలాన్ని కోర్టు న‌మోదు చేసుకుంది. అయితే, ఆధార్ కార్డుల‌ను నిలిపి వేయాలంటూ దాఖ‌లైన పిటిష‌న్ల‌ను సుప్రీం విచార‌ణ‌కు స్వీక‌రించ‌లేదు.
First Published:  12 Aug 2015 5:59 AM IST
Next Story