ఎక్కువకాలం బతకాలని ఉందా... ఇవే అందుకు మార్గాల(ట)!
మరింత ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ప్రతి మనిషీ కోరుకుంటాడు. ఆరో గ్యాన్నిపెంచే ఔషధాలు, అందాన్ని ఇచ్చే సౌందర్య సాధనాలు ఎన్నో ఈ నేపథ్యంలో మనముందుకు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంపై శాస్త్రవేత్తలు సైతం పరిశోధనలు చేశారు. ఇందులో కొన్ని వింత, అద్భుత నిజాలు బయటపడ్డాయి. ఎక్కువ కాలం జీవించే వ్యక్తుల జీవితాల్లో భాగమై ఉన్న కొన్ని అంశాలను వారు కనిపెట్టారు. అవే ఇవి… – దేవుడు, మతం, మానవాతీత శక్తి వీటి పట్ల నమ్మకం ఉన్నవారు ఆ నమ్మకం లేనివారి […]
మరింత ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ప్రతి మనిషీ కోరుకుంటాడు. ఆరో గ్యాన్నిపెంచే ఔషధాలు, అందాన్ని ఇచ్చే సౌందర్య సాధనాలు ఎన్నో ఈ నేపథ్యంలో మనముందుకు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంపై శాస్త్రవేత్తలు సైతం పరిశోధనలు చేశారు. ఇందులో కొన్ని వింత, అద్భుత నిజాలు బయటపడ్డాయి. ఎక్కువ కాలం జీవించే వ్యక్తుల జీవితాల్లో భాగమై ఉన్న కొన్ని అంశాలను వారు కనిపెట్టారు. అవే ఇవి…
– దేవుడు, మతం, మానవాతీత శక్తి వీటి పట్ల నమ్మకం ఉన్నవారు ఆ నమ్మకం లేనివారి కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారట. ప్రార్థన, ధ్యానం, మొక్కులు… పద్ధతి ఏదైనా ఒక దివ్యశక్తి తాము కోరిన కోర్కెలు తీరుస్తుందన్న నమ్మకం ఉన్నవారు ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా జీవించే అవకాశం ఉండటం వలన ఎక్కువ కాలం బతుకుతున్నారని శాస్త్రవేత్తలు తేల్చారు.
-ఇతరులకు సహాయం చేస్తున్నవారు ఎక్కువకాలం జీవిస్తున్నట్టుగా కనుగొన్నారు. స్వచ్ఛంద సేవకులుగా, సామాజిక కార్యకర్తలుగా, లేదా తమకు తోచినంత సహాయం ఇతరులకు చేసేవారు, తమ స్నేహితులు, బంధువులకు అండదండగా నిలుస్తున్నవారి జీవితకాలం ఎక్కువగా ఉన్నట్టుగా తేలింది.
-ఎనిమిది గంటల నిద్ర ఉంటే గాని మన శరీరం ఆరోగ్యంగా ఉండదని ఎప్పటినుండో వింటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు తాజాగా శాస్త్రవేత్తలు ఎనిమిది కాదు, ఆరుగంటలనిద్ర చాలు అని చెబుతున్నారు. నిద్రని ఇలా కట్ చేస్తేనే మన జీవితకాలం పెరుగుతుందని వారు సెలవిస్తున్నారు.
-పెళ్లయి, పిల్లలు ఉన్నవారు ఎక్కువ కాలం జీవిస్తున్నట్టుగా గమనించారు. పిల్లలు ఉండటం వలన చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం, స్పీడు డ్రైవింగ్‌ని వదిలేసి నిదానంగా వెహికల్‌ని నడపడం మొదలైన మంచి అలవాట్లకు దగ్గరవడం వలన వారు ఎక్కువకాలం జీవిస్తున్నారని పరిశోధకులు తేల్చారు.
-ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం, పౌష్టికాహారం ఉండాలంటూ, వాటి గురించి చాలా మాట్లాడుతుంటాం. కానీ ఒక తాజా పరిశోధన ఏం చెబుతున్నదంటే అతి తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకున్న వారు ఎక్కువ కాలం జీవిస్తారని. తక్కువ కేలరీలు ఉన్న ఆహారంతో క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం ఇంకా ఇతర అనారోగ్యాలు వచ్చే ప్రమాదం తగ్గడమే అందుకు కారణమని వారు చెబుతున్నారు.
-పర్వతాల పక్కన నివసించేవారు ఎక్కువ కాలం జీవిస్తారని ఈ సైంటిస్టులు చెబుతున్నారు. అమెరికాలో కొలరాడో, స్కాండినేవియన్ పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు నూరేళ్లు పైనే జీవిస్తున్నట్టుగా తమ పరిశోధనలో గమనించారు. తరచుగా కొండలపైకి ఎక్కడం, వాతావరణ కాలుష్యం లేకపోవడం, తాజాగాలి పీల్చడం వీరి ఆరోగ్యానికి కారణాలు కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
-స్పానిష్, అరబిక్, ఇటాలియన్…ఇలాంటి కొత్త భాషలు నేర్చుకున్న వారిలో వయసు పెరిగే ప్రక్రియ నిదానంగా సాగుతున్నట్టుగా చూశారు. ఒక కొత్త భాషని నేర్చుకుంటున్నవారి మెదడు అప్రమత్తంగానూ, చురుగ్గానూ ఉంటుందని అందుకే వారు మతిమరుపు, ఇతర వ్యాధుల బారిన పడకుండా ఉంటారని, మనం చిన్నతనంలో ఒక కొత్త భాషని నేర్చుకుని ఉన్నా, ఆ ప్రతిఫలాన్ని జీవితాంతం పొందుతామని వారు అంటున్నారు.
-డబ్బుతో ఆనందం రాదని చెబుతుంటాం. అయితే ఇలాంటి స్లోగన్స్ అన్ని వేళలా నిజం కావు. డబ్బున్నవారు ఎక్కువకాలం జీవించే అవకాశాలు పెరుగుతాయని శాస్త్రవేత్తలు తేల్చారు. మంచి ఆహారం, ముందస్తు వైద్య పరీక్షలు, చక్కని వ్యాయామం ఇవన్నీ డబ్బున్నవారికి సాధ్యమయ్యే విషయాలు కనుక సహజంగానే వారి జీవితకాలం పెరుగుతుందని, అంతేకాకుండా ధనవంతుల్లో ఒత్తిడిని నియంత్రించే హార్మోన్లు ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి అవుతున్నాయని కూడా వీరు పేర్కొన్నారు. మన జీవితకాలాన్ని అంచనా వేసేందుకు ఉపయోగపడే ఈ హార్మోన్లు మనిషి టీనేజిలో ఉన్నపుడు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయట. అందుకే కష్టపడి డబ్బు సంపాదించిన వారికంటే దాన్ని వారసత్వంగా పొందినవారే ఎక్కువకాలం జీవిస్తారని వీరు తేల్చారు.
-ఇది మనం ఎప్పుడూ వింటున్నదే. ఎక్కువగా నవ్వేవారు ఎక్కువకాలం జీవిస్తారని. ఎక్కువగా నవ్వేవారిలో ఒత్తిడి తక్కువగా ఉంటుంది, నవ్వు ఎక్కువ కేలరీలను కరిగిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అధికరక్త పోటుని నియంత్రిస్తుంది. ఇవన్నీ జీవితకాలాన్ని పెంచేవే. ఏం నవ్వులే….మా బాస్ వేసే నవ్వురాని జోకులకు నవ్వుతున్నాం అంటారా… అలా అయిష్టంగా నవ్విన నవ్వుకి కూడా అంతే స్థాయి ఉపయోగాలున్నాయట.
-రిటైరయ్యాక హాయిగా రెస్టు తీసుకుందామనుకునే వారికి ఇది చేదువార్తే. రిటైర్‌మెంటుతో జీవితంలో కలిగే మార్పులు అంత ఆరోగ్యకరం కాదని, రిటైరయ్యాక వచ్చే ఆర్థిక సమస్యలు, శరీరానికి వ్యాయామం తగ్గిపోవడం, నలుగురితో కలిసిమెలసి జీవించే అవకాశం లేకపోవడం ఇవన్నీ జీవితకాలాన్ని తగ్గించివేస్తాయని, ఎక్కువకాలం పనిచేసేవారే ఎక్కువ కాలం జీవిస్తున్నారని వారు చెబుతున్నారు. మొత్తానికి ఇందులో ఉన్న ధనవంతులుగా పుట్టడం, కొండల పక్కన జీవించడం లాంటివి అందరికీ సాధ్యం కాకపోయినా వీటిలో చాలావరకు అందరికీ అందుబాటులోఉన్నవే కావడం విశేషం.