Telugu Global
Family

రాజుల్ని నమ్మకూడదు (Devotional)

ఒక వివేకవంతుడయిన సాధుశీలి ఉండేవాడు. ఆయన సన్యాసం స్వీకరించకపోయినా తన దగ్గరకు వచ్చినవాళ్ళకు తగిన సలహాలు ఇచ్చి వాళ్ళ జీవితాలలో వెలుగునింపేవాడు. ఆయన దర్శనం కోసం ఎందరో వచ్చేవాళ్ళు. ఆయన ఏవో చిన్ని పనులు చేసుకుని జీవనం గడిపేవాడు. ఎప్పుడూ ఎవర్నీ దేనికోసమూ అభ్యర్థించేవాడు కాదు. ఉన్నదానితో సంతృప్తి పడేవాడు. ఆదర్శంగా జీవించేవాడు. అతని ఇంటికి దగ్గరగా ఒక యువకుడు ఉండేవాడు. నిత్యం అశాంతిగా ఉండేవాడు. ఎప్పుడూ ఏదో చెయ్యాలని ఉండేవాడు. అతను అప్పుడప్పుడు ఆ సజ్జనుని […]

ఒక వివేకవంతుడయిన సాధుశీలి ఉండేవాడు. ఆయన సన్యాసం స్వీకరించకపోయినా తన దగ్గరకు వచ్చినవాళ్ళకు తగిన సలహాలు ఇచ్చి వాళ్ళ జీవితాలలో వెలుగునింపేవాడు. ఆయన దర్శనం కోసం ఎందరో వచ్చేవాళ్ళు. ఆయన ఏవో చిన్ని పనులు చేసుకుని జీవనం గడిపేవాడు. ఎప్పుడూ ఎవర్నీ దేనికోసమూ అభ్యర్థించేవాడు కాదు. ఉన్నదానితో సంతృప్తి పడేవాడు. ఆదర్శంగా జీవించేవాడు.

అతని ఇంటికి దగ్గరగా ఒక యువకుడు ఉండేవాడు. నిత్యం అశాంతిగా ఉండేవాడు. ఎప్పుడూ ఏదో చెయ్యాలని ఉండేవాడు. అతను అప్పుడప్పుడు ఆ సజ్జనుని దగ్గరకు వస్తూవుండేవాడు.

ఆ యువకునికి తల్లి తండ్రి, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. దుర్భర దారిద్ర్యం కాదు కానీ పేదవాళ్ళు. అయినా ఏదో ఒక పని చేసుకుని రోజులు గడిపేవాళ్ళు. యువకుడికి తన పరిస్థితులపట్ల అసంతృప్తి, ఆవేదన. ఏదయినా మంచి ఉద్యోగం ఉంటే తన జీవితం సాగిపోతుందని అందరూ సంతోషంగా ఉండవచ్చనీ అనుకునేవాడు.

యువకుడు ఆ వివేకవంతుడికి దగ్గరకు వచ్చి “మా ఇంటి పరిస్థితులు మీకు చెప్పాను. కనీసం దేశం వదిలి వెళ్ళి ఏదయినా పనిచేసి సంపాదించుకుని వద్దామని ఆలోచిస్తూ ఉంటాను. నాకు లెక్కలు రాయడం వచ్చు. మీరంటే సుల్తాన్‌కు కూడా మంచి అభిప్రాయం. మీరు ఒకమాటచెబితే ఆయన నన్ను కొలువులో చేర్చుకుంటాడు” అన్నాడు.

వివేకవంతుడు “బాబూ! సుల్తానుల్ని ఆశ్రయిస్తే, వాళ్ళ దగ్గర ఉంటే మన కడుపు నిండుతుంది, అదే సమయంలో జీవితానికి గ్యారంటీ ఉండదు. కడుపుకోసం అనుక్షణం భయపడుతూ జీవించాల్సినంత అవసరముందంటావా?” అన్నాడు.

యువకుడు “మీ మాటలు పూర్తిగా నమ్మశక్యం కావు. తప్పుచేసినవాడు భయపడాలి కానీ తప్పుచెయ్యనివాడు ఎందుకు భయపడాలి?” అన్నాడు.

వివేకి కుర్రవాడు వేడిమీదవున్నాడు. అనుభవిస్తే కానీ అసలువిషయం తెలీదునుకున్నాడు.

యువకుడు “మీరు ఈ ప్రాంతంలో మంచిపేరు తెచ్చుకున్నారు. మీరు అనుకుంటే నాకు ఎక్కడయినా ఏదో ఒక పని ఇప్పించగలరు” అన్నాడు.

కుర్రవాడి ఉద్రేకం చూసి వివేకి తనకు తెలిసిన ఒక అధికారికి చెప్పి అతనికి ఉద్యోగం ఇప్పించాడు.

ఆ యువకుడు శ్రద్ధగా తన కర్తవ్యం నిర్వహించాడు. మంచిపేరు తెచ్చుకున్నాడు. పై అధికారులు అతని తెలివి తేటలు, వినయం చూసి అతనికి పెద్ద ఉద్యోగమిచ్చారు.

అట్లా ఆ యువకుడు అచిరకాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి సుల్తాన్‌ ఆంతరంగికుడయ్యాడు. సుల్తాన్‌ ఎన్నో వ్యక్తిగత విషయాలు ఆ యువకుడితో సంప్రదించేవాడు. రాచకార్యాల్లో అతని సలహాలు తీసుకునేవాడు.

ఆవిధంగా యువకుడి సామాజిక స్థాయి పెరిగింది. సంపన్నుడయ్యాడు. పెద్దభవనం కట్టుకున్నాడు. ఉన్నత వర్గాలతో సంబంధమేర్పడింది. రాజు ఆంతరంగికుడు గనక అందరూ అతన్ని భయభక్తుల్తో సేవించేవాళ్ళు.

వివేకి ఆ యువకుడి జీవితంలో వచ్చిన అభివృద్ధికి సంతోషించాడు. ఒక రంజాన్‌ మాసంలో వివేకి మక్కా యాత్రకు బయల్దేరాడు. మక్కా వెళ్ళి కాబా సందర్శన, ప్రదక్షిణ పూర్తి చేసుకుని ప్రశాంత చిత్తంతో తన దేశం బయల్దేరాడు. మార్గ మధ్యంలో హఠాత్తుగా యువకుడు సన్యాసి దుస్తుల్లో మక్కా యాత్ర చేస్తూ ఎదురు పడ్డాడు.

వివేకి ఆ యువకుణ్ణి చూసి ఆశ్చర్యపడ్డాడు. సుల్తాను ఆంతరంగికుడి స్థాయికి ఎదిగిన వ్యక్తి సన్యాసిగా మారడమేమిటని అడిగాడు. యువకుడు కన్నీళ్ళతో “నిచ్చెన ఎక్కినట్లు కొంతకాలంలోనే నేను సుల్తాన్‌ ఆంతరంగికుణ్ణయ్యాను. కానీ పాము నీడన ఉన్నట్లు పసికట్టలేకపోయాను. గిట్టని వాళ్ళు నామీద లేనిపోనివి కల్పించి చెప్పారు. సుల్తాన్‌ అవి నమ్మి నన్ను ఖైదు చేయించాడు. నా ఇల్లు జప్తు చేశాడు. దేవుని దయవుండి రంజాన్‌మాసంలో క్షమాభిక్షదొరికి జైలునించీ విడుదలయ్యాను. జీవితం మీద విరక్తి కలిగి సన్యాసిగామారి మక్కాయాత్ర చేస్తున్నా” అన్నాడు.

వివేకి “మిత్రమా! నీ బాధ్యత నువ్వు నిర్వహించావు. అన్నిటికీ అల్లావున్నాడు, దిగులుపడకు” అని ఓదార్చాడు.

– సౌభాగ్య

First Published:  10 Aug 2015 6:31 PM IST
Next Story