Telugu Global
Editor's Choice

పిల్ల‌ల‌కు ఏం చెబుతున్నాం...ఏం చెప్పాలి?

సీనియర్లు ర్యాంగింగ్ చేశారని, అవమానించారని, ప్రిన్సిపాల్, వార్డెన్లు, తల్లిదండ్రులు తిట్టారని, పరీక్ష పాస్ కాలేదని, ప్రేమలో గెలవలేదని, పాఠాలు అర్థం కావడం లేదని, నచ్చిన చదువు చదవలేకపోతున్నామని….ఇంకా ఎన్నో కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న యువతీ యువకులను చూసినపుడు…అరె అలా చేయకుండా ఉండాల్సింది.. ఇంత విశాలమైన ప్రపంచంలో వారికి జీవితం పట్ల పిడికెడు నమ్మకాన్ని ఇచ్చే వారే దొరకలేదా…గుప్పెడు ధైర్యాన్ని అందించేవారే కరువయ్యారా అనే బాధ కలుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతోంది అనే ఆవేదన కలుగుతుంది. ఏదిఏమైనా ఇప్పటి తల్లిదండ్రుల మీద ఒక పెద్ద బాధ్యత ఉంది…తమ పిల్లలు […]

పిల్ల‌ల‌కు ఏం చెబుతున్నాం...ఏం చెప్పాలి?
X

సీనియర్లు ర్యాంగింగ్ చేశారని, అవమానించారని, ప్రిన్సిపాల్, వార్డెన్లు, తల్లిదండ్రులు తిట్టారని, పరీక్ష పాస్ కాలేదని, ప్రేమలో గెలవలేదని, పాఠాలు అర్థం కావడం లేదని, నచ్చిన చదువు చదవలేకపోతున్నామని….ఇంకా ఎన్నో కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న యువతీ యువకులను చూసినపుడు…అరె అలా చేయకుండా ఉండాల్సింది.. ఇంత విశాలమైన ప్రపంచంలో వారికి జీవితం పట్ల పిడికెడు నమ్మకాన్ని ఇచ్చే వారే దొరకలేదా…గుప్పెడు ధైర్యాన్ని అందించేవారే కరువయ్యారా అనే బాధ కలుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతోంది అనే ఆవేదన కలుగుతుంది. ఏదిఏమైనా ఇప్పటి తల్లిదండ్రుల మీద ఒక పెద్ద బాధ్యత ఉంది…తమ పిల్లలు ఇతరుల మనసులను గాయపరచకుండా, తాము గాయపడకుండా ఉండేలా వారికి తర్ఫీదు ఇవ్వాల్సిఉంది… మరి అది సాధ్యమేనా…?

నిజానికి ఒక పాతిక ముప్పయి ఏళ్ల క్రితం ఉన్నంత తీవ్రంగా జీవన కష్టాలు, పేదరికం బాధలు ఇప్పుడు లేవు. నాటి యువతరం అనేక కష్టనష్టాలను భరించి ఇప్పడు ఆర్థికంగా నిలదొక్కుకున్న మధ్య తరగతి కేటగిరీగా ప్రపంచాన్ని శాసించే స్థితిలో ఉన్నారు. వీరి పిల్లలే నేటి యువతరంగా ఘనమైన విజయాలు సాధించి చూపుతున్నారు. ఊహించని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. రెండుపదుల వయసు దాటితే చాలు కెరీర్ అంటూ పరుగులు పెడుతున్నారు. పాతికేళ్లు వచ్చేసరికే తామెంటో నిరూపిస్తున్నారు…ఇదంతా నాణేనికి ఒక వైపు. వీరిలోంచే అతి చిన్న కారణాలతోనే ప్రాణాలు తీసుకునే వారూ తయారవుతున్నారు.

వీరిలోనే లక్షలు ఖర్చుపెట్టి చదివినా, అది జీవితానికి పనికొస్తుందో లేదో తెలియక సతమతమవుతున్నవారు ఉంటున్నారు, ఏ చిన్న అవమానం ఎదురైనా, ఏ విమర్శ వచ్చినా భయకంపితులై జీవితం నుండి పారిపోయే వారు ఉంటున్నారు. ఇంటికి ఒక్కరుగా లేదా ఇద్దరు పిల్లల్లో ఒకరుగా పుట్టి అల్లారుముద్దుగా పెరిగిన నేటి యువతరానికి, ఇంతకుముందు తరాలకంటే బతుకు భయం, ఒత్తిడి ఎక్కువ ఉంటున్నాయి. ఎలాగొలా బతకొచ్చులే అనే ధీమా వారిలో ఉండడం లేదు.

ఇంటికి ఒక్క కొడుకు ఉంటాడు…ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు ఆ తల్లిదండ్రుల కలల్ని నిజం చేసి తీరాల్సిందే. మరొక ఆప్షన్ లేదు. అలాగే ఇంటికి ఒక్క కూతురు ఉంటుంది. ఎలాగైనా ఆమె ఒక కోటీశ్వరుడి ఇంటికి కోడలిగా వెళ్లాల్సిందే. పిల్లలకు ఏ చిన్న లోటూ రాకుండా పెంచడమే ఇప్పటి తల్లిదండ్రుల ఏకైక ధ్యేయం. జీవితంలో లోటు….జీవితంలో అన్నీ ఉండటం…రెండింటిలో ఏది సహజంగా కనబడుతోంది. మొదటిదే కదా…కానీ మనం ఆ సహజత్వాన్ని వదిలేసి, అత్యంత అసహజమైన రెండవదాని వెంటే పడుతున్నాం. నిజానికి ఇప్పటి పిల్లలకు మనం ఒక అబద్దపు ప్రపంచాన్ని చూపిస్తున్నాం. చిన్నతనం నుండీ మనం పెంచే విధానం అలాగే ఉంటున్నది. పిల్లలు అడిగినవన్నీ వారి చేతికి అందుతాయి. అందరూ వారిని ప్రేమిస్తారు, అందరూ అభిమానిస్తారు, జీవితం అంటే ఆనందాల పూల బాట అనే భ్రమ కల్పిస్తున్నాం. దాంతో వారు ఆత్మవిశ్వాసంతోనే పెరుగుతున్నారు. అయితే అది నిజమైన ఆత్మవిశ్వాసమా, కాదా అనేది వారికంటూ వ్యక్తిగతంగా సమస్యలు, ఒత్తిళ్లు ఎదురయినప్పుడే తెలుస్తుంది.

నిజానికి ఆత్మవిశ్వాసమంటే, పదిమందిలో ధైర్యంగా మాట్లాడడం, ముందుకు వెళ్లడం, గెలవడం…ఇవే అన్నట్టుగా మనం చెబుతున్నాం. కానీ అన్నీ ఉన్నపుడు, అంతా బాగున్న‌పుడు నాకన్నీ ఉన్నాయి… అనే ధీమాతో ఉండటం, ఆవిధంగా ధైర్యంగా బతకడం మాత్రమే ఆత్మవిశ్వాసం కాదు….ఏమీ లేక పోయినా ధీమాగా ఉండగలను అనే ధైర్యమే ఆత్మవిశ్వాసం. పదిమంది పొగిడినపుడు కాలర్ ఎగరేయడం కాదు, పదిమంది విమర్శించినపుడు, తన పక్కన ఒక్కరు కూడా నిలబడనపుడు కూడా ధైర్యంగా ఉండడమే ఆత్మ విశ్వాసం అని ఇప్పటి పిల్లలకు తల్లిదండ్రులు చెప్పడం లేదు. ఎందుకంటే తమ పిల్లలకు జీవితంలో అన్నీ ఇచ్చేయాలనే తపన తప్ప, వారికి లేమి, అవమానం, విమర్శలు, సమాజంలోని కుటిలత్వం ఇవ‌న్నీ స‌హ‌జ‌మ‌ని, వాటితో పాటు మ‌నం బ‌త‌కాల‌ని నేటి అమ్మానాన్నలు పిల్ల‌ల‌కు చెప్పాల‌నుకోవడం లేదు.

ఒక పాతిక ముప్పయ్యేళ్ల క్రితం…పిల్లలు తమని ఏ పిన్నో, బాబాయో, అత్తో, మామో తిట్టారని తల్లిదండ్రులకు చెబితే….ఫరవాలేదు, పెద్దవాళ్లు ఒక మాట అంటే నష్టమేం లేదు… అయినా నువ్వేం చేయకుండానే అత్త ఆ మాట అనదు కదా…నువ్వేం చేశావు…చెప్పు… అని అడిగే పరిస్థితి ఉండేది. నలుగురు ఉన్నపుడు, నలుగురిలోకి వెళ్లినపుడు నాలుగుమాటలు వినడం, పడటం, లేదా వాటిని ఎలా ఎదిరించాలో, లేదా ఎలా సహనం పాటించాలో…. ఇవన్నీ పిల్లలకు అర్థమవుతుండేవి. ఇవన్నీ జీవితంలోని భిన్న పార్శ్వాలు. అదే ఇప్పటి పిల్లలు నన్ను ఫలనా టీచరు, లేదా ఫలానా బంధువర్గంలోని వ్యక్తి ఇలా అన్నాడు….అనగానే…ఇంకేమీ ప్రశ్నించకుండానే…ఒక్కగానొక్క నా కూతురిని, నాకొడుకుని నేనే అంతమాట అనను… వాడంటాడా…అంటూ కాలు దూసే తల్లిదండ్రులే ఎక్కువ ఉంటున్నారు.

అసలు ఇంతకుముందులా మేనమామలకు. పెద్దనాన్నలకు తాతలకు భయపడే పిల్లలు ఇప్పుడున్నారా…. ఇంట్లో భయం అనేది ఎలా ఉంటుందో, అవమానం ఎలా ఉంటుందో తెలియని పిల్లలకు ఒక్కసారిగా బయటి ప్రపంచంలో ఒడిదుడుకులు, అనుకోని విమర్శలు ఎదురయినపుడు, అప్పటివరకు ప్రేమని మాత్రమే చూసి ఉండటం వలన, ఒక్కసారిగా వారికి వాటిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు. మరో పక్క తమకు ఎంత ఇచ్చారో అంతా తమనుండి చ‌దువు, ఉద్యోగాల రూపంలో డిమాండ్ చేసే తల్లిదండ్రులకు చెప్పాలంటే అపరాధ భావన వెంటాడుతుంది. దాంతోవారు పూర్తిగా నిరాశా నిస్పృహ‌ల‌కు గుర‌వుతున్నారు. అసలు వారికి మనం గాయపడకుండా ఉండటం ఎలాగో నేర్పడం లేదు…పోనీ ఏ గాయాలూ లేని సమాజాన్ని ఇచ్చామా…అదీ ఇవ్వలేదు. మన చేతులారా మనమే వారి మనసులను గాజుబొమ్మలుగా మార్చి, రాళ్లు కురిసే ప్రపంచంలోకి వెళ్లి ఆనందంగా ధైర్యంగా బతికేయ్ అని చెప్పినట్టుగా ఉంటోంది పరిస్థితి.

ప్రపంచాన్ని మార్చే శక్తి మనకు లేనపుడు, మన పిల్లలకు బయట ప్రపంచాన్ని యధాతథంగా పరిచయమన్నా చేయాలి. వారికి సమస్తం ఇచ్చేసి, పువ్వులా సున్నితంగా చూసుకోవడమే ప్రేమనుకుంటే అంతకంటే పెద్ద పొరబాటు మరొకటి ఉండదు. ఏమీలేని ప్రపంచంలో కూడా ఆనందంగా ధైర్యంగా బతకడమెలాగో నేర్పడమే నిజమైన బాధ్యత అవుతుంది. ఎప్పుడూ మనం డిగ్రీలు, జ్ఞానం, స్నేహితులు, పేరు ప్రఖ్యాతులు, ధనం, గౌరవం ఇలాంటివన్నీ సంపాదించుకోమనే పిల్లలకు చెబుతుంటాం. అలా ఉండడమే గొప్పతనమని నూరిపోస్తుంటాం. మన దృష్టిలో అలా ఉండడం మాత్రమే ప్రపంచం. కానీ మ‌నం అనుకున్న‌వ‌న్నీ అనుకున్న‌ట్టుగా జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు కూడా…అందుకు కూడా సిద్ధ‌ప‌డి ఉండాలి… అనే క‌నీస జ్ఞాన‌మే అన్నింటికంటే గొప్ప జ్ఞాన‌మ‌ని పిల్ల‌ల‌కు చెప్పాలి.

తల్లిదండ్రులు వాళ్ల ప్రాణాలన్నీ తమమీదే పెట్టుకుని బతుకుతున్నారన్న సంగతి పిల్లలకు అర్ధమవుతుంది. కానీ ఈ ఒత్తిళ్ల ప్రపంచంలో పిల్లలు ఒదగలేకపోవచ్చు…అప్పుడు వారేం చేయాలి? ఈ ప్రశ్న పిల్లలకు వేయవద్దు. అమ్మానాన్నలు త‌మ‌కు తాము వేసుకోవాలి. పిల్లలు తాము పుట్టి పెరిగిన పొదరిల్లు దాటి భవిష్యత్తులో బతకబోయేది మ‌న‌ కలల ప్రపంచంలో కాదని, అత్యంత కృతకంగా, అస్తవ్యస్తంగా ఉన్న ప్రపంచంలోనని మ‌నం గుర్తుంచుకోవాలి. పిల్లలు మనకు అందమైన పువ్వులే…కానీ వారు మానసికంగా సుశిక్షితులైన సైనికులుగా పెరిగితేనే వారు ఇతరుల మాటలకు గాయపడకుండా ఉంటారు…అలాగే ఇతరులను గాయపరచకుండా, తమనితాము గాయపరచుకోకుండానూ ఉంటారు. ఏమంటారు…..

-వడ్లమూడి దుర్గాంబ

First Published:  10 Aug 2015 2:24 AM IST
Next Story