Telugu Global
Others

హోదాపై రాహుల్‌ దొంగాట: జగన్‌

ఏపీని విభజన సమయంలో టీవీల్లో సభా వ్యవహారాలు ప్రసారం కాకుండా ఉండేందుకు కాంగ్రెస్‌ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని జగన్మోహనరెడ్డి ఆరోపించారు. లోక్‌సభలో కెమెరాలు ఆపేశారని, సభ తలుపులు మూసేసి వ్యవహారాలు చీకట్లో చక్కబెట్టారని జగన్ గుర్తు చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టడమే కాకుండా ఒక్కరోజంటే ఒక్కరోజు ప్రత్యేక హోదా గురించి పార్లమెంటులో మాట్లాడని పెద్ద మనిషి రాహుల్‌ గాంధీ ఆంధ్రకు వచ్చి ప్రత్యేక హోదాపై పోరాడమని పిలుపు ఇవ్వడం, గొంతు చించుకుని మాట్లాడడం రాజకీయ జిమ్మిక్కని విమర్శించారు. బీజేపీని కూడా […]

హోదాపై రాహుల్‌ దొంగాట: జగన్‌
X
ఏపీని విభజన సమయంలో టీవీల్లో సభా వ్యవహారాలు ప్రసారం కాకుండా ఉండేందుకు కాంగ్రెస్‌ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని జగన్మోహనరెడ్డి ఆరోపించారు. లోక్‌సభలో కెమెరాలు ఆపేశారని, సభ తలుపులు మూసేసి వ్యవహారాలు చీకట్లో చక్కబెట్టారని జగన్ గుర్తు చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టడమే కాకుండా ఒక్కరోజంటే ఒక్కరోజు ప్రత్యేక హోదా గురించి పార్లమెంటులో మాట్లాడని పెద్ద మనిషి రాహుల్‌ గాంధీ ఆంధ్రకు వచ్చి ప్రత్యేక హోదాపై పోరాడమని పిలుపు ఇవ్వడం, గొంతు చించుకుని మాట్లాడడం రాజకీయ జిమ్మిక్కని విమర్శించారు. బీజేపీని కూడా ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్‌ ఐదేళ్ళపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామంటే కాదు… పదేళ్ళు… పదిహేనేళ్ళు అని పార్లమెంటులో డంభాలు పలికిన బీజేపీ ఇపుడు మాట మారుస్తోందని దుయ్యబట్టారు. అంతేకాకుండా బీజేపీ తన మ్యానిఫెస్టోలో ఆంధ్రకు ఐదేళ్ళు కాదు… పదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిందని, ఇపుడు ఆ మాటే మరిచిపోయినట్టు వ్యవహరిస్తోందని జగన్‌ అన్నారు.
అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపుదామని ఏపీ సీఎం చంద్రబాబును అడిగితే ఆయనకు ఆ విషయం వినిపించ లేదని, తమ మొర చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అయ్యిందని జగన్‌ విమర్శించారు. అసలు చంద్రబాబు ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదో తెలుసా అని జగన్‌ ప్రశ్నించారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో పట్టుబడినందునే నోరు మూసుకుని కూర్చున్నట్టు జాతీయ మీడియాయే చెప్పిందంటూ పత్రికల్లో వచ్చిన వార్తలను ఉదాహరించారు. ప్రజల ఘోషను కేంద్రం దృష్టికి తీసుకు రావడానికే ఈ దీక్ష చేపట్టినట్టు జగన్‌ వివరించారు. పోలవరాన్ని పక్కనపెట్టి లంచాల కోసం కక్కుర్తిపడి చంద్రబాబునాయుడు పట్టిసీమను నెత్తికెక్కించుకున్నాడని ఆయన ఆరోపించారు. ప్రజలకు ఎంతో ఉపయోగపడే ప్రత్యేక హోదాను పక్కన పడేశాడని ఆయన అన్నారు.
సీపీఎం సంఘీభావం
బీజేపీ, టీడీపీ ప్రత్యేక హోదా విషయంలో మోసం చేస్తున్నాయని, విభజన చట్టం సమయంలోనే ఏపీకి న్యాయం చేయాలని పట్టుబట్టామని, అప్పటి ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ తమతో స్వరం కలిపి ఆంధ్రప్రదేశ్ వాదనతో ఏకీభవించిందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గుర్తు చేశారు. హోదా సాధించే వరకు వైసీపీతో కలిసి పోరాటం చేస్తామని అన్నారు. ఇపుడు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఖండిస్తున్నామని ఏచూరి అన్నారు.
First Published:  10 Aug 2015 10:42 AM IST
Next Story