Telugu Global
Family

భ్రమరకీటక న్యాయం (Devotional)

సంస్కృతంలో భ్రమరకీటక న్యాయం అంటారు. అంటే తుమ్మెద, పురుగుకు సంబంధించిన న్యాయం. గ్రామీణ ప్రాంతాల్లో పరిశీలిస్తే ఆ దృశ్యం మనకు కనిపిస్తుంది. ఈ తుమ్మెదకు, పురుగుకు సంబంధించి మనవాళ్ళు చేసిన ఊహ అద్భుతంగా ఉంటుంది. భారతీయులలో భావుకత్వం ఎక్కువ. శాస్త్రీయతలో ఊహకు ఆస్కారముండదు. భావుకత్వంలో దానికి ఆస్కారముంటుంది. ఈ తుమ్మెదకు, పురుగుకు సంబంధించిన వ్యవహారంలో కాల్పనికత చోటుచేసుకుంది. అసలు వాస్తవమేమిటంటే తుమ్మెద చెట్ల బెరడులకో, గోడలకో, తలుపు దూలాలకో బంకమట్టితో గూడు లాంటిది కడుతుంది. ఆ చిన్ని […]

సంస్కృతంలో భ్రమరకీటక న్యాయం అంటారు. అంటే తుమ్మెద, పురుగుకు సంబంధించిన న్యాయం. గ్రామీణ ప్రాంతాల్లో పరిశీలిస్తే ఆ దృశ్యం మనకు కనిపిస్తుంది.

ఈ తుమ్మెదకు, పురుగుకు సంబంధించి మనవాళ్ళు చేసిన ఊహ అద్భుతంగా ఉంటుంది. భారతీయులలో భావుకత్వం ఎక్కువ. శాస్త్రీయతలో ఊహకు ఆస్కారముండదు. భావుకత్వంలో దానికి ఆస్కారముంటుంది.

ఈ తుమ్మెదకు, పురుగుకు సంబంధించిన వ్యవహారంలో కాల్పనికత చోటుచేసుకుంది. అసలు వాస్తవమేమిటంటే తుమ్మెద చెట్ల బెరడులకో, గోడలకో, తలుపు దూలాలకో బంకమట్టితో గూడు లాంటిది కడుతుంది. ఆ చిన్ని గూడులాంటి దానిలో గుడ్లుపెడుతుంది. ఆ గుడ్లనించీ అపరిణిత దశలో ఉన్న పిల్లలు బయటకి వస్తాయి. వాటికి రెక్కలుండవు. అవి తుమ్మెద రూపం పొందడానికి కొంతకాలం పడుతుంది. అంతవరకు వాటికి తిండి అవసరం. అందుకని తుమ్మెద పురుగుల్ని తీసుకొచ్చి ఆ గూట్లోవున్న అపరిణిత దశలోని తన పిల్లలకి (శాస్త్రీయ పరిభాషలో “లార్వా”లంటారు) ఆహారంగా పెడుతుంది. పెట్టి బంకమట్టితో గూటిని కప్పేస్తుంది. పిల్లలు ఆ పురుగుల్ని తిని తుమ్మెద ఆకారాన్ని సంతరించుకుంటాయి. వాటిని మెలకువతో ఉంచడానికో ఎందుకో తుమ్మెద ఆ గూటి చుట్టూ ఝంకారం చేస్తూ తిరుగుతుంది. గూటిని పగలగొట్టుకుని పిల్లతుమ్మెదలు బయటపడతాయి. జనం బయటినించీ తెచ్చిపెట్టిన పురుగులే తుమ్మెదలయి బయటికి వచ్చాయని అంటారు. దాన్నే భ్రమరకీటక న్యాయమన్నారు.

దీన్ని బట్టి కబీరు ఒక గీతంలో “నీ మనసుని దైవధ్యానంలో నిలుపు, భ్రమరం తన గూటి చుట్టూ గానం చేసినట్లు చేయి. ఒకసారి నిన్ను నువ్వు మరచిపోతే నువ్వు ప్రేమించిందిగా నువ్వు మారిపోతావు” అన్నాడు.

మనం భగవన్నామధ్యానంలో లీనమయితే మనం మాయమవుతాం. దేవుడిలో కలిసిపోతూ కరిగిపోతాం. దైవంగా మనం మారిపోతాం. ఐతే అక్కడ మనముండకూడదు. మనమెక్కడ ఉండమో అక్కడే దేవుడుంటాడు. మనం లేకపోవడమంటే మన అహం లేకపోవడం. అనంతకాంతి అంటే దైవకాంతి ఎవడిలోకి అడుగుపెడుతుందో అప్పుడతను దానిలో భాగమవుతాడు.

నువ్వు నిరంతరం ఎలా ధ్యానం చేస్తావో ఆ ధ్యానంలో నువ్వు భాగమవుతావు. అంటే నువ్వే ధ్యానమవుతావు… భక్తికి, జ్ఞానానికి, కళకు అదే అర్థం. అక్కడ మనం మాయమయినప్పుడే అవి ఉంటాయి.

– సౌభాగ్య

First Published:  9 Aug 2015 6:31 PM IST
Next Story