Telugu Global
Family

సూదిరాజు (For Children)

పూర్వకాలం బెంగాల్‌లో మైమన్‌సింగ్‌ అన్న రాజకుమారుడు ఉండేవాడు. అతనికి ఒక గొర్రెల కాపరి ఐన కుర్రాడు స్నేహితుడు. ఇద్దరూ కలిసి చెట్టూ పుట్టలూ తిరిగే వాళ్ళు. నదిగట్టున ఆడుకునేవాళ్ళు. పశువులు మైదానాల్లో మేస్తూ ఉంటే గొర్రెల్ని కాచే కుర్రాడు పిల్లనగ్రోవి వాయించేవాడు. రాజకుమారుడు చెట్టుకింద పడుకుని పిల్లనగ్రోవి పాటను ఆనందంగా వినేవాడు. కొన్ని సందర్భాల్లో ఇద్దరూ చెట్టునీడల్లో కూచుని ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు. ఒకరోజు రాజకుమారుడు మంచి ఉత్సాహంగా ఉన్నాడు. తన స్నేహితుడయిన గొర్రెల్ని కాచే కుర్రాణ్ణి చూసి […]

పూర్వకాలం బెంగాల్‌లో మైమన్‌సింగ్‌ అన్న రాజకుమారుడు ఉండేవాడు. అతనికి ఒక గొర్రెల కాపరి ఐన కుర్రాడు స్నేహితుడు. ఇద్దరూ కలిసి చెట్టూ పుట్టలూ తిరిగే వాళ్ళు. నదిగట్టున ఆడుకునేవాళ్ళు. పశువులు మైదానాల్లో మేస్తూ ఉంటే గొర్రెల్ని కాచే కుర్రాడు పిల్లనగ్రోవి వాయించేవాడు. రాజకుమారుడు చెట్టుకింద పడుకుని పిల్లనగ్రోవి పాటను ఆనందంగా వినేవాడు. కొన్ని సందర్భాల్లో ఇద్దరూ చెట్టునీడల్లో కూచుని ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు.

ఒకరోజు రాజకుమారుడు మంచి ఉత్సాహంగా ఉన్నాడు. తన స్నేహితుడయిన గొర్రెల్ని కాచే కుర్రాణ్ణి చూసి మనం జీవితాంతం స్నేహితులుగానే ఉందాం. నేను పెరిగి పెద్దవాడయి దేశానికి రాజయ్యాక తప్పకుండా నిన్ను మంత్రిని చేస్తాను అన్నాడు.

ఆ మాటల్తో ఆనందం తట్టుకోలేక గొర్రెల్ని కాచే కుర్రాడు ఆనందబాష్పాలు కార్చాడు. “మిత్రమా! నీ స్నేహానికి, దయకు నేను కృతజ్ఞుణ్ణి. కానీ తిరిగి నీకు ఏమి ఇవ్వలేని పేదవాణ్ణి. కానీ జీవితాంతం నీకు రుణపడి ఉంటానని, స్నేహాన్ని నిలుపుకుంటానని మాత్రం నీకు హామీ ఇస్తున్నా” అన్నాడు.

మిత్రుడి మాటలకు రాజకుమారుడు ఎంతో సంతోషించాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. రాజకుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు. క్రమంగా గొర్రెల్ని కాచే కుర్రాడికి దూరమయ్యాడు. రాజకుమారుడి విద్యాభ్యాసం సామాన్యమైంది కాదు. ఎన్నోకళల్లో అతను శిక్షణ పొందాలి. చదువుకోవాలి. విలువిద్యలో నైపుణ్యం సంపాదించాలి. వెనకటిలా తీరుబడిగా తిరుగుతూ స్నేహితుడితో కాలక్షేపం చేసే అవకాశం తప్పిపోయింది. క్రమక్రమంగా రాజకుమారుడు తన స్నేహితుణ్ణి మరచిపోయాడు.

రాజు చనిపోవడంతో యువరాజుకు పట్టాభిషేకం జరిగింది. రాజ్యభారాన్ని మోయాల్సి వచ్చింది. యువరాజు తన స్నేహితునికి ఇచ్చిన మాటను మరిచిపోయాడు. కానీ ఆ విషయాన్ని గొర్రెల కాపరి మరచిపోలేదు. ఐనా ఆ విషయం గురించి వెళ్ళి రాజుగారికి విన్నవించాలని ఎప్పుడూ అనుకోలేదు. మౌనంగా ఉండిపోయాడు. పరిస్థితులు ఎప్పటికయినా మారుతాయని మాత్రమే అనుకున్నాడు. కానీ తన మిత్రుడు రాజు అయినందుకు ఎంతో ఆనందించాడు. అతను సుఖంగా ఉండాలని దైవాన్ని కోరుకున్నాడు.

ఇప్పడు యువరాజు కాదు. అతను మహారాజు. అతనికి వైభవంగా వివాహం జరిగింది. భార్యపేరు కాంచనమాల. నగరమంతా ఉత్సవం కోలాహలంగా జరిగింది. గొర్రెల కాపరికి తన మిత్రుడి భార్య ఎలా ఉంటుందో చూడాలనిపించింది. అతను రాజభవనం దగ్గరికి వచ్చాడు. భవనం ముందు కాపలా కాచే సైనికులున్నారు. అతను ”రాజుగారు నా స్నేహితుడు. పెళ్ళి చేసుకునే ముందు తన భార్యని కనీసం నాకు చూపించనైనా లేదు. నన్ను పంపండి. లోపలికి వెళతాను”అన్నాడు.

కాపలా ఉన్న సైనికులు వీడెవడో పిచ్చివాడిలా ఉన్నాడని అక్కణ్ణించీ తరిమేశారు. ఆ చర్యతో గొర్రెల కాపరి మనసు గాయపడింది. తనకు ఇంత అవమానం జరిగాకా ఇక ఈ నగరంలో ఉండడం నా వల్లకాదు అనుకుని ఆ నగరం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు.

మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేస్తూనే రాజుగారికి ఒక అసాధారణ విషయం జరిగింది. అతను కళ్ళు తెరవడమే కష్టమైపోయింది. కారణం లెక్కలేనని సూదులు అతని శరీరం నిండా ముళ్ళలా మొలిచాయి. కళ్లు, పెదాలు, ముక్కు, తల, చేతులు, కాళ్ళు ఒకటేమిటి? అణువణువూ ముళ్ళే. అతని తలవెంట్రుకలన్నీ ముళ్ళుగా, సూది ముళ్ళుగా మారిపోయాయి. దాదాపు ముళ్ళపందిలా మారిపోయాడు. శరీరమంతా పట్టరాని నొప్పి. ఎందుకో హఠాత్తుగా అతని మిత్రుడయిన గొర్రెల కాపరి గుర్తొచ్చాడు. అతనికి ఇచ్చిన హామీ గుర్తొచ్చింది. బహుశా అతనికి చేసిన నమ్మకద్రోహ ఫలితమే ఈ శిక్ష అనుకున్నాడు. కానీ అప్పటికే ఆలస్యమయిపోయింది. కాని అతని ఆలోచనల్ని బయటపెట్టే శక్తిని అతను కోల్పోయాడు. దాంతో అట్లా చిత్రహింస పడుతూ ఉండిపోయాడు.

రాజుగారి పరిస్థితి చూసి చలించి పోయింది రాణి. ఆమె సుప్రసిద్ధ వైద్యుల్ని, జ్యోతిష్కుల్ని పిలిపించింది. కాని ఎవరూ రాజుగారి ఆరోగ్యాన్ని బాగుపరచలేకపోయారు. ఏంచెయ్యాలో రాణిగారికి పాలుపోలేదు. చివరికి మెల్లగా రాజుగారి శరీరం నించీ ఒక్కోసూదినీ లాగి వెయ్యడానికి ఆమె ప్రయత్నించింది. కానీ ఆ సూదులు ఎంతగా శరీరంలోకి ఉన్నాయంటే వాటిని లాగడం దాదాపు అసాధ్యమైపోయింది. రాణి కన్నీరుమున్నీరయింది. రాజుగారి నరకయాతనను చూడడం మినహా ఆమె ఏమీ చేయలేకపోయింది. ముక్కోటి దేవుళ్లకూ మొక్కుకుంది.

ఒకరోజు రాణి నదిలో స్నానానికని వెళ్ళింది. స్నానానికి గట్టు దిగుతూ ఉంటే ఒక అందమైన అమ్మాయి ”మీ ఇంట్లో పని చెయ్యడానికి ఒక మంచి సేవకురాలు కావాలి? ఆ పనిమనిషి మీ ఎదురుగానే ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే నన్ను మీ పనిమనిషిగా పెట్టుకోండి”అంది.

రాణిగారికి ఆ అమ్మాయిని చూసి ముచ్చటేసింది. ”నీకు రాజుగారి పరిస్థితి తెలుసు కదా! ఆయనకు కొంత ఉల్లాసాన్ని కలిగించగలవా?!”అంది. ఆ అమ్మాయి “రాణిగారూ! నాకు చేతనైనంత ప్రయత్నిస్తాను” అంది. రాణి తన చేతులకున్న రెండు బంగారు గాజులిచ్చి ఆ అమ్మాయిని పనిలో పెట్టుకుంది.

ఆ అమ్మాయి రాణిని చూసి ”మీరు సన్నగా, బాగా అలసి పోయినట్లున్నారు. మంచి స్నానం చేసి ఎన్నో రోజులయినట్లుంది. మీరు మీ నగల్ని, బట్టల్ని వదలి రండి. మీ మెడ, చేతుల, వీపు పడతాను. మీరు అలా చేయించుకుంటే మీకు ఎంతో హాయిగా ఉంటుంది”అంది.

రాణిగారికి ఆ అమ్మాయి మాటలు ఎంతో మధురంగా అనిపించాయి. మనసు తెలిసి మాట్లాడే పిల్లలా అనిపించింది.

”అమ్మాయ్‌! నీ మాటలు మధురంగా ఉన్నాయి. నువ్వు చెప్పింది నిజమే రాజుగారి సేవలో నా గురించి నిర్లక్ష్యం చేశాను. కానీ నా ఒళ్ళు నేను రుద్దుకోగలను. ఐతే నేను గట్టుమీద పెట్టే నగలమీద దృష్టిపెట్టు. నేను స్నానం చేసి వస్తాను”అంది. ఆ అమ్మాయి సరే నంది. రాణిబట్టలు, నగలు గట్టుపై పెట్టి నదిలోకి వెళ్ళి విశ్రాంతిగా స్నానం చేసింది.

రాణి నీళ్ళలో మునక లేసి లేచేసరికల్లా గట్టుమీది అమ్మాయి రాణిగారి వస్త్రాలు తాను వేసుకుంది. అట్లాగే నగలు ధరించింది. రాణి స్నానం చేస్తూనే ఉంది.

అంతలో గట్టుమీద ఉన్న అమ్మాయి ”ఓ బద్ధకస్తురాలా! పనిమనిషీ! ఎంత సేపు స్నానం చేస్తావు. నువ్వు స్నానం చేసేంత సేపు ఇక్కడ రాణిగారు నీకోసం ఎదురు చూడాలా?” అని అరిచింది.

రాణిగారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. గట్టుమీది అమ్మాయిని చూసింది. ఆశ్చర్యమేమంటే తన బట్టలు, నగలు ఆ అమ్మాయి ధరించడమే కాదు. అచ్చం తనలా మారిపోయింది. తను ఆ అమ్మాయిలా మారిపోయింది. ఎవరో మంత్రగత్తె దుష్టశక్తుల్ని తనమీద ప్రయోగించిందని రాణి అర్థం చేసుకుంది. కానీ జరగాల్సింది జరిగిపోయింది. తన తెలివితక్కువ తనానికి రాణి తనని తాను నిందించుకుంది. మౌనంగా కొత్తరాణిని అనుసరించింది. కదిలే కన్నీళ్లతో వెంట నడిచింది.

వాళ్ళు రాజభవనాన్ని సమీపించారు. రాణిగా మారిపోయిన ఆమె పేరు కనకమాల. ఆమె అక్కడున్న మంత్రులపై ఆగ్రహం ప్రకటించింది. దుర్భాషలాడింది. తన స్నాన ఘట్టానికి పల్లకీని ఎందుకు పంపలేదని అరిచింది. అందరూ ఆమె మాటల్తో బిత్తరపోయారు. ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడూ అట్లాంటి అనుభవం లేదు. ఎంతో సౌమ్యంగా కనిపించే రాణి ఎందుకిట్లా మారిపోయింది”అని ఆశ్చర్యపోయారు.

నకిలీ రాణి కనకమాల రాణి అయింది. అసలు రాణి వంట ఇంట్లో పనిమనిషయింది. అసలు రాణి తన దురదృష్టానికి కుమిలిపోయింది. పూర్వజన్మలో తనేం పాపం చేశానో అనుకుంది.

రోజులు సాగాయి. ఒకరోజు అసలు రాణి నదికి స్నానానికి వెళ్లింది. దార్లో ఒక మనిషి కూచుని ఉన్నాడు. అతని దగ్గర చాలా పెద్ద దారపు ఉండ ఉంది. అతను ”నాకు వెయ్యి సూదులు దొరికితే ఎన్నో బట్టలు కుడతాను. లక్ష సూదులు దొరికితే ఒక రాజ్యాన్నే ఇస్తాను”అంటూ ఉన్నాడు.

అసలు రాణి ఆ మాటలు విని అతని దగ్గరికి వెళ్ళి ”అయ్యా! మీ మాటలు చిత్రంగా ఉన్నాయి. నేను లక్షల సూదులు ఉన్న ఒక స్థలం చూపిస్తాను. అయితే వాటన్నిటినీ అక్కడినించీ మీరు లాగగలరా!” అంది. అతను తప్పకుండా అన్నాడు. ‘ఐతే నాతో రండి’ అంది. అతను రాణిని అనుసరించాడు. తనతో బాటు పెద్ద దారపు ఉండను కూడా మోసుకుని బయలుదేరాడు.

దారిలో రాణి తన విషాదగాధను వివరించింది. తన భర్త పరిస్థితి, తన దైన్యం వివరించింది. అతను అన్నీ మౌనంగా విన్నాడు. ఏమీ మాట్లాడలేదు. తన పట్ల దయ దలచమని రాణి వేడుకుంది.

ఇద్దరూ అంతఃపురంలోకి వచ్చారు. కొత్త వ్యక్తిని చూసి నకిలీ రాణి సందేహించింది. ఆ కొత్త వ్యక్తి నకిలీరాణిని చూసి “నీ నాటకం బట్టబయలు కాబోతోంది. రాణి వస్త్రాలు, నగలు అపహరించి ఆమెను సేవకురాల్ని చేసి నువ్వు రాణి వేషం వేసి అజమాయిషీ చెలాయిస్తున్నావు. ఇప్పటికయినా తప్పు ఒప్పుకో” అన్నాడు. ఆ మాటల్తో నకిలీరాణి ముఖం పేలవమైంది. వెంటనే తేరుకుని అక్కడున్న సేవకుల్తో ”ఇతన్ని బంధించండి”అంది.

కొత్త వ్యక్తి తన దారపు ఉండను చూసి ”ప్రియమైన దారమా! వీళ్లని బంధించు” అన్నాడు. దారపు ఉండ గాలిలోకి లేచింది. దాన్నించీ దారం సాగి సేవకుల్ని బంధించింది.

ఇప్పుడు నకిలీ రాణిని బంధించు అన్నాడు. దారం నకిలీరాణిని చుట్టుకుని గట్టిగా బంధించింది.

అతను “ఇప్పుడు సమయం వచ్చింది. దారమా!నువ్వు వెళ్ళి రాజు శరీరంపై ఉన్న సూదుల్ని చుట్టి లాగి అవన్నీ నకిలీ రాణి శరీరంలో గుచ్చుకునేట్టు చేయి” అన్నాడు. దారం చెప్పినట్లే చేసింది.

ఆ కొత్తవ్యక్తి ఎవరో కాదు. రాజు చిన్నప్పటి మిత్రుడు. గొర్రెల్ని కాచే కుర్రాడు. రాజు కన్నీళ్లతో మిత్రుణ్ణి, కౌగిలించుకుని క్షమాపణలు కోరాడు. తన మంత్రిగా నియమించుకున్నాడు.

ఆ విధంగా పాతమిత్రులు కలిసి కథ సుఖాంతమైంది.

– సౌభాగ్య

First Published:  5 Aug 2015 1:02 PM GMT
Next Story