Telugu Global
Family

దక్షుడు (For Children)

నవ బ్రహ్మల్లో ఒక బ్రహ్మ దక్షప్రజాపతి. బ్రహ్మ కుడిచేతి బొటన వేలినుండి పుట్టిన దక్షుడు అదే బ్రహ్మ ఎడమచేతి నుండి పుట్టిన ధరిణిని పెళ్ళాడాడు. అంతులేని సంతానం అతనిది. కీర్తి, లక్ష్మ, ధృతి, మేధ లాంటి యాభైమంది కూతుళ్ళను, అయిదుగురు కొడుకుల్ని కన్నాడు. యమ ధర్మరాజుకు పదహారుగురు కూతుళ్ళనిచ్చాడు. చంద్రుడికి ఇరవైయ్యేడుగురు కూతుళ్ళనిచ్చాడు. కశ్యపునికి పదముగ్గురు కూతుళ్ళనిచ్చాడు. పెళ్ళిచేసాడు. కాక, ఒక కూతుర్ని అగ్నికి, ఒక కూతుర్ని పితృదేవతలకి, ఒక కూతుర్ని సూర్యునికి, ఒక కూతుర్ని భృగు […]

నవ బ్రహ్మల్లో ఒక బ్రహ్మ దక్షప్రజాపతి. బ్రహ్మ కుడిచేతి బొటన వేలినుండి పుట్టిన దక్షుడు అదే బ్రహ్మ ఎడమచేతి నుండి పుట్టిన ధరిణిని పెళ్ళాడాడు. అంతులేని సంతానం అతనిది. కీర్తి, లక్ష్మ, ధృతి, మేధ లాంటి యాభైమంది కూతుళ్ళను, అయిదుగురు కొడుకుల్ని కన్నాడు. యమ ధర్మరాజుకు పదహారుగురు కూతుళ్ళనిచ్చాడు. చంద్రుడికి ఇరవైయ్యేడుగురు కూతుళ్ళనిచ్చాడు. కశ్యపునికి పదముగ్గురు కూతుళ్ళనిచ్చాడు. పెళ్ళిచేసాడు. కాక, ఒక కూతుర్ని అగ్నికి, ఒక కూతుర్ని పితృదేవతలకి, ఒక కూతుర్ని సూర్యునికి, ఒక కూతుర్ని భృగు మహర్షికి, ఒక కూతుర్ని శివునికి ఇచ్చాడు. సృష్టిని వృద్ధి చేయడమే లక్ష్యంగా దక్షుడు కనిపిస్తాడు.

ఒకరోజు బ్రహ్మ చేసే యజ్ఞాన్ని చూడడానికి వెళ్ళాడు దక్షుడు. దక్షుణ్ని చూడగానే మునులూ దేవతలు లేచి ఆహ్వానించి స్వాగతం పలికారు. తనకూతురైన సతీదేవిని పెళ్ళాడిన అల్లుడైన శివుడు మాత్రం చూసినా లేవలేదు. అగౌరవంగా భావించిన దక్షునికి శివుని మీద చాలా కోపం వచ్చింది. అక్కడే శివుణ్ణి దిగంబరుడని, శ్మశానాల్లో తిరిగేవాడని, పిశాచాల అధిపతి అని – అందుకే మర్యాదలు తెలియలేదని – తన కూతుర్ని ఇచ్చి తప్పుచేశానని నిందించాడు. యజ్ఞాలకు పిలవకూడదని, యజ్ఞాల్లో భాగం మిగతా దేవతలకిచ్చినట్టు ఇవ్వరాదని కూడా శపించి వెనక్కి వచ్చేసాడు. వచ్చి శివుడు లేకుండా యజ్ఞం చెయ్యాలని భావించాడు. మునుల్నీ ఋషుల్నీ దేవతల్నీ అందర్నీ పిలిచాడు. ఆకాశ మార్గంలో వెళ్తున్న దేవతల మాటల్లో తండ్రిచేసే యజ్ఞం “దక్ష యజ్ఞం” గురించి విన్న సతీదేవి తమని పిలవకపోయినా వెళ్దామని – శివుని మౌనాన్ని అంగీకారంగా తీసుకొని వెళ్ళింది. పిలవని పేరంటానికి ఎందుకొచ్చావ్‌? నిన్నెవరు రమ్మన్నారని శివుణ్ణి దూషించి కూతుర్ని అవమానించాడు దక్షుడు. ఆ అవమానాన్ని భరించలేని సతీదేవి యెగాగ్నిని కల్పించుకొని శరీరాన్ని దహనం చేసుకుంది. శివునికి విషయం తెలిసింది. ప్రమధగణాన్ని అడ్డుకున్నాడు. నారదుని ద్వారా విషయం తెలిసిన శివుడు జటాజూటం తీసి నేలకేసి కొట్టడంతో వేయి చేతుల వీరభద్రుడు పుట్టుకొచ్చాడు. దక్షయజ్ఞాన్ని విధ్వంసం చేసాడు. వినాశనాన్ని చూపించాడు. కత్తిగాటు పడని దక్షుడ్ని కిందపడేసి మెడమెలిపట్టి విరిచి తలని హోమగుండంలో వేసి కాల్చేసాడు. దక్షుని భార్యతోపాటు దేవతల వేడుకోలు విని శాంతించిన శివుడు మేకతలని తెచ్చి దక్షుని మెడకు అతికించి బతికించాడు. అహంకారాన్ని అపరాధాన్ని మన్నించమని శివున్ని ప్రాధేయపడ్డాడు. కూతురు చేసిన ప్రాణ త్యాగానికి దుఃఖించాడు.

దక్షునిలాగే ఆయన కొడుకులు సృష్టిని వృద్ధిచేయబోతే – సంసారంలోపడి ముక్తి మార్గాన్ని వదిలిపెడతారా? అని నారదుడు ఆటంకపరిచాడు. దాంతో నారదుడు ఒక్కచోట నిలకడగా ఉండకుండా అయ్యేలా దక్షుడు శపించాడు. బ్రహ్మ శాంతింపజేసినట్టు, దక్షుడు ప్రియ అనే కూతుర్ని బ్రహ్మకు ఇచ్చినట్టు, వారికే నారదుడు మళ్ళీ పుట్టినట్టు చెపుతారు.

తన ఇరవై ఏడుగురు కూతుళ్ళయిన తారలను రోహిణి సమానంగా చంద్రుడు చూడడంలేదని బాధతో కోపంతో దక్షుడు శపించాడు. చంద్రుని క్షయుడవుకమ్మని!.

చంద్రుడు శరణుకోరగా శివుడు చంద్రుణ్ణి తన శిరస్సున ధరించాడు. దాంతో తారలకు దూరమయిన చంద్రుణ్ణి విడిచిపెట్టమన్నాడు దక్షుడు. శివుడు వినలేదు. కాదన్నాడు. దక్షుడు శివుణ్ణి శపించబోతే విష్ణుమూర్తి వచ్చి చంద్రుణ్ణి రెండు భాగాలను చేసి – ఒక భాగం శివునికి మరొక భాగం దక్షునికి ఇచ్చాడు. అందువల్ల దక్షుని శాపం నెరవేరింది. అందుకే చంద్రుడు అమావాస్యకు క్షీణించి – పున్నమినాటికి వృద్ధి చెందుతూ ఉంటాడు!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  1 Aug 2015 6:32 PM IST
Next Story