Telugu Global
Others

హోదాకోసం యుద్ధం చేద్దాం రండి: రాహుల్‌ పిలుపు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడానికి యుద్ధం చేద్దాం రండి అంటూ కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పిలుపు ఇచ్చారు. పార్టీ ఏ స్థాయి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని, ఢిల్లీలో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తాము అందజేస్తామని భరోసా ఇచ్చారు. దీన్నిబట్టి చూస్తే… అందివచ్చిన అవకాశంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు దగ్గర కావాలనుకుంటోంది కాంగ్రెస్‌. ప్రత్యేక హోదా అనే అస్త్రాన్ని ఆధారం చేసుకుని ప్రజల మనసు గెలుచుకుని ముందుకు కదలాలని భావిస్తోంది.  యూపీయే హయాంలోనే ఆంధ్రప్రదేశ్‌ ముక్కచెక్కలయిపోయింది. దీనికి […]

హోదాకోసం యుద్ధం చేద్దాం రండి: రాహుల్‌ పిలుపు
X
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడానికి యుద్ధం చేద్దాం రండి అంటూ కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పిలుపు ఇచ్చారు. పార్టీ ఏ స్థాయి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని, ఢిల్లీలో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తాము అందజేస్తామని భరోసా ఇచ్చారు. దీన్నిబట్టి చూస్తే… అందివచ్చిన అవకాశంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు దగ్గర కావాలనుకుంటోంది కాంగ్రెస్‌. ప్రత్యేక హోదా అనే అస్త్రాన్ని ఆధారం చేసుకుని ప్రజల మనసు గెలుచుకుని ముందుకు కదలాలని భావిస్తోంది.
యూపీయే హయాంలోనే ఆంధ్రప్రదేశ్‌ ముక్కచెక్కలయిపోయింది. దీనికి ప్రధాన బాధ్యత కాంగ్రెస్‌దేనని అందరికీ తెలుసు. యూపీఏ రాష్ట్రాన్ని విడగొట్టే పాపం చేస్తుంటే అసమర్ధ ఆంధ్ర ప్రాంత నాయకులంతా కళ్ళప్పగించి చూశారు. సోనియమ్మ ఏమనుకుంటుందోనని, రాహుల్‌గాంధీ దగ్గరికి రానీయడేమోననే భయంతో కాంగ్రెస్‌ అప్రజాస్వామ్యంగా ఆంధ్రప్రదేశ్‌ను విడగొడుతుంటే దిష్ఠిబొమ్మల్లా చూశారు. అయితే విభజన బిల్లు సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా నష్టపోయిన స్థితిని భర్తీ చేస్తామని ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ లోక్‌సభలో విస్ఫష్టమైన హామీ ఇచ్చారు. ఆది నెరవేర్చకుండా ఇప్పటి బీజేపీ ప్రభుత్వం తాత్సారం చేయడం కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీకి నచ్చడం లేదు. తామే అన్యాయం చేశామనుకుంటుంటే… బీజేపీ కూడా అన్యాయమే చేస్తోందని ఆయన భావిస్తున్నట్టున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం అనూహ్యంగా రాహుల్‌గాంధీ ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి ఫోన్‌ చేసి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ వ్యూహాన్ని అడిగారు. ఇక్కడేముంది చెప్పడానికి? ప్రకటనలు చేయడం తప్ప. అందుకే రాహులే పథ నిర్దేశం చేశారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ శ్రేణులను సమాయత్తం చేయాలని, నాయక గణమంతా కూర్చుని దీనిపై వ్యూహరచన చేయాలని పిలుపు ఇచ్చారు. ఢిల్లీలో ఏ స్థాయి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉంటామని, ఉద్యమ రూపకల్పన చేయాలని ఆయన సూచించారు. తాను జగన్‌పై విమర్శలు గుప్పించడంతో హడావిడిగా ఈ నెల 10న ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేస్తామంటూ ప్రకటించారని, ప్రత్యేక హోదా కోసం ఏడాదిపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జగన్‌ ఎందుకు ఒత్తిడి తేలేదని రాహుల్‌ ప్రశ్నించారు. ‘‘ప్రత్యేక హోదా వస్తే దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీ మారుతుంది. అందుకే, ప్రధాని నరేంద్ర మోదీ జంకుతున్నారు’’ అని రాహుల్‌ అభిప్రాయపడ్డారు. ఇక ప్రత్యేక హోదా ఎవ్వరికీ ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి చేసిన ప్రకటనపై రాహుల్‌ తీవ్రంగా స్పందించారు. ఈ అంశంపై పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌, ఏఐసీసీ ఎస్సీ సెల్‌ జాతీయాధ్యక్షుడు కె.రాజుతో సమావేశమయ్యారు. సోమవారం రాజ్యసభ సభ్యులు చిరంజీవి, కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, దిగ్విజయ్‌సింగ్‌, కె.రాజులతో రాహుల్‌ భేటీ కానున్నారు. హోదా కోసం చేసే పోరాటంపై ప్రణాళిక ఖరారు చేయనున్నారు. సోమవారం జిల్లాల నేతలతో రఘువీరా సమావేశమయి భవిష్యత్‌ కార్యాచరణను ప్లాన్‌ చేసి రాహుల్‌గాంధీకి చెబుతారు. దీంతో రోడ్‌ మ్యాప్‌ తయారు చేయడానికి వీలవుతుంది. ప్రత్యేక హోదా సాధించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మనసులు గెలుచుకోవాలన్న రాహుల్‌ తలంపు ఫలిస్తుందో లేదో చూడాలి.
First Published:  1 Aug 2015 10:49 AM IST
Next Story