మార్పు (Devotional)
ప్రాచీన కాలంలో చైనాలో “మిట్జు-హ్సియా” అన్న పేరు గల గొప్ప సౌందర్యరాశి ఉండేది. ఆమె అందం గురించి అందరూ చర్చించుకునేవారు. ఆమె గురించి విని రాజు ఆమెను చూశాడు. తొలిచూపులోనే ఆమెను ప్రేమించాడు. అంగరంగ వైభోగంగా రాజు ఆమెను వివాహమాడాడు. రాజుకు ఎందరో రాణులువున్నా అందరికన్నా రాజుకు ఆమె అంటేనే ఇష్టం. ఆమె అన్ని సౌకర్యాలు కలిగించాడు. ఆమెకు ఎన్నో బహుమతులు ఇచ్చాడు. వాళ్ళ అన్యోన్యత చూసి అందరూ ఇష్టపడేవాళ్ళు. రాజుగారికి ఒక రథం ఉంది. అది […]
ప్రాచీన కాలంలో చైనాలో “మిట్జు-హ్సియా” అన్న పేరు గల గొప్ప సౌందర్యరాశి ఉండేది. ఆమె అందం గురించి అందరూ చర్చించుకునేవారు. ఆమె గురించి విని రాజు ఆమెను చూశాడు. తొలిచూపులోనే ఆమెను ప్రేమించాడు.
అంగరంగ వైభోగంగా రాజు ఆమెను వివాహమాడాడు. రాజుకు ఎందరో రాణులువున్నా అందరికన్నా రాజుకు ఆమె అంటేనే ఇష్టం. ఆమె అన్ని సౌకర్యాలు కలిగించాడు. ఆమెకు ఎన్నో బహుమతులు ఇచ్చాడు. వాళ్ళ అన్యోన్యత చూసి అందరూ ఇష్టపడేవాళ్ళు.
రాజుగారికి ఒక రథం ఉంది. అది రాజుగారికి సొంతం. దాన్ని ఇతరులెవరూ ఉపయోగించకూడదు. చివరికి రాణులు కూడా. అట్లా ఆ నియమాన్ని అతిక్రమించి ఎవరయినా ఆ రథాన్ని ఉపయోగిస్తే వాళ్ళ కాళ్ళు నరికేసేవారు. అందుకని అందరూ రాజు సన్నిహితులు కూడా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండేవారు.
ఒకసారి “హ్యియా” తల్లి హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం పాలయింది. దాంతో ఆందోళన చెందిన రాణి వెంటనే తన తల్లిని రాజుగారి రథం మీద వైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళింది. ముందుగా రాజుగారి అనుమతి కూడా తీసుకోలేదు.
ఆ సంగతి రాజుగారికి తెలిసింది. రాజు ఆమెని దండించడానికి బదులు అభినందించాడు. తల్లికోసం ఆమె చేసిన సాహసానికి, తల్లిపట్ల ఆమెకున్న ప్రేమకు ఆమెను ప్రశంసించాడు. “తల్లికోసం అంత కఠిన శిక్షను కూడా ఆమె లెక్క చెయ్యలేదు, ప్రేమంటే అలా ఉండాలి” అన్నాడు.
అది జరిగిన కొంత కాలానికి రాజు, రాణి తోటలో విహరిస్తున్నారు. ఒక ఆపిల్ చెట్టులో తాజాగా ఉన్న ఆపిల్ పండుకోసి రాణి రాజుగారికి ఇచ్చి “తినండి” అంది ప్రేమగా.
రాజు మళ్ళీ ఆమెను అభినందిస్తూ “నువ్వు నన్నెంత గొప్పగా ప్రేమిస్తున్నావు. నీ సొంత సుఖాన్ని కూడా త్యాగం చేసి నా ఆనందంలో నీ ఆనందాన్ని చూస్తున్నావు” అన్నాడు.
కాలం ఎప్పుడూ ఒకలాగే ఉండదు కదా!
వయసు పెరిగే కొద్దీ రాణి అందం తరిగిపోయింది. క్రమంగా రాజుగారికి ఆమెపట్ల ఇష్టం తగ్గిపోయింది. ఆమెపట్ల నిర్లక్ష్యం పెరిగింది. ఆమె తెలియక ఏ చిన్ని పొరపాటుచేసినా రాజు ఆమెని గద్దించేవాడు. తక్కువ చేసేవాడు. గతాన్ని తవ్వి ఆమెను నిందించేవాడు.
పైగా “నాకు గుర్తుంది. నా అనుమతి లేకుండా నా రథాన్ని తీసుకెళ్ళడం మరచిపోయాననుకున్నావా? ఇంకోసారి నువ్వు కొరికి ఇచ్చిన పండు సంగతి కూడా గుర్తుంది” అనేవాడు.
అనురాగానికి కాక అందానికి విలువ ఇస్తే అలాగే ఉంటుంది. అందం శాశ్వతం కాదు. అనురాగం శాశ్వతం. రాణికి మొదటినించి చివరిదాకా రాజంటే ప్రేమ. రాజుకు మాత్రం ఆమె అందంగా ఉన్నన్ని నాళ్ళూ ఇష్టం ఉండేది.
ఈ మార్పుని మౌనంగా కన్నీళ్ళతో రాణి భరించింది.
– సౌభాగ్య