స్వతంత్రుడు (Devotional)
కాబూల్ నగరంలో ఇద్దరు బాగా బతికినవాళ్ళు వ్యాపారాల్లో దివాలాతీసి పేదవాళ్ళయిపోయారు. దరిద్రం నించి బయటపడే మార్గమే వాళ్ళకు తోచలేదు. పొరుగుదేశాన్ని సుల్తాన్ మహమ్మద్ పరిపాలించేవాడు. ఆయన దయకలిగినవాడని, పేదవాళ్ళకు సాయం చేస్తాడని విన్నారు. ఇద్దరూ పొరుగు దేశానికి బయల్దేరారు. దారిలో ఇంకోవ్యక్తి కలిశాడు. అతను ఎంతో ఉల్లాసంగా, హాయిగా, ఆనందంగా కనిపించాడు. అతను తక్కిన ఇద్దరూ ఎంతో దిగులుగా కనిపించడం చూసి “ఎందుకు మీరంత దిగులుగా ఉన్నారు?” అని అడిగాడు. వాళ్ళు తాము ఒకప్పుడు ఎంతో గొప్పగా […]
కాబూల్ నగరంలో ఇద్దరు బాగా బతికినవాళ్ళు వ్యాపారాల్లో దివాలాతీసి పేదవాళ్ళయిపోయారు. దరిద్రం నించి బయటపడే మార్గమే వాళ్ళకు తోచలేదు. పొరుగుదేశాన్ని సుల్తాన్ మహమ్మద్ పరిపాలించేవాడు. ఆయన దయకలిగినవాడని, పేదవాళ్ళకు సాయం చేస్తాడని విన్నారు. ఇద్దరూ పొరుగు దేశానికి బయల్దేరారు. దారిలో ఇంకోవ్యక్తి కలిశాడు. అతను ఎంతో ఉల్లాసంగా, హాయిగా, ఆనందంగా కనిపించాడు. అతను తక్కిన ఇద్దరూ ఎంతో దిగులుగా కనిపించడం చూసి “ఎందుకు మీరంత దిగులుగా ఉన్నారు?” అని అడిగాడు. వాళ్ళు తాము ఒకప్పుడు ఎంతో గొప్పగా బతికామని ఇప్పుడు ఆస్తిపాస్తులు కోల్పోయి బికారులయి పోయామని, పొరుగుదేశాన్ని పాలించే సుల్తాన్ మహమ్మద్ ఎంతో దయగలవాడని విన్నామని ఆయన్ని కలిస్తే ఏమయినా సాయం లభిస్తే తమ కష్టాలు గట్టెక్కవచ్చన్న ఆశతో వెళుతున్నామని చెప్పారు. వాళ్ళిద్దరూ చెబుతున్నదాన్ని మూడోవ్యక్తి ప్రశాంతంగా విన్నాడు. వాళ్ళిద్దరూ మూడో వ్యక్తిని “మరి నువ్వెక్కడికి వెళుతున్నావు?నీ బాధ లేమిటి?” అని అడిగారు.
మూడో వ్యక్తి “నాకు ఆస్తిపాస్తులూ లేవు, బాధలూ లేవు. నేను సంచారిని. నేను ఎవర్నీ ఏదీ అభ్యర్థించను. దేవుడిచ్చిన దానితో సంతృప్తి పడతాను. ఈ దేశం తిరిగాను. ఇప్పుడు ఆ దేశం వెళుతున్నాను” అన్నాడు.
సుల్తాన్ మహమ్మద్ పరిపాలించే దేశంలోకి ముగ్గురూ ప్రవేశించారు. చీకటి పడుతూవుంటే ఆ రాత్రికి బస చెయ్యడానికి దగ్గర్లో ఒక సత్రముంటే అక్కడికి వెళ్ళారు. తెచ్చుకున్న రొట్టెలు తిని పడుకోబోయేంతలో ఎవరో ఇద్దరు కొత్త వ్యక్తులు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళలో ఒకతను సుల్తాన్ మహమ్మద్. రెండోవ్యక్తి అతని మంత్రి. వాళ్ళు మారు వేషాల్లో దేశసంచారం చేస్తూ అక్కడ ఆ రాత్రి బస చెయ్యడానికి ఆగారు.
మాటామాటా కలిశాయి. సుల్తాన్ ఆ ముగ్గుర్నీ వాళ్ళ ప్రయాణం గురించి అడిగారు.
మొదటి వ్యక్తి “నేను ఒకప్పుడు బాగా బతికిన వాణ్ణి. ఇప్పుడు పేదవాణ్ణి. సుల్తాన్ మహమ్మద్ దయగలవాడని విని ఆయన సాయం కోరదామని వెళుతున్నాను. ఆయన ఒక వెయ్యి దీనార్లు ఇస్తే మళ్ళీ నా పూర్వ వైభవాన్ని పొందుతాను” అన్నాడు.
రెండో వ్యక్తి “నేనూ బాగా బతికిన వాణ్ణే. ఇప్పుడు పేదవాణ్ణి. అందగత్తె అయిన నా భార్య నా దరిద్రం వల్ల బలహీనంగా, అందవికారంగా తయారై చనిపోయింది. చక్రవర్తి అంతఃపురంలో బోలెడు మంది స్త్రీలుంటారు. వాళ్ళలో ఒకర్ని నాకు ఇవ్వకపోతారా? అన్న ఆశతో వెళుతున్నా” అన్నాడు.
సుల్తాన్ మూడో వ్యక్తిని చూసి “నీ సంగతేమిటి?” అని అడిగాడు.
మూడోవ్యక్తి “నేను సంచారిని. నాకు కోరికలు లేవు. దేవడు ఎవడికి ఏది కావాలో అది ఇస్తాడు. అదనంగా ఆశించడం పాపం. నేను ఎవర్నీ ఏదీ కోరడానికి వెళ్ళడం లేదు. నేను సంచరించేవాణ్ణి కాబట్టి వెళుతున్నా” అన్నాడు.
తెల్లవారాక సుల్తాన్ తన నగరానికి వెళ్ళి భటుల్ని పంపి ఆ ముగ్గుర్నీ తన ఆస్థానానికి రప్పించారు. ఆ ముగ్గురూ రాత్రి తమతో వున్న వ్యక్తి సుల్తాన్ అని తెలుసుకున్నారు. సుల్తాన్ ఏమీ మాట్లాడకుండా మొదటివ్యక్తికి వెయ్యి దీనారాలిచ్చాడు. రెండో వ్యక్తికి తన అంతఃపురంలోని ఒక అందగత్తెనిచ్చాడు.
మూడోవ్యక్తి వేపు చూసి “నువ్వూ ఏమైనా అడుగు ఇస్తాను” అన్నాడు.
మూడోవ్యక్తి “సుల్తాన్! నాకు ఏది అవసరమో దేవుడు ఇస్తాడు. నేను ఏదైనా కోరినా అది స్వార్ధమవుతుంది. మీరు సహాయం చెయ్యడానికి సిద్ధంగా ఉండవచ్చు. నాకు కోరికలు లేవు. నా అవసరాలు చిన్నవి. వాటికోసం మిమ్మల్ని అభ్యర్ధించాల్సిన అవసరం లేదు” అన్నాడు.
ముగ్గురూ బయటికి వచ్చి బయల్దేరారు.
మూడోవ్యక్తి నిర్ద్వంద్వంగా సహాయాన్ని తిరస్కరించడం చక్రవర్తికి చాలా చిన్నతనమనిపించింది. సమయానికి దుర్మార్గుడయిన ఒక సలహాదారు “సుల్తాన్! మీ సాయం స్వీకరించకపోవడం మిమ్మల్ని అవమానించడం లాంటిదే. వెంటనే వాడి తల నరికించండి” అన్నాడు.
సుల్తాన్ ఇద్దరు సైనికుల్ని పిలిపించాడు.
“ఒకడు దీనార్‌ల సంచి మోస్తూ ఉంటాడు. ఒకతనితో బాటు ఒక స్త్రీ వెళుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కాక ఒకతను ఒంటరిగా వెళుతూ ఉంటాడు. వెంటనే వెళ్ళి ఆ మూడోవ్యక్తి తల నరికి తీసుకురండి” అని అజ్ఞాపించాడు. వెంటనే సైనికులు హడావుడిగా బయల్దేరారు.
బయట వెళుతున్న ముగ్గుర్లో మొదటివ్యక్తి దీనార్‌ల సంచి బరువుగా ఉండడంతో కాస్త సాయం చెయ్యమని మూడో వ్యక్తికి ఇచ్చాడు.
మూడో వ్యక్తి ఆ సంచి మోస్తున్నాడు. రెండోవ్యక్తి కొత్త భార్యతో కబుర్లు చెబుతూ నడుస్తున్నాడు. ఇంతలో గుర్రాలమీద వచ్చిన సైనికులు ఒంటరిగా నడుస్తున్న వ్యక్తి తల నరికి క్షణంలో తల తీసుకుని వెళ్ళి చక్రవర్తి ముందుంచారు. చక్రవర్తి ఆ తల చూసి “అరే! పొరపాటు జరిగింది. ఇప్పుడు ఇద్దరే ఉన్నారు కదా! ఒకతను స్త్రీతో మాట్లాడుతూవుంటాడు. అతను కాక మరొకతని తల పట్రండి” అన్నాడు.
మొదటి వ్యక్తి చనిపోయాక దీనార్ల సంచిని మోసే రెండో వ్యక్తిని తన భార్యకు తోడుగా ఉండమని చెప్పి దీనార్ల సంచిని తను మోస్తూ వెనకబడ్డాడు. సైనికులు సుడిగాలిలా వచ్చి దీనార్ల సంచి మోస్తున్న వ్యక్తి తలనరికి రాజుగారి దగ్గరికి పట్టుకెళ్ళారు. రాజుగారు ఆ తల చూసి తలపట్టుకున్నాడు. ఆ మూడో వ్యక్తిని దీనార్లతో, స్త్రీతో తనముందు ఉంచమన్నాడు. వాళ్ళు తీసుకొచ్చారు.
చక్రవర్తి జరిగింది మూడో వ్యక్తితో చెప్పాడు. నువ్వు అదృష్టవంతుడివి. ఈ దీనార్లని, స్త్రీని తీసుకో” అన్నాడు.
మూడోవ్యక్తి “చక్రవర్తీ! అదృష్టాన్ని, దురదృష్టాన్ని నిర్వచించడానికి మన మెవరు? ఈ దీనార్లు, ఈ స్త్రీ అదృష్టం కిందికి ఎలా వస్తాయి? ఇంకొకరు ఇచ్చింది అదృష్టం కాదు. దేవుడు నాకేది ఇచ్చాడో అదే అదృష్టం. దేవుడు నాకు సంపదను కాదు, సంతోషాన్ని ఇచ్చాడు. బంధాన్ని కాదు స్వేచ్ఛను ఇచ్చాడు. అవి ఆయన తీసుకుంటే అది ఆయన సంకల్పంగా భావిస్తాను” అన్నాడు.
అతని దృఢ సంకల్పానికి సుల్తాన్ కదిలిపోయి అతనికి నమస్కరించాడు.
మూడో వ్యక్తి “సుల్తాన్! నాదో కోరిక” అన్నాడు.
సుల్తాన్ మొత్తానికి ఏదో కోరుతున్నాడు అని ఆశపడ్డాడు.
మూడోవ్యక్తి “ఆ చనిపోయిన వ్యక్తుల కుటుంబాల్ని ఆదుకోండి” అన్నాడు.
సుల్తాన్ ఆ సంచారి పాదాలపై ప్రణమిల్లాడు.
– సౌభాగ్య