ఎవరన్నారు కలాం లేరని..?
ఎవరన్నారు? కలాం లేరనీ., ఇక రారనీ? కలలున్నంత కాలం కలాం ఉంటారు. వాటిని సాకారం చేసుకునే క్రమశిక్షణలో కలాం ఉంటారు. మనల్ని నడిపిస్తారు. కలాం ఒక వ్యక్తి కాదు. మనిషిలో దాగివున్న విరాట్ శక్తి. ఎవరైనా ఊహించగలరా? ఒక పేపర్‌బాయ్ దేశానికి ప్రెసిడెంట్ కాగలరని? ఎవరైనా ఊహించగలరా ఓ క్షిపణి శాస్ర్తవేత్త సామాజిక శాస్త్రవేత్త కూడా కాగలడని? దార్శనికతతో 2020వైపు మనల్ని నడిపించగలరని?? మ్యాన్ ఆఫ్ డైవర్సిటీ భారత క్షిపణిరంగ పితామహునిగా చాలామంది అబ్దుల్ కలామ్‌ని మ్యాన్ […]
ఎవరన్నారు? కలాం లేరనీ., ఇక రారనీ?
కలలున్నంత కాలం కలాం ఉంటారు. వాటిని సాకారం చేసుకునే క్రమశిక్షణలో కలాం ఉంటారు. మనల్ని నడిపిస్తారు. కలాం ఒక వ్యక్తి కాదు. మనిషిలో దాగివున్న విరాట్ శక్తి. ఎవరైనా ఊహించగలరా? ఒక పేపర్‌బాయ్ దేశానికి ప్రెసిడెంట్ కాగలరని? ఎవరైనా ఊహించగలరా ఓ క్షిపణి శాస్ర్తవేత్త సామాజిక శాస్త్రవేత్త కూడా కాగలడని? దార్శనికతతో 2020వైపు మనల్ని నడిపించగలరని??
మ్యాన్ ఆఫ్ డైవర్సిటీ
భారత క్షిపణిరంగ పితామహునిగా చాలామంది అబ్దుల్ కలామ్‌ని మ్యాన్ ఆఫ్ మిసైల్ అని కీర్తిస్తారు. అది నిజమే! కానీ అంతకుమించి ఆయన మ్యాన్ ఆఫ్ డైవర్సిటీ! పుట్టుక నుంచి మరణం వరకు అబ్దుల్ కలామ్ జీవితంలోని ప్రతి మజిలీ ఓ వైవిధ్యభరితమే! సాహసం, సృజనాత్మకతల మేళవింపే! జీవితమనే కాన్వాస్‌పై ఆయన తన వైవిధ్యభరితమైన ఆలోనలతో ఇంద్రధనస్సును ఆవిష్కరించుకున్నారు!
క్షిపణి గర్జన..వీణా నాదం
వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ! నిప్పులు చిమ్ముతూ నీలాకాశంలోకి ఓ క్షిపణి దూసుకెళ్తుంటే..ప్రపంచమంతా నిభిడాశ్చర్యంతో చూస్తుండిపోతుంది. అప్పుడు ఆ శాస్ర్తవేత్త పొందే అనందం అనంతం! కానీ అబ్దుల్‌కలామ్ క్షిపణి గర్జనను..శ్రీరాగాన్ని సమానంగా ఇష్టపడటం నిజంగా వైవిధ్యమే! హైదరాబాద్‌లోని డిఆర్‌డిఎల్ ల్యాబ్లో పనిచేస్తున్నసమయంలో..క్షణం తీరికలేకుండా పరిశోధనలు జరుపుతున్న కాలంలో కూడా కలామ్ సంగీతం నేర్చుకోవాలన్న తన కలను సాకారం చేసుకున్నారు. 1989 నుంచి 1992 వరకు కళ్యాణి అనే సంగీతం టీచర్ దగ్గర వీణ నేర్చుకున్నారు. రోజూ ల్యాబ్‌లో పని పూర్తి చేసుకుని చిన్నపిల్లాడిలా డిఆర్‌డిఎల్ స్కూల్‌కి వెళ్లి సంగీత పాఠాలు నేర్చుకున్నారు. కర్ణాటక సంగీతమంటే ఆయనకు ఎంతో ఇష్టం!
కలాం ఓ స్నేహగీతం:
కలాం స్నేహశీలి. రోడ్డుపక్కన చెప్పులు కుట్టేవాడు, హోటళ్లో ఇడ్లీ వడ్డించినవాడు కూడా ఆయన స్నేహితులే! రాష్ర్ట్రపతి హోదాలో కేరళలోని రాజ్‌భవన్‌కి వెళ్లి, జూనియర్ సైంటిస్టుగా తిరువనంతపురంలో పనిచేసిన రోజుల్నిగుర్తుచేసుకున్నారు కలాం! ఆ సమయంలో తనకు తారసపడిన ఓ చెప్పులుకుట్టేవాడిని, హోటల్‌లో పనిచేసిన వ్యక్తిని గుర్తుపెట్టుకుని రాజ్‌భవన్‌కి అతిథులుగా ఆహ్వానించారంటే స్నేహానికి ఆయన ఇచ్చే విలువను అర్థం చేసుకోవచ్చు.
చాలామందికి కలాంతో స్నేహం ఒక వ్యసనం! ఒక్కసారి ఆయన పరిచయమయ్యారంటే పిల్లలైనా, దేశాల ప్రెసిడెంటులైనా ఆయన్ను మరచిపోలేరు. కలాం ముస్లిం. రామేశ్వరం ఆలయ పూజారి పిల్లలు ఆయన ప్రియ మిత్రులు. హైస్కూల్లో సోలమన్ మాస్టారితో గురువుకిమించిన స్నేహం! ఎంత గొప్పది వారి బంధం? నిజంగా కలాం స్నేహితుల బతుకు ధన్యం!!
ఖురాన్‌ని చదివి..గీతను అర్థం చేసుకుని..
కలాం మంచి చదువరి. మతాల అడ్డుగోడలను చెరిపేసి ఆయన్ను విశ్వమానవుడిగా నిలబెట్టిన ఉత్ప్రేరకాలు పుస్తకాలే! అవును..కలామ్ ఖురాన్‌ని ఎంత నిష్టగా చదివారో..భగవద్గీతనూ అంతే శ్రద్ధగా అర్థం చేసుకున్నారు. ఆచరణలో కూడా పెట్టారు. అలాగే తిరువళ్లువార్ రచించిన తిరుక్కురల్ కూడా కలామ్‌కు ఇష్టమైన గ్రంథం! జీవితంలో ఎదురైన ఎన్నోసవాళ్లకు తను చదివిన పుస్తకాలు సమాధానం చెప్పేవానేవారు అబ్దుల్ కలామ్!
ప్రతి అక్షరంలో దేశంపై ప్రేమ:
ఆత్మకథలను, వైఫల్యాల గాథలను ఇష్టపడే అబ్దుల్‌కలామ్ ఎన్నో పుస్తకాలను రాశారు. సైంటిస్ట్‌లో దాగివున్న మరో కోణాన్ని ఆవిష్కరించారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ పేరుతో ఆయన రాసిన ఆత్మకథ లక్షల ప్రతులు అమ్మడయింది. చైనా, బ్రెయిలీ భాషతోసహా అనువిదితమై కోట్లాదిమందిని కదిలించింది. ఒక విజేత ఆత్మకథ పేరుతో వాడ్రేవు చినవీరభద్రుడు దీనిని తెలుగులోకి అనువదించారు. దీనితోబాటు ఇండామిటబుల్ స్పిరిట్, ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా 2020, మై జర్నీవంటి పుస్తకాలు రాశారు. ఆయన ప్రతి అక్షరంలో దేశంపై ప్రేమ, అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ని చూడాలన్న తపన, కలలు నిజం చేసుకోవడానికి కష్టపడాలన్న సందేశం కనిపిస్తాయి.
సాహసాల రాష్ట్రపతి:
మద్రాస్ ఐఐటిలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివిన కలామ్ పైలెట్ కావాలనుకున్నారు. తన కలలకు రెక్కలు తొడిగి గగన విహారం చేయాలనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. విధి ఆయన్ను రక్షణరంగ పరిశోధనలవైపు నడిపించింది. తర్వాతికాలంలో అంతరిక్ష పరిశోధనలకు కొత్త బాట వేసేలా చేసింది. భారత అమ్ములపొదిలో అగ్ని, పృథ్వి, ఆకాశ్, నాగ్, త్రిశూల్ క్షిపణులను నింపారు. పోఖ్రాన్ అణుపరీక్షలకు నేతృత్వం వహించి అమెరికా శాటిలైట్‌లకు చిక్కకుండా ప్రయోగం విజయవంతం చేశారు. ఊహించనివిధంగా ఆయన భారత రాష్ర్టపతిగా బాధ్యతలు చేపట్టినా ఆయన కళ్లు ఆకాశంవైపే ఆశగా చూసేవి. ఒక రోజు ఆయన కోరిక తీరే శుభఘడియ వచ్చింది. సుఖోయ్ యుద్ధ విమానంలో ఆయన ఆకాశంలోకి దూసుకెళ్లారు. అంతటితో ఆగలేదు. ఐఎన్ఎస్ సింధురక్షక్ సబ్‌మరైన్‌లో కూడా ప్రయాణించారు. జై జవాన్ అంటూ..ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రమైన సియాచిన్‌లో పర్యటించారు. త్రివిధ దళాధిపతిగా సైనికుల్లో స్థైర్యాన్ని నింపారు.
గుండెచప్పుడు తెలిసిన సైంటిస్ట్:
కలాం జీవితంలో మరో వైవిధం..నిమ్స్ వైద్యులతో కలిసి ఆయన చేసిన పరిశోధనలు! రాకెట్లతో స్టంట్స్ చేయించిన కలామ్‌కి.. గుండెకు అమర్చే స్టెంట్ విలువ తెలుసు! పేదల గుండెచప్పుడు ఇంకా బాగా తెలుసు! అందుకే వారి కోసం పదివేలకే కరనరీ స్టెంట్ తయారుచేశారు. అంతవరకు సంపన్నులకే సొంతమైన ఈ చికిత్స సామాన్యులకూ అందుబాటులోకి తెచ్చారు. అలాగే పోలియో రోగులకు అమర్చే ఎఫ్ఆర్వో పరికరం బరువును 300 గ్రాముల నుంచి 150 గ్రాములకు తగ్గించారు. హైదరాబాద్‌లోని డిఆర్‌డివో ల్యాబ్ ఈ పరిశోధనలకు వేదికయింది.
మనసున్న మనిషి:
మిస్సైల్ మ్యాన్‌గా గగనాన్ని జయించడమేకాదు.. కులమతాలను అంటని మనిషిగా భువనాన్ని కూడా జయించారు కలామ్! ఆయన మానవతావాదానికి ప్రపంచం సలామ్ చేసింది! సైన్స్ ఫలాలు సామాన్యులకు అందాలన్న ఆయన్నసంకల్పానికి జేజేలు పలికింది. సైన్స్ విత్ హ్యూమన్ ఫేస్‌గా కీర్తిస్తూ 40 యూనివర్సిటీలు కలామ్‌కి గౌరవ డాక్టరేట్‌లను అందించి..తమ గౌరవాన్ని మరింత పెంచుకున్నాయి. గ్రామాల్లో పట్టణ సదుపాయాలన్నీలభించాలని కలామ్ కలలుగన్నారు. ప్రొవైడింగ్ అర్బన్ ఎమినిటీస్ ఇన్ రూరల్ ఏరియా అనే కార్యక్రమాన్నిచేపట్టారు. తన సేవింగ్స్‌తోబాటు ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి రూపాయినీ పురు ప్రాజెక్టుకే ఇచ్చేశారు. గ్రామీణుల బాధలు తెలిసిన మనసున్న మనిషి కలామ్!
ఎ టీచర్ ఈజ్ ఎ మినియేచర్ ఆఫ్ నేచర్:
సైంటిస్టుగా, రాష్ర్టపతిగా ఎన్ని సేవలందించినా కలామ్‌కు ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టం! పిల్లల్లో దేశ భవిష్యత్తును చూసుకునేవారు. వారి కళ్లల్లో వెలుగును చూసి ఉప్పొంగిపోయేవారు. వేలాదిస్కూళ్లు, కాలేజీలకు వెళ్లి తన ఉపన్యాసాలతో స్ఫూర్తిని నింపేవారు. పరిశోధనలవైపు దృష్టిపెట్టాలని సూచించేవారు. యువతలో సైన్స్‌పై ఆసక్తిని పెంచేశారు. చివరకు ఐఐఎం విద్యార్థుల నుద్దేశించి మాట్లాడుతూ వేదికపైనే కుప్పకూలిపోయారు. ఆయన ఆశ..శ్వాస..విద్యార్థులే!
కలాం మీకు సలామ్..
కలామ్ ఎక్కడికీ పోలేదు. చిన్నారుల బోసినవ్వుల్లో..విద్యార్థుల పరిశోధనల్లో..క్షిపణుల నిప్పురవ్వల్లో..వీణా నాదంలో..ప్రతి ఉపాధ్యాయుడి పాఠంలో ఆయన ఉన్నారు. రాష్ట్రతి భవన్ తులిప్ గార్డెన్‌లో పూస్తున్న పువ్వుల్లో..స్టెంట్ అమర్చుకున్న రోగుల గుండెచప్పుడులో..రామేశ్వరం వీధుల నుంచి హిందూ మహాసముద్రం అంచుల వరకు.. శ్రీహరికోట నుంచి అంతరిక్షంలో భారత విజయ పతాక రెపరెపల్లో అబ్దుల్ కలామ్ జీవించివున్నారు. ప్రపంచానికి స్ఫూర్తి మంత్రమై సజీవంగా మన గుండెల్లో నిలిచిపోతారు. కలామ్..మీకు సలామ్!!