Telugu Global
Others

డి.జె.లను నిషేధించాలి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వశాఖల కన్నా పోలీసుశాఖ పనితీరు చాలా మెరుగుపడింది. నేరస్థులను వీలైనంత త్వరగా అరెస్ట్‌చేయడం, “షీ”టీమ్స్‌తో ఈవ్‌ టీజర్స్‌ ఆటకట్టించడం, బాల కార్మికుల్ని గుర్తించి వాళ్ళ రాష్ట్రాలకు పంపించడం, వ్యభిచార వృత్తిని ప్రోత్సహించేవాళ్ళపై ఉక్కుపాదం మోపడం, రౌడీలు, గుండాలపై పీడీ యాక్ట్‌ పెట్టి  లోపల తొయ్యడం, చైన్‌ స్నాచర్స్‌ ఆగడాల్ని చాలావరకు అరికట్టడం, డ్రంకన్‌ డ్రైవ్‌కు పాల్పడ్డవాళ్ళని శిక్షించడం – ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణా పోలీసుల విజయాలు చాలానే […]

డి.జె.లను నిషేధించాలి
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వశాఖల కన్నా పోలీసుశాఖ పనితీరు చాలా మెరుగుపడింది. నేరస్థులను వీలైనంత త్వరగా అరెస్ట్‌చేయడం, “షీ”టీమ్స్‌తో ఈవ్‌ టీజర్స్‌ ఆటకట్టించడం, బాల కార్మికుల్ని గుర్తించి వాళ్ళ రాష్ట్రాలకు పంపించడం, వ్యభిచార వృత్తిని ప్రోత్సహించేవాళ్ళపై ఉక్కుపాదం మోపడం, రౌడీలు, గుండాలపై పీడీ యాక్ట్‌ పెట్టి లోపల తొయ్యడం, చైన్‌ స్నాచర్స్‌ ఆగడాల్ని చాలావరకు అరికట్టడం, డ్రంకన్‌ డ్రైవ్‌కు పాల్పడ్డవాళ్ళని శిక్షించడం – ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణా పోలీసుల విజయాలు చాలానే ఉన్నాయి.

అలాంటి తెలంగాణ పోలీసులు డిజెలపై నిషేధం విషయంలో ఈ ఏడాది గట్టి పట్టుదలతో ఉన్నారు. గతేడాది కూడా చెవులు పగలగొట్టే మైకులు, డిజెలపై నిషేధం విధించాలనుకున్నా రాజకీయనాయకులు రంగప్రవేశం చేసి దాన్ని సక్రమంగా అమలుకాకుండా చూశారు. రాత్రివేళల్లో మైకుల వినియోగంపై సుప్రీం కోర్టు నిషేధం విధించినా స్థానిక పోలీసులు వాటిని అమలు చేయడంలో విఫలం అవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో బోణాలు, వినాయకచవితి ఉత్సవాలు వచ్చాయంటే హైదరాబాద్‌ ప్రజల గుండెల్లో మైకులు పరుగెడతాయి.

ఇటీవలి కాలంలో హైదరాబాద్‌కు వలస వచ్చే మార్వాడీలు, తదితర ఉత్తర భారత వ్యాపారస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో వినాయక ఉత్సవాలకుతోడు దేవీ ఉత్సవాలు, మరికొన్ని ప్రత్యేక మైకుల, పటాసుల ఉత్సవాలు జతకలిశాయి. క్రమేణా హైదరాబాద్‌ సంస్కృతిపోయి మార్వాడీ సంస్కృతి నగరంలో పెరిగిపోయింది. ఇప్పుడు హైదరాబాద్‌ను వాళ్ళు, వాళ్ళ రణగణ ధ్వనులు శాసిస్తున్నాయి. ఇవన్నీ కలిసి ప్రశాంతంగా జీవించాలనుకునే వారికి నరకం చూపిస్తున్నాయి. చెవులు చిల్లులుపడే శబ్దాల మధ్య తప్ప భక్తి కార్యక్రమాలను జరుపుకోలేమా? అనారోగ్యంతో బాధపడుతున్న ముసలివాళ్ళు, పసి పిల్లలు, చదువుకునే విద్యార్థులు ఈ ఉత్సవాల రోజుల్లో మానసిక క్షోభని అనుభవిస్తున్నారు. సౌండ్స్‌ తగ్గించమంటే నిర్వాహకులకు కోపం. మన హిందువుల పండగల్ని అదిరిపోయేలా చేసుకోవాలంటారు, మతంతో ముడిపడ్డ రాజకీయ పార్టీల కార్యకర్తలు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చెయ్యకుండా ఎవరం కంప్లైంట్‌ చేశామో ఆ నిర్వాహకులకు చెబుతారు. వాళ్ళొచ్చి గొడవ చేస్తారు. ఆ బాధల కన్నా సౌండ్స్‌ బాధలే తక్కువని ప్రజలు మౌనంగా బాధపడుతున్నారు.

ఈ నేపధ్యంలో నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి డిజే సౌండ్ సిస్టమ్‌పై, అర్ధరాత్రి మైకులపై నిషేధం విధించడాన్ని నగర ప్రజలు హర్షిస్తున్నారు. మతసంస్థలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు చేసి ఆ రణగణ ధ్వనుల్ని మాపై రుద్దవద్దని ప్రజలు అభ్యర్ధిస్తున్నారు. సౌండ్‌ సిస్టమ్స్‌ని నిషేధిస్తే మా ఉపాధి పోతుందని కొందరు వాదించడం సిగ్గుచేటుగా ఉందని, మీ లాభాల కోసం ప్రజల ఆరోగ్యం, పిల్లల చదువులు పాడుకావాలా అని ప్రజలు నిలదీస్తున్నారు.

First Published:  27 July 2015 7:13 AM IST
Next Story